సొంత ఇల్లు అనేది ప్రతీ ఒక్కరి కల. చాలామందికి జీవిత లక్ష్యం. సొంత ఇల్లు ఉంటే భద్రతగా, సురక్షితంగా ఉన్న అనుభూతిని పొందుతారు. అప్పటి వరకు అద్దె ఇంటిలో ఉండి కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇల్లు కొనుగోలు చేస్తే ఉండే తృప్తి వేరుగా ఉంటుంది. స్వేచ్ఛగా జీవిస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఇంటి కొనుగోలు అంత సులభం కాదు. ఒక వ్యక్తి జీవితంలో చేసే అతి పెద్ద పెట్టుబడులలో ఇదీ ఒకటి. సరైన ప్రణాళిక లేకుండా సొంతింటి కలను సాకారం చేసుకోవడం కష్టమవుతుంది.
ఒక ప్రణాళిక ప్రకారం బడ్జెట్ వేసుకున్నప్పటికీ.. కొనుగోలు ప్రాసెస్ మొత్తం పూర్తయ్యే సరికి అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తం ఖర్చువుతుంది. దీని వల్ల అప్పులు చేస్తుంటారు. అలా జరగకుండా ఉండాలంటే.. ఇంటి కొనుగోలుకు సంబంధించి వాస్తవ ఖర్చులను ముందుగా తెలుసుకోవాలి. ఇంటి కోసం బిల్డర్ లేదా విక్రేతని సంప్రదించినప్పుడు.. వారు చెప్పిన అంచనా వ్యాయానికి వాస్తవ వ్యయానికి మధ్య వ్యత్యాసం ఉంటుంది. దీనికి కారణం అదనపు ఖర్చులు. వీటి కలయికతో అప్పటి వరకు ఉన్న ఆర్థిక ప్రణాళిక దారి తప్పుతుంది.
ఇల్లు కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నవారు అదనపు ఖర్చుల గురించి కూడా తెలుసుకుంటే.. సరైన ఆర్ధిక ప్రణాళికను సిద్ధంచేసుకుని ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. దీనివల్ల చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా నివారించవచ్చు.
ఇంటి కొనుగోలు చేసినప్పుడు ఉండే 5 ప్రధాన అదనపు ఖర్చులను ఇప్పుడు తెలుసుకుందాం..
1. స్టాంప్ డ్యూటి..
ఆస్తి లావాదేవీలపై ప్రభుత్వం విధించే తప్పనిసరి పన్ను స్టాంప్ డ్యూటి. ఇది అమ్మకపు ఒప్పందాన్ని ధృవీకరిస్తుంది. ఆస్తి అమ్మకం లేదా కొనుగోలుకు సాక్ష్యంగా పనిచేస్తుంది. ఇల్లు ఉన్న రాష్ట్రం, ఇంటివిలువ తదితర అంశాలపై ఆధారపడి ఆస్తి విలువలో 4 నుంచి 7 శాతం మధ్య స్టాంప్ డ్యూటి ఉంటుంది. ఉదాహరణకు, మీరు కొనుగోలు చేస్తున్న ఇంటి విలువ రూ. 50 లక్షలు ఉంటే, స్టాంప్ డ్యూటీ రూ.2 లక్షల నుంచి రూ.3.5 లక్షల వరకు ఉంటుంది. ఇది ఇంటి కొనుగోలుకు అయ్యే ఖర్చును పెంచుతుంది.
గుర్తించుకోండి.. స్టాంప్ డ్యూటిని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. అలాగే ఆస్తి ఉన్న ప్రదేశం బట్టి కూడా స్టాంప్ డ్యూటి మారుతుంది. అంటే ఆస్తి గ్రామీణ ప్రాంతంలో ఉంటే స్టాంప్ డ్యూటి కొంత తక్కువ ఉండచ్చు. అదే పట్టణ ప్రాంతాలలో ఉంటే పెరగొచ్చు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల పేరుపై, అఫర్డ్‌బుల్ ఇళ్లు కొనుగోలు చేసిన వారికి స్టాంప్ డ్యూటిపై 1శాతం రాయితీని అందిస్తున్నాయి. అందువల్ల ఒక రాష్ట్రంలో అంతర్గంగా వర్తించే స్టాంప్ డ్యూటిపై కూడా గణనీయమైన వ్యత్యాసం ఉండచ్చు.
2. రిజిస్ట్రేషన్ ఛార్జీలు..
కొనుగోలు సమయంలో ప్రభుత్వం విధించే మరో తప్పనిసరి ఖర్చు రిజిస్ట్రేషన్ ఛార్జీలు. కొనుగోలుదారుని పేరుపై ఆస్తిని నమోదు చేయడం, ఆస్తి యాజమాన్య రికార్డులను అప్‌డేట్ చేసేందుకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు విధిస్తారు. ఈ ఛార్జీలు ఇంటి విలువలో 1 శాతం ఉంటాయి. అంటే రూ. 50 లక్షల విలువైన ఇంటిని కొనుగోలు చేస్తే రూ.50వేల రిజిస్ట్రేషన్ ఛార్జీలకు చెల్లించాలి. ఇవి స్టాంప్‌డ్యూటికి అదనం.
3. వస్తుసేవల పన్ను(జీఎస్‌టీ)..