చదువుల ఖర్చులు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఖర్చులను తప్పించుకోవడానికి లేదు. ఈ మొత్తాన్ని కూడబెట్టేందుకు పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంతమంది చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. వీటివల్లే ఆశించిన లక్ష్యానికి చేరడం కష్టంగా మారుతుంది. అది పిల్లల ఉన్నత చదువులపై ప్రభావం చూపిస్తుంది. సాధారణంగా పెట్టుబడుల విషయంలో చేసే పొరపాట్లు.. వాటిని ఎలా అధిగమించాలనేది చూద్దాం...
ద్రవ్యోల్బణాన్ని విస్మరిస్తే..
ఫీజులు పెరుగుతూ ఉండటం చాలామంది తల్లిదండ్రులకు ఆర్థికంగా భారం అవుతూ ఉంటుంది. ఉన్నత చదువుల ఖర్చు విషయం చెప్పక్కర్లేదు. దీన్ని తట్టుకునేందుకు పెట్టుబడి పెట్టే తరుణంలో.. ముఖ్యమైన అంశాన్ని మర్చిపోతుంటారు. ఇప్పటి ఖర్చులకు అనుగుణంగానే మదుపు చేసే ఆలోచనతో ఉంటారు. కానీ, భవిష్యత్తు వేరేగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. డబ్బు విలువను హరించే ద్రవ్యోల్బణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు. ప్రస్తుతం ఉన్నత చదువుకయ్యే ఖర్చు రూ.10లక్షలు ఉందనుకుందాం.. 10-15 ఏళ్లు గడిచే సరికి ఈ మొత్తం ఏమాత్రం సరిపోకపోవచ్చు. ఏడాదికి కనీసం 5శాతం ద్రవ్యోల్బణాన్ని అంచనా వేసుకున్నా.. 15 ఏళ్ల నాడు.. రూ.21.07 లక్షలు అవసరం అవుతాయి. అందుకే, భవిష్యత్తు అంచనాతో ఇప్పటి నుంచే పెట్టుబడులు ప్రారంభించాలి. క్రమానుగత పెట్టుబడి విధానంతో (సిప్) చిన్న మొత్తాలనైనా మదుపు చేస్తూ వెళ్లాలి. ఈ మొత్తాన్ని సాధించేందుకు ఎలాంటి మదుపు ప్రణాళికలు ఉండాలన్నది తెలుసుకునేందుకు అవసరాన్ని బట్టి, నిపుణుల సలహాలు తీసుకోవడమూ ఉత్తమం.
వాయిదాలు వద్దు..
ఇంకా సమయం ఉంది కదా.. ఇప్పటి నుంచే ఎందుకు.. ఈ ధోరణి చాలామందిలో కనిపిస్తూ ఉంటుంది. ఆలస్యం అమృతం విషం.. అనే నానుడి పెట్టుబడులకూ వర్తిస్తుంది. వాయిదా వేస్తున్న కొద్దీ.. పెట్టుబడి పెట్టాల్సిన మొత్తం పెరుగుతుంది. పైగా అనుకున్న మొత్తం రాకపోవచ్చు కూడా. ఎక్కువ వ్యవధి మదుపు చేసినప్పుడే చక్రవడ్డీ ప్రభావం వల్ల మన పెట్టుబడులు వృద్ధి చెందే అవకాశాలు పెరుగుతాయి. తల్లిదండ్రులుగా మారే ముందే.. పెట్టుబడులు ప్రారంభం కావాలి. ఉదాహరణకు మీరు బిడ్డ పుట్టగానే.. నెలకు రూ.10వేల చొప్పున ‘సిప్’ చేయడం ప్రారంభించారనుకుందాం. అప్పుడు మీ చిన్నారి 20 ఏళ్ల వయసుకు వచ్చేనాటికి మీ దగ్గర రూ.1.33 కోట్ల నిధి ఉంటుంది. దీనికోసం కనీసం 15శాతం రాబడి వచ్చేలా ఈక్విటీ పథకాల్లో మదుపు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ చిన్నారికి 5 ఏళ్లు వచ్చాక పెట్టుబడి ప్రారంభిస్తే.. 20 ఏళ్ల వయసు నాటికి రూ.61.73లక్షలు మాత్రమే ఉంటాయి. ఇక పదేళ్ల వయసు వచ్చాక పెట్టుబడి ప్రారంభిస్తే.. రూ.26.34లక్షలు మాత్రమే జమ చేయగలరు. చూశారుగా.. ఆలస్యం చేస్తున్న కొద్దీ.. పెట్టుబడి విలువ ఎలా తగ్గిపోయిందో.. అందుకే, దీర్ఘకాలిక లక్ష్యంతో పెట్టుబడులు కొనసాగించండి.
వైవిధ్యం పాటించకపోతే..