తెలంగాణ

telangana

By

Published : May 26, 2020, 2:08 PM IST

ETV Bharat / business

కరోనాతో ఆదాయం డౌన్​.. ఏం చేయాలంటే?

కరోనా సంక్షోభం, లాక్​డౌన్​లు ప్రజల ఆదాయాన్ని దెబ్బకొట్టాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన సొంత బడ్జెట్​ ప్రణాళికను చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. అనవసర ఖర్చులు, శక్తి మించిన అప్పుల జోలికి పోకూడదు. అయితే జీవిత, ఆరోగ్య బీమా లాంటి వాటికి ప్రీమియం చెల్లింపులు మాత్రం ఆపకూడదు.

financial planning in corona crisis
ఇంటి బడ్జెట్​

కరోనా మహమ్మారి ఎంతోమంది ఆదాయాలపై ప్రభావం చూపింది. ఇప్పుడిప్పుడే లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలిస్తున్నా.. ఇంకా పరిస్థితులన్నీ చక్కబడేందుకు ఎంతకాలం పడుతుందన్నది కచ్చితంగా చెప్పలేం. నిజానికి ఇది ఆరోగ్య అత్యవసరంతోపాటు ఆర్థిక అత్యవసరమనే చెప్పాలి. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. పాటించాల్సిన ఆర్థిక సూత్రాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇప్పుడు మనం అందరమూ ఊహించని ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. ఆదాయం తగ్గిపోవడం, రుణాలు చెల్లించకుండా వాయిదా వేయడం, వ్యాపారాలు అన్నీ ఆగిపోవడంలాంటివన్నీ చూస్తూనే ఉన్నాం. సామాన్యులకు ఈ కష్టం నుంచి గట్టెక్కడం పెద్ద సవాలుగానే మారింది. ఉన్న డబ్బును సమర్థంగా నిర్వహించడంతోపాటు, ఆదాయానికి అనుగుణంగా మన అలవాట్లన్నీ మారిపోవాలి.

ఆలోచించి నిర్ణయం..

తగ్గిన ఆదాయాన్ని భర్తీ చేసుకునేందుకు కొన్ని పెట్టుబడుల నుంచి డబ్బును తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు. లేదా ఆస్తులను విక్రయించాలని ఆలోచిస్తుంటారు. అయితే, ఇందులో ఏ నిర్ణయం తీసుకుంటున్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించేందుకు పెట్టుబడులు పెడుతుంటాం. ఆస్తులను కూడబెట్టడం సంపదను సృష్టించడం. తాత్కాలిక నష్టాన్ని గట్టెక్కించేందుకు ఈ రెండింటినీ వాడుకుంటే.. నష్టపోయేది మనమే. ఇప్పుడు పెట్టుబడులు కొన్ని నష్టాల్లోనే ఉండొచ్చు. భవిష్యత్తులో అవి మంచి రాబడిని అందిస్తే ఆ అవకాశాన్ని కోల్పోతాం. ఇక ఆస్తులను విక్రయిస్తే.. మన అవసరం వేరొకరికి లాభం చేకూరుస్తుంది. కనుక కష్టం వచ్చిందని.. ఉన్న పెట్టుబడులు, ఆస్తులన్నింటి నుంచి నగదును తీసుకోవడానికి ప్రయత్నించకూడదు. వెంటనే నగదుగా మార్చుకున్నా.. తర్వాత వాటిలో తిరిగి డబ్బు పెట్టగలం అనుకున్నవాటిని మాత్రమే వాడుకోండి. ఇంకా డబ్బు అవసరం అయితే.. పీపీఎఫ్‌, ఈపీఎఫ్‌లాంటి దీర్ఘకాలిక పథకాలను పరిశీలించండి. పెట్టుబడులను ఉపసంహరించుకునేటప్పుడు పన్ను భారాన్ని లెక్కించడం మర్చిపోవద్దు.

ఆలస్యం చేయొద్దు...

ఉద్యోగం పోయినా.. ఆదాయం లేకపోయినా.. కొన్ని చెల్లింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేయొద్దు. ఇందులో ముఖ్యంగా జీవిత, ఆరోగ్య బీమా పాలసీలను చెప్పుకోవాలి. మహమ్మారి మధ్య దశలో ఉన్నాం. ఇలాంటప్పుడు మనకు ఆర్థిక అండగా ఉండేవి ఈ పాలసీలే. ముఖ్యంగా ఆరోగ్య బీమా ప్రీమియాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయొద్దు. ఇప్పటికే యాజమాన్యం అందిస్తున్న ఆరోగ్య బీమా ఉన్నప్పటికీ.. సొంతంగా మరో పాలసీనీ తీసుకోండి. అనుకోకుండా ఉద్యోగం మారినా.. కోల్పోయినా.. బీమా రక్షణ దూరం కాదు. బృంద బీమా పాలసీని వ్యక్తిగత పాలసీగా మార్చుకునే వీలుందా అనేదీ చూసుకోండి. వీలైతే టాపప్‌, సూపర్‌ టాపప్‌ చేయించండి. జీవిత బీమా అవసరాన్నీ మరోసారి సమీక్షించుకోండి.

తాత్కాలికంగా ఆపేయండి..

