తెలంగాణ

telangana

ETV Bharat / business

'వచ్చే రెండేళ్లలో దేశార్థికం పరుగులు' - ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​

ఆర్థిక సర్వే 2020-21ను పార్లమెంటులో ప్రవేశపట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు -7.7 శాతంగా నమోదవ్వచ్చని ఈ సర్వే అంచనా వేసింది.

Economic survey in Parliament
పార్లమెంట్​లో ఆర్థిక సర్వే

By

Published : Jan 29, 2021, 1:52 PM IST

Updated : Jan 29, 2021, 4:59 PM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ 7.7 శాతం క్షీణతను నమోదు చేయొచ్చని ఆర్థిక సర్వే 2020-21 అంచనా వేసింది. ఈ సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు.

వచ్చే ఆర్థిక సంవత్సరం మాత్రం జీడీపీ 11 శాతం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది సర్వే. కరోనా వల్ల విధించిన లాక్​డౌన్​.. 2020-21లో వృద్ధి రేటు భారీ క్షీణతకు కారణమని పేర్కొంది.

దీర్ఘకాలంలో దేశ ఉత్పాదక సామర్థ్యాలకు నష్టం వాటిల్లకుండా.. నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టిన ఏకైక దేశం భారత్​ మాత్రమేనని ఆర్థిక సర్వే కితాబిచ్చింది.

ఈ ఆర్థిక సర్వేను కొవిడ్‌ యోధులకు అంకితమిస్తున్నట్లు.. సర్వేను డిజిటల్ మాధ్యమంలో విడుదల చేసిన ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్థిక సర్వేకు సంబంధించిన ప్రత్యేక యాప్‌ను విడుదల చేశారు. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటే మళ్లీ కోలుకుంటుంది గానీ, ప్రజల ప్రాణాలు కోల్పోతే తిరిగి తీసుకురాలేమన్న ఉద్దేశంతో ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించినట్లు తెలిపారు. ప్రభుత్వం తీసుకొచ్చిన లాక్‌డౌన్‌ వల్ల 37 లక్షల కేసులు తగ్గించగలిగామని, లక్ష ప్రాణాలను కాపాడగలిగామని పేర్కొన్నారు.

V ఆకారపు రికవరీతో పరుగులు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కరోనా వల్ల భారీగా క్షీణించిన ఆర్థిక వ్యవస్థ.. 2021-22లో V-ఆకారపు రికవరీతో.. 11 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. గతంలో 1979-80 ఆర్థిక సంవత్సరంలో చివరి సారిగా వృద్ధి రేటు -5.2 శాతంగా నమోదైనట్లు వెల్లడించింది.

దేశ ఆర్థిక వ్యవస్థ 2020-21లో భారీగా క్షీణతను నమోదు చేసినప్పిటికీ.. రానున్న రెండేళ్లలో మాత్రం అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

వ్యవసాయం మాత్రమే సానుకూలం..

ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగం మాత్రమే సానుకూల వృద్ధి రేటును నమోదు చేస్తుందని సర్వే స్పష్టం చేసింది. కరోనా వల్ల విధించిన దేశవ్యాప్త కఠిన లాక్​డౌన్ వల్ల తయారీ, సేవా రంగాలు భారీగా నష్టపోయాయని వెల్లడించింది.

2020-21లో వ్యవసాయ రంగ వృద్ధి రేటు 3.4 శాతంగా.. తయారీ, సేవారంగాల వరుసగా.. 9.6 శాతం, 8.8 శాతం క్షీణతను నమోదు చేయొచ్చని తెలిపింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను కరెంట్ ఖాతా మిగులు దాదాపు 17 ఏళ్ల స్థాయికి చేరొచ్చని అంచనా వేసింది సర్వే.

బడ్జెట్​కు సిఫారసులు..

ప్రజా ఆరోగ్యానికి ప్రభుత్వ వ్యయాలు జీడీపీలో 1 శాతం నుంచి 2.5-3 శాతానికి పెంచాలని కేంద్రానికి సిఫారసు చేస్తున్నట్లు సర్వే పేర్కొంది.

దీనితో సామాన్యూల చేతి నుంచి ఆస్పత్రి ఖర్చులు 65 శాతం నుంచి 35 శాతానికి తగ్గుతాయని వివరించింది.

వృద్ధి రేటుపై ఇతర అంచనాలు..

దేశ జీడీపీ 2020-21లో -7.5 శాతంగా నమోదవుతుందని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్​బీఐ) అంచనా వేసింది.

2020-21లో భారత వృద్ధి రేటు 8 శాతం క్షీణించొచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్​) ఇటీవలి అంచనాల్లో తెలిపింది.

Last Updated : Jan 29, 2021, 4:59 PM IST

ABOUT THE AUTHOR

...view details