financial planning: కొవిడ్ కష్టకాలంలో వ్యాపారాలు సరిగా నడవకపోవడం, ఆదాయాలు తగ్గడం, వైద్య ఖర్చులు... ఇలా ఏదో ఒక రూపంలో ప్రతి ఒక్కరూ ఆర్థిక చిక్కులను ఎదుర్కొన్నారు. వీటిలో మార్పులు చేర్పులు చేసుకునేందుకు, సరికొత్తగా తయారు చేసుకునేందుకు కొత్త ఆర్థిక సంవత్సరాన్ని మించిన తరుణం ఏముంటుంది. మరికొన్ని రోజుల్లో ఇది ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రణాళికలు ఎలా ఉండాలో ఏంజెల్ వన్ లిమిటెడ్, డీవీపీ-ఈక్విటీ స్ట్రాటజిస్ట్ జ్యోతి రాయ్ పలు విషయాలు తెలిపారు.
ఇప్పటివరకూ ఎప్పుడూ మీరు ఆదాయ-వ్యయాల లెక్కలు చూసుకోకపోతే.. ఇప్పుడు దీన్ని ప్రారంభించండి. ముందుగా మీ ఖర్చులతోనే ప్రణాళిక మొదలుపెట్టండి. మీరు ఎందుకోసం, ఎంత ఖర్చు చేస్తున్నారన్నది తెలిస్తేనే.. ఆర్థిక క్రమశిక్షణ పాటించేందుకు సిద్ధం అవుతారు. ఎక్కడ తగ్గించుకోవాలో తెలిస్తే.. పొదుపు మొత్తం పెంచుకున్నట్లే. ఒక నెలలో అయిన ప్రతి ఖర్చునూ లెక్క రాయండి. అనవసర ఖర్చులు ఏమున్నాయో గుర్తించండి. తిరిగి వాటి జోలికి వెళ్లకుండా జాగ్రత్త వహించండి. ఇప్పటికే మీరు ఖర్చుల లెక్కలు రాస్తుంటే.. మరోసారి వాటిని జాగ్రత్తగా గమనించండి. అందులో మీరు అనుకోకుండా చేసిన అనవసర ఖర్చులుంటే.. భవిష్యత్తులో వాటిని పరిహరించండి.
లక్ష్యాల సమీక్ష..
ప్రతి వ్యక్తి తన సంపాదనలో కొంత మొత్తాన్ని ఆర్థిక లక్ష్యాల సాధనకు కేటాయిస్తారు. పొదుపు, పెట్టుబడుల రూపంలో ఇది ఉంటుంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఈ లక్ష్యాలను ఒకసారి సమీక్షించుకోండి. ఆర్థిక లక్ష్యాల్లో మార్పులు చేర్పులు ఉంటే దానికి అనుగుణంగా పెట్టుబడి పథకాలనూ మార్చుకోవాలి. ఉదాహరణకు 10 ఏళ్ల తర్వాత ఇల్లు కొందామని అనుకున్నారనుకుందాం.. మారిన పరిస్థితుల్లో ఆరేళ్లకు ఆ లక్ష్యాన్ని కుదించుకుంటే.. దాన్ని తగ్గట్టు పెట్టుబడుల కేటాయింపులూ మారాలి. నెలవారీ మదుపు మొత్తం పెరగాలి. అందుకు అనుగుణంగా మీ బడ్జెట్‌ను సిద్ధం చేసుకోవాలి.
పెట్టుబడుల విషయంలో..