పెట్టుబడుల క్రమం ఎప్పుడూ తప్పకూడదు. కానీ, నగదు లభ్యత సరిపోయినంత లేనప్పుడు.. వాటిని తాత్కాలికంగా ఆపడమే మార్గం. దీనివల్ల మీరు రోజువారీ ఖర్చులకు కొంత వెసులుబాటు దొరుకుతుంది. మళ్లీ ఆదాయం గాడినపడినప్పుడు వెంటనే పెట్టుబడులను ప్రారంభించండి. నిలిపి వేసిన వ్యవధికి జమ చేయాల్సిన మొత్తాన్నీ భర్తీ చేసేందుకు ప్రయత్నించాలి.

బడ్జెట్‌ మారాలి..

ఆదాయం.. ఖర్చులు.. ఈ రెండింటికీ ఎప్పుడూ సమతూకం ఉండాల్సిందే. నిజానికి మన ఆదాయం కన్నా ఖర్చులు 30-40 శాతం తక్కువే ఉండాలి. ఇప్పుడు ఆదాయం తగ్గినా.. లేక పూర్తిగా ఆగిపోయినా చేయాల్సిన మొదటి పని మీ కుటుంబ బడ్జెట్‌ లెక్కలు మార్చడమే. ఈ సంక్షోభ సమయంలో మీ పాత బడ్జెట్‌ ఏమాత్రం సరిపోదు. కొత్త పరిస్థితులకు అనుగుణంగా మీ జీవన శైలి మారిపోవాలి. ఖర్చులు తగ్గించుకుంటూనే.. నగదు నిల్వ పెంచుకునే ప్రయత్నం మొదలు పెట్టాలి. అనవసర ఖర్చులను నియంత్రిస్తూ.. వాస్తవ పరిస్థితుల్లో జీవించాలి. సంక్షోభానికి ముందు.. చేసిన ఎన్నో ఆడంబర ఖర్చులు ఇప్పుడు మనకు సాధ్యం కాదనేది గుర్తించాలి. నిత్యావసరాలు, అత్యవసరాల కోసం ఎంత డబ్బు కావాలి.. వస్తున్న ఆదాయం దానికి సరిపోతుందా? ఇంకా ఏమైనా తక్కువపడుతుందా అనేది లెక్కలు వేసుకోండి. ఇప్పటికిప్పుడు కాకున్నా.. నాలుగైదు నెలల్లో ఆదాయం మెరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయా? చూసుకోండి. ఖర్చులకు ప్రాధాన్యక్రమం రాసుకోండి. అనవసరం అనుకున్న చిన్న ఖర్చునైనా తగ్గించుకునే విషయంలో మొహమాటపడొద్దు. ఎన్నో రోజులుగా మీరు కష్టపడి దాచుకున్న డబ్బే మీకిప్పుడు ఆధారం. అందుకే, కాస్త అతి జాగ్రత్త తప్పదు. ఇప్పటికే మీ దగ్గర 6-8 నెలల ఖర్చులకు సరిపడా డబ్బు అత్యవసర నిధిగా ఉందనుకుందాం.. ఇందులో నుంచి తీసి, మొత్తం ఖర్చు చేయకుండా.. ఒక నెల ఖర్చు... రెండు నెలలకు సరిపోయేలా చూసుకోవాలి. దీనికోసం ఏం చేయాలన్నది ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే.. ఆదాయం తగ్గినా.. తగ్గకపోయినా.. కరోనాకు ముందులా ఖర్చులు పెడితే మాత్రం భవిష్యత్తులో కష్టమే.

అవసరానికి మించి..

అత్యవసర నిధి.. ఆదాయం లేనప్పుడు.. నిత్యావసరాల కోసం అప్పు చేయక తప్పదు. ఇలాంటప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన సూత్రం ఒకటే. అవసరానికి మించి రుణం తీసుకోకూడదు. ఈ తరుణంలో వడ్డీ భారం అధికంగా ఉండే రుణాల జోలికి అస్సలు వెళ్లకూడదు. అనేక అప్పులు తీసుకునే బదులు మీ అవసరాలన్నీ తీరేలా ఒకే రుణాన్ని తీసుకోండి. సంప్రదాయ బీమా పాలసీలు ఉన్నవారు.. ఆ పత్రాలను హామీగా ఉంచి, అప్పు తీసుకోవచ్చు. వీటికి వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. వ్యక్తిగత రుణాలతో పోలిస్తే.. క్రెడిట్‌ కార్డు రుణాలకు వడ్డీ ఎక్కువ. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బంగారంపై అప్పు తీసుకునేందుకు ప్రయత్నించండి. కాస్త అధిక వ్యవధిని ఎంచుకోండి. అప్పుడు ఈఎంఐలను చెల్లించేందుకు మీకు కాస్త వెసులుబాటు దొరుకుతుంది. ఆదాయం లేకపోయినా.. కొన్నాళ్లపాటు ఇబ్బంది ఉండదు. నియంత్రణ సంస్థల గుర్తింపు పొందిన వాటి నుంచే రుణం తీసుకోవడం మేలు. క్రెడిట్‌ కార్డులతో అధిక మొత్తం కొనుగోళ్లు, నగదును తీసుకోవడంలాంటి వాటికి దూరంగా ఉండాలి.

- అధిల్‌ శెట్టి, సీఈఓ, బ్యాంకుబజార్​.కామ్​

ఇదీ చూడండి:అంతర్జాతీయ సానుకూలతలతో దూసుకెళ్తోన్న మార్కెట్లు

ABOUT THE AUTHOR

...view details