ఆర్థిక స్వాంతంత్య్రం సాధించడం అంటే.. మీరు.. మీ ప్రియమైన కుటుంబ సభ్యులు ఆరోగ్యంగానూ.. ఆర్థికంగానూ ఎలాంటి ఇబ్బందులూ పడకుండా ఉండాలి. భవిష్యత్తు మీ నియంత్రణలో ఉండాలి. ఆర్థిక భద్రత లేకపోవడం, సంక్షోభంలాంటివి మీకు వినిపించకూడదు. మనందరం ఒకానొక సమయంలో పదవీ విరమణ చేస్తాం.. లేదా ముందస్తు పదవీ విరమణనూ ఎంచుకుంటాం.. ఆ తర్వాతా ఎలాంటి ఇబ్బందులూ లేని ప్రశాంత జీవితం సాధ్యం కావాలి. జీవితంలో ఎన్నో అవాంతరాలు వస్తుంటాయి. వీటన్నింటినీ తట్టుకొని నిలబడాల్సిందే. దానికీ ఆర్థికంగా మనం స్వేచ్ఛను సాధించాల్సిందే.
ఆలోచనతోనే మొదలు..
మనల్ని మనం పరిపాలించుకోవాలి.. అన్న ఆలోచనతోనే కదా.. స్వాతంత్య్ర పోరాటం మొదలయ్యింది. అంటే.. ఎంత పెద్ద సంఘటన అయినా.. చిన్న ఆలోచనతోనే ప్రారంభం అవుతుంది. ఆలోచన నుంచి వాస్తవ రూపం దాల్చేలోపు ఎన్నో సంఘర్షణలు. బలిదానాలు తప్పవు. ఆర్థిక స్వేచ్ఛ విషయంలోనూ ఇదే స్ఫూర్తి. ముందుగా పెట్టుబడులు పెట్టాలనే ఆలోచనకు అంకురార్పణ చేయండి. మీ ఆర్థిక లక్ష్యాల సాధనకు చిన్న మొత్తమైనా పెట్టుబడికి కేటాయించండి. నెలకు రూ.1,000, రూ.1,500లతోనూ మదుపు ప్రారంభించే అవకాశం ఉందని మర్చిపోకండి. ఈ దశలో కొన్ని త్యాగాలు తప్పవు. అనవసర వృథా ఖర్చులను తగ్గించుకోవడం తప్పనిసరి. మీ ఆదాయాన్ని పొదుపు, ఖర్చులు, పెట్టుబడులు అనే మూడు రకాలుగా వర్గీకరించుకోండి. ఆదాయం పెరుగుతున్న కొద్దీ.. పొదుపు, పెట్టుబడులు పెంచుకుంటూ వెళ్లండి. వ్యయాలను కాదు.
కోరుకుంటేనే చాలదు..
స్వేచ్ఛ కావాలని అందరూ కోరుకున్నారు. కానీ, కొద్దిమంది మాత్రమే దాని కోసం పోరాడారు. అదే విధంగా ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరాలని అందరూ అనుకుంటారు. కానీ, దాన్ని నిజం చేసుకునేందుకు కొందరు మాత్రమే కష్టపడతారు. ఆకాంక్షలను గుర్తించి, వాటిని సాధించేందుకు ఒక కచ్చితమైన ప్రణాళిక ఉండాలి. ఆ తర్వాత దాన్ని సాధనకు పనిచేయాలి. క్రమానుగత పెట్టుబడులతో మీ కలలను నిజం చేసుకోవాలి. మీ అవసరాలకు సరిపోయే పథకాలేమిటి? వాటిని ఎంచుకోవడం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి.. ఇలాంటి వాటన్నింటిపైనా కాస్త అవగాహన పెంచుకోవాలి. ఏం చేయాలన్నది తెలియకుండా.. ప్రణాళిక వేసుకుంటే ఉపయోగం ఉండదు.
వైవిధ్యం ఉండేలా..
స్వాతంత్య్రం సాధనలో ఎన్నో రకాల పోరాటాలు జరిగాయి. పెట్టుబడుల్లోనూ ఇది వర్తిస్తుంది. ఒకే పథకం అందరికీ నప్పకపోవచ్చు. పెట్టుబడిని కాపాడుకునేందుకు ఉన్న మొత్తాన్ని వివిధ పథకాలకు కేటాయించడం ఎప్పుడూ మంచిది. ఈక్విటీ, డెట్, బంగారం, అంతర్జాతీయ మార్కెట్లు ఇలా అన్ని చోట్లా పెట్టుబడులు ఉండాలి. వ్యవధి, మీ లక్ష్యాలు, నష్టభయం భరించే సామర్థ్యం ఆధారంగా కేటాయింపులు ఉండాలి.
సమయం కోసం వేచి చూడొద్దు..