ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / business

సిరి: ఆర్థిక పరీక్షలు-ఈ ప్రశ్నల సంగతేంటి? - సిరి ఈనాడు

ప్రతి ఒక్కరికీ కొన్ని కోరికలుంటాయి. ఆర్థికంగా లక్ష్యాలుంటాయి. ఇవన్నీ తీరాలంటే.. సంపాదించడంతోనే సరిపోదు. ఆ సంపాదనను సరైన విధంగా నిర్వహిస్తున్నామా లేదా అనేదీ ముఖ్యమే. ఎప్పటికప్పుడు మనకు మనం కొన్ని తనిఖీలు చేసుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే ముందస్తు ఆరోగ్య పరీక్షల్లాగా.. ఇది ఆర్థిక పరీక్ష అన్నమాట. మరి, ఇందుకోసం వేసుకోవాల్సిన ప్రశ్నలేమిటో తెలుసా?

siri
సిరి
author img

By

Published : Feb 23, 2020, 5:50 AM IST

Updated : Mar 2, 2020, 6:17 AM IST

ఉద్యోగంలో కొత్తగా చేరినా.. ఇప్పటికే ఉద్యోగం/ వ్యాపారంలో ఉన్నా.. మీకు వస్తున్న ఆదాయం గురించి మీరు ఎంత వరకూ పట్టించుకుంటున్నారు? ఆర్థిక ప్రణాళికలో వేసుకోవాల్సిన తొలి ప్రశ్న ఇదే. దీనికి సమాధానం తెలుసుకోవడం ఎలా? విషయం చిన్నదే.. ఆచరించడమే కష్టం అన్నట్లు.. మీ స్తోమతను బట్టి ఖర్చు చేయాలి కానీ, మీకు ఖర్చులు ఉన్నాయని కాదు. ప్రతి పైసా ఒక పద్ధతితో ఖర్చు పెట్టాలి. అంటే, బడ్జెట్‌ వేసుకోవాలన్నమాట. ఆర్థికారోగ్యం మెరుగు పడాలంటే.. ముందుగా ఈ విషయంలోనే దిద్దుబాటు చేసుకోవాలి. ఇప్పటికీ మీరు దీన్ని పాటించకపోతే.. వెంటనే లెక్కలు వేసుకోవడం ప్రారంభించండి. డబ్బు మిగలడం లేదనే మీ తొలి ప్రశ్నకు సమాధానం దొరికినట్లే.

లక్ష్యం ఉందా?

చీకట్లో బాణం వేయడం అంటే తెలుసు కదా! ఏ లక్ష్యం లేకుండా ఎటు తోస్తే అటు బాణాలను సంధించడం. గురి చూసి వేసినప్పుడే బాణం లక్ష్యం చేరుకుంటుంది. మదుపు విషయం కూడా అంతే. ప్రతి పెట్టుబడికీ ఓ కచ్చితమైన లక్ష్యం ఉండాలి. మీరు చేస్తున్న ప్రతి రూపాయి పెట్టుబడీ ఆ లక్ష్య సాధనలో ఒక మెట్టుగా ఉపయోగపడాలి. స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలకు ఉపయోగపడేలా మీ పెట్టుబడులను విభజించుకోవాలి. లక్ష్యం నిర్ణయించుకొని, దాని సాధనకు సరైన పెట్టుబడులేమిటి? అనే జవాబు తెలిస్తేనే సరైన నిర్ణయం తీసుకొని, ఆర్థిక ముందడుగు వేయగలం.

ఇల్లు కొనొచ్చా?

