Financial Planning Health: జీవితంలో అనిశ్చితి ఏర్పడినప్పుడు మన ఆర్థిక ప్రణాళికలు పట్టాలు తప్పుతుంటాయి. అయినప్పటికీ కాస్త జాగ్రత్తగా వాటిని మళ్లీ గాడిన పెట్టొచ్చు. కొత్తగా ప్రారంభించొచ్చు. అయితే, ముందుగా మన ఆర్థికారోగ్యం ఎలా ఉంది? అనే సంగతి తెలుసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం కొన్ని ప్రశ్నలకు మనకు మనమే సమాధానం చెప్పుకోవాలి. ముందుగా మనం ఆర్థికంగా ఇబ్బందుల్లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? గత అనుభవాల దృష్ట్యా ఇప్పుడు ఏం చేయాలి అనేది తెలుసుకోవాలి.
పదవీ విరమణ ప్రణాళిక..
సంపాదన మొదలైనప్పుడే పదవీ విరమణ ప్రణాళిక ప్రారంభం కావాలి. పీపీఎఫ్, జాతీయ పింఛను పథకం, యాన్యుటీ ప్లాన్లు ఇలా ఏదో ఒకదాంట్లో మదుపు చేయాలి. బంగారం, స్థిరాస్తి, ఇతర పెట్టుబడి పథకాలనూ పరిశీలించాలి.
ఎ) ఇప్పటివరకూ పదవీ విరమణ ప్రణాళికలు ప్రారంభించలేదు.
బి) పదవీ విరమణ ప్రణాళిక ఉంది. కానీ, తగిన పెట్టుబడులు లేవు.
సి) అనుకున్నట్లుగానే పదవీ విరమణ పెట్టుబడులు కొనసాగుతున్నాయి.
అత్యవసర నిధి..
చాలామందికి అనుకోని ఖర్చులను తట్టుకోవడం ఎలాగో తెలియదు. కొంతమందికిది దాదాపు అసాధ్యం కూడా. ఇలాంటి పరిస్థితి రెండేళ్లుగా ఎంతోమందికి ఎదురయ్యింది. అందుకే, ప్రతి కుటుంబం అత్యవసర నిధికి ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే కొత్త అప్పులు చేయకుండా.. ఉన్న పొదుపు, పెట్టుబడులను వెనక్కి తీసుకోకుండా ఉండగలం. కనీసం ఆరు నెలలకు సరిపోయే అత్యవసర నిధి మీ దగ్గర ఉందా లేదా చూసుకోండి.
ఎ) అత్యవసర నిధి లేదు.
బి) అత్యవసర నిధి ఉంది. గతంలో అనుకోని ఖర్చులకు ఉపయోగపడింది.
సి) అత్యవసర నిధి ఉన్నా ఇప్పటివరకూ అవసరం రాలేదు.
బీమా...
అనుకోని పరిస్థితుల్లో వచ్చే ఆర్థిక భారాన్ని తట్టుకునే శక్తిని బీమా పాలసీలు ఇస్తాయి. 2020, 2021లో ఎంతోమందికి ఆరోగ్య బీమా అవసరం ఏర్పడింది. జీవిత బీమా పాలసీలు.. కుటుంబ పెద్దకు ఏదైనా జరిగినప్పుడు ఆ బాధ్యతను కొంతమేరకు తీసుకుంటాయి. అత్యవసర నిధి తర్వాత మనకు ఉండాల్సిన మరో ముఖ్యమైన అంశం బీమానే.
ఎ) ఇప్పటికీ బీమా పాలసీలు లేవు.
బి) ఆరోగ్య బీమా ఉంది.. గతంలో క్లెయిం చేసుకున్నాం.
సి) ఆరోగ్య బీమా పాలసీ అవసరం ఇప్పటి వరకూ రాలేదు.