రూ.53,125 కోట్ల రైట్స్ ఇష్యూకు సంబంధించి మొదటి విడత చెల్లింపులు సోమవారం నుంచి ప్రారంభం అవుతాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. ఈ విషయంలో మదుపర్లకు సహకారం అందించేందుకు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వాట్సాప్ చాట్‌బోట్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. గతేడాది రైట్స్ ఇష్యూ ప్రారంభించినప్పుడు కూడా ఈ తరహా చాట్‌బోట్ సేవలను ఆర్‌ఐఎల్ ఏర్పాటు చేసింది. గతేడాది మేలో రైట్స్ ఇష్యూ కింద రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేరును రూ.1,257 చొప్పున మొత్తం 42.26 కోట్ల షేర్లను జారీ చేసి కేటాయించినట్లు ఎక్స్ఛేంజీలకు కంపెనీ తెలియజేసింది.
తొలి విడత కింద ఒక్కో రైట్స్ ఈక్విటీ షేరుకు రూ.314.25 (సెక్యూరిటీస్ ప్రీమియం రూ.311.75, ముఖ విలువ రూ.2.50 కలిపి)ను మే 17 నుంచి మే 31 వరకు చెల్లించాలని తెలిపింది. రెండోది లేదా చివరి విడత కింద రూ.628.50ను ఈ ఏడాది నవంబరు 15 నుంచి నవంబరు 29 వరకు చెల్లింపులు చేయాలని పేర్కొంది.