నూతన సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్లకు సంబంధించి చాలా నిబంధనలు మారాయి. మ్యూచువల్ ఫండ్స్‌ను మరింత పారదర్శకంగా, సురక్షితంగా మార్చేందుకు సెబీ కొత్త నిబంధనలను ప్రకటించింది. ఇవి జనవరి 1నుంచి అమల్లోకి రానున్నాయి.
మల్టీ క్యాప్ ఫండ్లలో పోర్ట్ ఫోలియో అలోకేషన్ మార్పు
మల్టీ క్యాప్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లకు సంబంధించి పోర్ట్‌ఫోలియో అలోకేషన్ నిబంధనలను సెప్టెంబర్‌లో మార్చింది. ఇవి 2021 జనవరి నుంచి అమల్లోకి రానున్నాయి. వీటి ప్రకారం మల్టీ క్యాప్ ఫండ్లలో కనీసం 75 శాతం ఈక్విటీలలో పెట్టుబడి పెట్టాలి. ప్రస్తుతం కనీస ఈక్విటీ పెట్టుబడి 65 శాతంగా ఉంది. కొత్త నిబంధనలు ప్రకారం.. స్మాల్, మిడ్, లార్జ్ క్యాప్‌లలో కనీసం 25 శాతం చొప్పున పెట్టుబడి పెట్టాలి. ప్రస్తుతం ఇలాంటి నిబంధన లేదు. ఫండ్ మేనేజర్లు వారి స్వంత నిర్ణయాన్ని బట్టి పెట్టుబడి చేయొచ్చు.
ఫ్లెక్సీ క్యాప్ పేరిట మరో మ్యూచువల్ ఫండ్ విభాగాన్ని సెబీ ప్రవేశపెట్టింది. దీనిలో 65 శాతం ఈక్విటీలో పెట్టుబడి పెట్టాలి. స్మాల్, మిడ్, లార్జ్ క్యాప్ లలో పెట్టుబడిపై నియంత్రణ లేదు. ఇప్పటికే కొన్ని కంపెనీల మ్యూచువల్ ఫండ్ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించాయి.
నెట్ అసెట్ వ్యాల్యూ గణనలో మార్పు
జనవరి 1 నుంచి పెట్టుబడి మొత్తం ఏఎంసీని చేరిన సమయం ఆధారంగా మాత్రమే ఎన్ఏవీ(నెట్ అసెట్ వ్యాల్యూ) నిర్ణీతమౌతుంది. పెట్టుబడి మొత్తంతో పాటు దరఖాస్తు అందిన సమయంతో దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఈ కొత్త నిబంధనలు లిక్విడ్, ఓవర్ నైట్ ఫండ్లకు వర్తించవు.
ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం.. రెండు లక్షల కంటే తక్కువ మొత్తంలో దరఖాస్తు కటాఫ్ సమయం ముందు అందినట్లైతే... పెట్టుబడి ఏఎంసీకి అందకపోయినప్పటికీ, అదే రోజు ఎన్ఏవీ ఆధారంగా యూనిట్లు పొందవచ్చు.