BMW iX SUV: తొలి దశలో అమ్మకానికి ఉంచిన బీఎండబ్ల్యూ పూర్తి స్థాయి విద్యుత్ స్పోర్ట్స్ యాక్టివిటీ వాహనం (ఎస్‌ఏవీ) 'ఐఎక్స్' కార్లన్నీ బుకింగ్స్ ప్రారంభమైన తొలిరోజే అమ్ముడయ్యాయి. సోమవారం ఆరంభమైన మొదటి దశ బుకింగ్‌లలో అనూహ్య స్పందన లభించినట్లు బీఎండబ్ల్యూ పేర్కొంది. ఆన్‌లైన్‌తో పాటు డీలర్‌షిప్‌లలో కార్లను బుక్ చేసుకున్నారని తెలిపింది. 2022 ఏప్రిల్ నుంచి డెలివరీలు మొదలవుతాయని సంస్థ వెల్లడించింది.
2022 తొలి త్రైమాసికంలో రెండో దశ బుకింగ్‌లు ప్రారంభమవుతాయని బీఎండబ్ల్యూ ప్రకటించింది. రాబోయే 6 నెలల్లో మన దేశంలోకి బీఎండబ్ల్యూ విడుదల చేయబోయే మూడు విద్యుత్ వాహనాల్లో ఐఎక్స్ మొదటిది. ఈ ఎస్‌ఏవీ ప్రారంభ ధర రూ.1.16 కోట్లు. పూర్తి స్థాయిలో సిద్ధం చేసిన వాహనం(సీబీయూ)గా ఈ కారును దిగుమతి చేసుకుంటారు.
ఇవీ ప్రత్యేకతలు..
ఆల్ వీల్ డ్రైవ్ వాహనం(ఎస్‌ఏవీ-స్పోర్ట్స్ యాక్టివిటీ వెహికల్)గా ఇది వస్తోంది. రెండు విద్యుత్తు మోటార్‌లతో నడిచే ఈ కారు 6.1 సెకన్లలోనే 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.
ప్రారంభ ఆఫర్ కింద స్మార్ట్ బీఎమ్‌డబ్ల్యూ వాల్‌బాక్స్ ఛార్జర్ ఉచితంగా ఇస్తున్నారు. 11కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్‌తో ఇంటి దగ్గర 7 గంటల్లో పూర్తి ఛార్జింగ్ అవుతుంది. 2.5 గంటల ఛార్జింగ్‌తో 100 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు.