తెలంగాణ

telangana

ETV Bharat / business

మార్కెట్​ అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే ఇలా చేయండి

Financial Planning: ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ఎంత అవసరమో.. వెల్త్​ చెకప్​లు కూడా అంతే ముఖ్యం అంటున్నారు ఆర్థిక నిపుణులు. మార్కెట్​ అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే మీకు మీరే పలు ప్రశ్నలు సంధించుకోవాలంటూ సూచిస్తున్నారు. ఇంతకీ ఏంటా ప్రశ్నలు?

financial planning for 2022
కొత్తగా ప్రశ్నించుకుందాం

By

Published : Dec 24, 2021, 11:20 AM IST

Financial Planning: కరోనా.. ప్రతి ఒక్కరికీ పాఠాలు చెప్పింది. వేల కోట్ల వ్యాపారాల నుంచి సామాన్యుల జీవితాల వరకు అన్నిటినీ మార్చేసింది. ఇక భారత స్టాక్‌ మార్కెట్ల భవిష్యత్‌ అంచనాల ముఖ చిత్రమే మారిపోయింది. ఎన్నో హెచ్చు తగ్గులు చూడాల్సి వచ్చింది. రాబోయే సంవత్సరంలో స్థిరత్వంతో పాటు అన్నీ సానుకూలతలే రావాలని ఆశిద్దాం. అయితే ఇందుకోసం సిద్ధం కావాలి. డాక్టర్లు చెప్పినట్లు తరచూ ఆరోగ్య పరీక్షలు చేసుకున్నట్లే.. ఆర్థిక సలహాదార్లు చెప్పే 'వెల్త్‌ చెకప్‌'లూ అత్యంత ముఖ్యమని గ్రహించాలి. అపుడే కొత్త ఏడాదిని సరికొత్తగా ప్రారంభిస్తూ.. మార్కెట్‌ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వీలవుతుంది. అలా చేయాలంటే ఈ ప్రశ్నలు మీకు మీరు సంధించుకోండి.

1. లక్ష్యానికి తగ్గట్టుగానే వెళుతున్నారా?

లక్ష్యం ఆధారంగా పెట్టుబడులు పెట్టడం భారత్‌లో కొత్తేమీ కాదు. అయితే ఈ మధ్య వస్తోన్న మల్టీక్యాప్‌, ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్‌ పథకాలు మదుపర్లకు అన్ని విభాగాల్లో (లార్జ్‌, మిడ్‌, స్మాల్‌) ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వీలు కల్పిస్తున్నాయి. వీటిలో నష్టభయమూ తక్కువే. వీటితో పాటు మదుపర్లు తమ డబ్బులు పెరిగేందుకు వీలుండే ఇతరత్రా పెట్టుబడులనూ పరిశీలించాలి.

2. నష్టభయం-ప్రతిఫలం ఎలా ఉంది?

సాధారణంగా నష్టభయం అనేది ఒత్తిడితో కూడుకున్న అంశంగా భావిస్తుంటారు. అయితే మార్కెట్‌ అంటే అవగాహన ఉన్న వారికి నష్టభయం, ప్రతిఫలం రెండింటికీ విడదీయరాని సంబంధం ఉందని అర్థమవుతుంది. మదుపర్లు తమ పోర్ట్‌ఫోలియోలో నష్టభయం ఎంత ఉండొచ్చన్నది తమ అవసరాలు, ఆర్థిక స్తోమతలకు అనుగుణంగా నిర్దేశించుకోవాలి.

3. అవకాశాల సంగతేమిటి?

భారత్‌లో దూకుడుగా పెట్టుబడులు పెట్టేవారి కంటే నెమ్మదిగా ముందుకెళ్లేవారే ఎక్కువ. ఈటీఎఫ్‌లు, ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌, ఇండెక్స్‌ ఫండ్‌లలో పెట్టుబడులు పెడుతుంటారు. ఒకే ఇండెక్స్‌లో కంటే మదుపర్లకు మెరుగైన ప్రతిఫలాలను అందించగలిగే సత్తా గల రంగాల్లో దృష్టి సారించినపుడే అవకాశాలు అందిపుచ్చుకుంటాం.

4. పెట్టుబడి లక్ష్యాలను సమీక్షించారా?

రెండేళ్లలో నాటకీయ పరిణామాలు జరిగాయి. ప్రజల అవసరాలు, ప్రాధాన్యాలు మారాయి. కొత్త ఏడాది ప్రారంభంలో మన పెట్టుబడులను పునః సమీక్షించుకోవడం ఎంతైనా మేలు. మీరు పెళ్లి చేసుకోవాలన్నా/చేయాలన్నా, ఉన్నత విద్య ప్రణాళిక ఉన్నా, కుటుంబంలోకి కొత్త సభ్యులు వస్తున్నా, మార్కెట్లో కొత్త అవకాశాల కోసం నిధి కేటాయించాలనుకుంటున్నా.. వీటన్నిటి మధ్య సమతౌల్యం పాటించడం ముఖ్యం. పోర్ట్‌ఫోలియోను మీ లక్ష్యాలకు, భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా మార్చుకోండి.

5. దేశం వెలుపలా చూస్తున్నారా?

భారత మార్కెట్లో కొత్త అవకాశాలకు కొదవ లేదు. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ప్రయోజనాలనూ పరిశీలించడంలో తప్పు లేదు. మరీ ముఖ్యంగా నష్టభయాన్ని తట్టుకోగలమన్న ధైర్యం ఉంటే తప్పక ఓ చూపు చూడాలి. దీర్ఘకాలంలో సంపదను సృష్టించడం కోసం అభివృద్ధి చెందిన దేశాల మార్కెట్లో ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ వంటి మార్గాల ద్వారా పెట్టుబడులు పెట్టవచ్చు.

6. అత్యవసరాలకు పెట్టుబడి పెట్టారా?

జీవితంలో ఏదీ అంచనాలకు అనుగుణంగా నడవదు. మరీ ముఖ్యంగా వందేళ్లకోసారి కనిపించే ఈ తరహా మహమ్మారి వచ్చినపుడు. ఈ సమయంలో 'అన్నిటికీ సిద్ధంగా ఉండటం' అనే సూత్రం చాలా ముఖ్యం. అందుకే అత్యవసర సమయాల కోసం ఒక 'నిధి' ఉండాలి. ఇందుకోసం ఓవర్‌నైట్‌ ఫండ్‌, లిక్విడ్‌ ఫండ్‌, లో డ్యూరేషన్‌ డెట్‌ ఫండ్‌ లేదా ఫ్లోటర్‌ ఫండ్లను పరిశీలించొచ్చు.

కొత్త సాధారణ ప్రపంచంలో ఆలోచనలతోపాటు, ఆచరణలోనూ వినూత్నంగా ఉండాల్సిన అవసరం ఉంది. అప్పుడే లక్ష్యాలను సులువుగా సాధించగలం. దీర్ఘకాలిక దృష్టితో మంచి రాబడి వచ్చే చోట మదుపు చేయడం ఎప్పుడూ అవసరం. అన్ని కంపెనీలూ, రంగాలూ ఇప్పుడుస్తున్న ప్రతిఫలాలను భవిష్యత్తులోనూ ఇస్తాయని అనుకోలేం. అందుకే, 'నాణ్యత'పై దృష్టి సారించాలి. ఒకేసారి మొత్తం పెట్టుబడుల్లో మార్పులు చేయడం సాధ్యం కాదు. కానీ, కొత్త సంవత్సరం వేడుకల తరుణంలో ముందుగానే మన ఆర్థిక నిర్ణయాలను తీసుకుంటే.. భవిష్యత్‌కు ఒక ధీమా ఏర్పడుతుంది.

- రాజీవ్‌ అయ్యంగార్‌, చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌, యాక్సిస్‌ ఏఎంసీ

ఇదీ చూడండి :వినియోగదారులకు షాక్​- పెరగనున్న ఆ వాహన ధరలు

ABOUT THE AUTHOR

...view details