తెలంగాణ

telangana

ETV Bharat / business

Financial Planning for 2022: కొత్త ఏడాదికి ఆర్థిక ప్రణాళిక వేసుకోండిలా..!

రెండేళ్లుగా కరోనా మహమ్మారి ఎంతో మంది ఆర్థిక పరిస్థితిని అల్లకల్లోలం చేసింది. అంతమాత్రాన అక్కడితో ఆగిపోలేం కదా.. పొరపాట్లకు తావీయకుండా.. కొత్త ఏడాదిని ప్రారంభించాలి. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నించాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాలను చేరుకొని, ఆర్థిక ఉన్నత శిఖరాలను అధిరోహించగలం. అయితే కొత్త ఏడాది కలిసొచ్చేలా ఎలా ప్లాన్​ వేసుకోవాలంటే?

By

Published : Dec 31, 2021, 12:41 PM IST

Financial Planning for 2022
Financial Planning for 2022

Financial Planning for 2022: కొత్త ఏడాదిని స్వాగతించేందుకు సిద్ధమవుతున్నాం. ఇదే సమయంలో పాత సంవత్సరం మిగిల్చిన అనుభవ పాఠాలను భవిష్యత్‌ ఆర్థిక విజయాలకు పునాదులుగా మలచుకునే ఆలోచనా సమయమిది. ఇప్పటివరకూ మనం ఎక్కడ ఉన్నాం.. రాబోయే రోజుల్లో ఎలా ఉండాలి అని నిర్ణయించుకునే తరుణమూ ఇదే. కొత్త నిర్ణయాలు తీసుకునే వేళలో 2022 మనకు కలిసొచ్చేలా ఏం చేయాలో తెలుసుకుందామా..

సరిచూసుకోవాలి..

పెట్టుబడుల పనితీరు ఎలా ఉంది, మిగులు మొత్తం ఏమైనా పెరిగిందా.. ఖర్చులు ఏ మేరకు పెరిగాయి.. క్రెడిట్‌ నివేదిక సంగతేమిటి.. ఇలా మీ డబ్బు గురించి కనీసం రెండుమూడు నెలలకోసారైనా ఆరా తీయండి. దీనివల్ల ఆర్థిక పయనం ఎటువైపు సాగుతోందన్నది కచ్చితంగా తెలుసుకునే వీలుంటుంది. బ్యాంకు ఖాతా, క్రెడిట్‌ కార్డు బిల్లులను ప్రతి నెలా సరిచూసుకోండి.

ధైర్యంగా పెట్టుబడులు...

2020లో స్టాక్‌ మార్కెట్‌ ఒక్కసారిగా పడిపోయింది. అప్పుడు ఆందోళన చెందకుండా క్రమంగా పెట్టుబడులు పెట్టిన మదుపరులకు ఆ తర్వాత మంచి ఫలితాలే వచ్చాయి. 2021లో సూచీలు జీవన కాల గరిష్ఠాలను తాకాయి. పతనం అయినప్పుడు కొంతమంది సిప్‌లను ఆపేశారు. పెట్టుబడులనూ వెనక్కి తీసుకున్నారు. వారందరూ మంచి రాబడులను కోల్పోయారు. ఐపీఓలు, ఎన్‌ఎఫ్‌ఓలు ఎన్నో ఈ ఏడాది పలకరించాయి. క్రిప్టో కరెన్సీలాంటి కొత్త పెట్టుబడి విధానాలూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఎవరో ఏదో పెట్టుబడులు పెడుతున్నారని మనమూ అదే మార్గంలో వెళ్లడం సరికాదు. తెలియని, అర్థంకాని వాటి జోలికి వెళ్లకూడదు. క్రమానుగత పెట్టుబడి విధానంలో దీర్ఘకాలం కొనసాగడం ఎప్పుడూ మంచిది. ప్రతి పెట్టుబడీ ఒక లక్ష్యం కోసమే ఉండాలి. మార్కెట్‌ ఇప్పుడున్న స్థాయుల నుంచి మరింత పెరగొచ్చు. లేదా తగ్గొచ్చు. వీటిని పట్టించుకోకుండా ధైర్యంగా మదుపు కొనసాగాలి.

ధీమాగా ఉండేలా..