సొంతిల్లు ఉంటే ఆ భరోసానే వేరు. జీవితంలో అతి పెద్ద పెట్టుబడి ఇల్లే. సొంతిల్లు ఉంటే.. అద్దె కట్టాల్సిన అవసరం లేదు. ఆ మేరకు మిగిలినట్లే. రుణం తీసుకొని, ఇల్లు కొన్నప్పుడు ఆదాయపు పన్ను ప్రయోజనాలూ లభిస్తాయి. ఇంటి విలువా పెరుగుతుంది. భవిష్యత్తులో కావాలనుకుంటే దీనిపైనే అప్పు తీసుకొని, అవసరమైన నిధులు సమకూర్చుకోవచ్చు. ఇవన్నీ సరే.. అసలు మీరు ఇల్లు కొనడానికి సిద్ధంగా ఉన్నారా? ముందు ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలి. మీ దగ్గరున్న మొత్తం ఎంత? రుణం ఎంత తీసుకోవాలి? నెలసరి వాయిదాలు చెల్లించిన తర్వాత మిగిలే మొత్తం? ఇలాంటివన్నీ లెక్కలేసుకోవాల్సిందే. వీటిన్నింటితో మీరు అనుకుంటున్న ఇల్లు కొనగలరా చూసుకోండి. గృహరుణం తీసుకోబోయే ముందు మీ క్రెడిట్‌ స్కోరు పెంచుకునేందుకు ప్రయత్నించండి.

మీ నికర విలువ ఎంత?

మీ విలువ ఎంత? అని ఎవరినైనా అడిగితే వారికి కోపం వస్తుంది. కానీ, ఆర్థికంగా ఇదొక ముఖ్యమైన విషయమే. మీ ఆస్తుల నుంచి ఉన్న అప్పులను తీసేయండి. మీ నికర విలువ వస్తుంది. ఆస్తులు ఎక్కువగా ఉంటే.. మంచిదే. అప్పులు అధికంగా ఉంటే జాగ్రత్త పడాల్సిందే. నికర విలువ ఎంత ఉండాలన్నదానికి కచ్చితమైన అంకెలేమీ లేవు. ఎంత అధికంగా ఉంటే అంత మంచిదన్న విషయం మాత్రం గమనించాలి. మీ స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాలను తీర్చేలా నికర విలువ ఉంటే ఉత్తమం. దీనికి ఒక సూత్రం కూడా ఉంది.. నికర విలువ = (మీ వయసు -25)× (వార్షిక వేతనం/5). అంటే.. మీ వయసు 40 ఏళ్లు, వార్షిక వేతనం రూ.8లక్షలు అనుకోండి. కనీసం మీ నికర విలువ రూ.24,00,000 ఉండాలన్నమాట. దీనికి మించి ఎంత అధికంగా ఉంటే ఆర్థికంగా అంత ఉన్నత స్థితిలో ఉన్నట్లు లెక్కేసుకోవచ్చు. ఇక్కడ బాధ్యతలు కూడా ముఖ్యమే. మీ సంపాదనలో 30-40శాతానికి మించి రుణ వాయిదాల చెల్లింపులకు వెళ్లకుండా చూసుకోండి.

పదవీ విరమణ కోసం ఏం చేశారు?

రోజువారీ ఖర్చులు ఎలా పెడుతున్నామో.. పదవీ విరమణ కోసం ఓ నిధి కూడబెట్టడం కూడా అంతే అవసరం. పదవీ విరమణ తర్వాత క్రమం తప్పకుండా వచ్చే ఆదాయం ఆగిపోతుంది. మరి, ఆ సమయంలో వచ్చే ఖర్చులను తట్టుకునేందుకు మీరు ఎంత వరకూ సిద్ధంగా ఉన్నారు? పెద్ద మొత్తంలో నిధి ఉంటే తప్ప, అప్పుడు ఖర్చు చేసేందుకు డబ్బు అందుబాటులో ఉండదు. కాబట్టి, సంపాదన ఉన్నప్పుడే కొంత భాగాన్ని తర్వాత అవసరాల కోసం దాచుకోవాలి. ఉద్యోగంలో చేరినప్పుడే పెట్టుబడులు కూడా ప్రారంభించాలి. కనీసం 40 వయసులో ఉన్నప్పుడైనా తప్పనిసరిగా మదుపు చేయాలి. దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడులు పెట్టాలి. వ్యూహాత్మకంగా, దూకుడుగా పెట్టుబడులు పెట్టినప్పుడే పదవీ విరమణ కోసం పెద్ద మొత్తంలో నిధిని సమకూర్చుకోగలం.

Last Updated : Mar 2, 2020, 6:17 AM IST

ABOUT THE AUTHOR

...view details