మహమ్మారి బీమా అవసరాన్ని రెట్టింపు చేసింది. మీకు ఇప్పటివరకూ ఉన్న జీవిత, ఆరోగ్య బీమా పాలసీలను సమీక్షించుకోండి. జీవిత బీమా పాలసీ విలువ వార్షికాదాయానికి కనీసం 10-12 రెట్లు ఉండాలనేది నిపుణుల సూచన. తక్కువగా ఉంటే.. పెంచుకునేందుకు ప్రయత్నించండి. కుటుంబానికి అంతటికీ వర్తించేలా కనీసం రూ.10లక్షల ఆరోగ్య బీమా ఉండటం ఇప్పుడు ఎంతో అవసరం. వ్యక్తిగత ప్రమాద బీమా, క్రిటికల్‌ ఇల్‌నెస్‌, డిజేబిలిటీలాంటి అనుబంధ పాలసీలూ ఉండాలి. వాహన, గృహ బీమా విషయాల్లోనూ నిర్లక్ష్యం తగదు.

ఖర్చుల లెక్కలు రాసుకోండి...

జనవరి మొదలు.. ప్రతి నెలా ఏయే ఖర్చులు ఉంటాయన్నది మనకు ఒక అవగాహన కచ్చింతంగా ఉండాలి. పిల్లల ఫీజులు, బీమా పాలసీల ప్రీమియాలు, విహార యాత్రలు, ఏదైనా కొనుగోలు ఇలా ప్రతి విషయానికీ ఏ నెలలో ఎంత మొత్తం అవసరం అవుతుందనే ప్రణాళిక ఉండాలి. 2021లో అయిన ఖర్చులను ఒకసారి పరిశీలిస్తే మీకు మరింత అవగాహన వస్తుంది. ఆదాయంలో 50శాతం నిత్యావసరాలకూ, 20 శాతం అవసరమైన కొనుగోళ్లకు, 20 శాతం పొదుపు-పెట్టుబడులకూ కేటాయించాలి. దీన్ని బడ్జెట్‌ రూపంలో వేసుకోవాలి. అత్యవసర నిధి తప్పనిసరి అనేది మర్చిపోకూడదు. 2020లో గృహరుణ మారటోరియాన్ని తీసుకుంటే.. మిగలు మొత్తంతో ఆ బాకీని తీర్చేసేందుకు ప్రయత్నించండి.

ద్రవ్యోల్బణానికి మించి

2021లో సురక్షిత పెట్టుబడులపై రాబడి తక్కువే వచ్చింది. ఈక్విటీల్లో పెట్టుబడులు మంచి లాభాలు అందించాయి. ద్రవ్యోల్బణం అధికంగా ఉండటం వల్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఇతర సురక్షిత పథకాల నుంచి వచ్చిన నికర ప్రతిఫలం నామమాత్రమే. నష్టభయం భరించలేని మదుపరులు ద్రవ్యోల్బణాన్ని అధిగమించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో పెట్టుబడులు వైవిధ్యంగా ఉండేలా చూసుకోవాలి. నష్టభయం భరించే సామర్థ్యం, ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా పథకాల ఎంపిక ఉండాలి. గతకాలపు పనితీరు ఆధారంగా పెట్టుబడులను కేటాయించకూడదు. భవిష్యత్తులో ఎంత మేరకు రాణిస్తాయనేది అంచనా వేసుకోవాలి.

డబ్బును ఎలా పొదుపు చేయాలి అనేది నిత్యం నేర్చుకోవాల్సిన పాఠం. ఆర్థిక ఇబ్బందులు రాకుండా జీవనం గడపాలి అనే కోరిక బలంగా ఉండాలి. ఈ రెండింటితో పాటు ఆర్థిక క్రమశిక్షణా పాటించాలి. ఇప్పటివరకూ ఖర్చు పెడుతూ.. ఇప్పటికిప్పుడు పొదుపరిగా మారినంత మాత్రాన వెంటనే ఫలితాలు కనిపించకపోవచ్చు. కొంత సమయం ఇవ్వండి. ఆ తర్వాత ఆర్థిక విజయాన్ని ఆస్వాదించండి.

ఇదీ చూడండి:రూ.75,00,000 కోట్లు.. ఏడాదిలో పెరిగిన మదుపర్ల సంపద

ABOUT THE AUTHOR

...view details