ప్రస్తుతం కరోనా ఉద్ధృతి ఉన్నప్పటికీ దాని ప్రభావం బడ్జెట్‌లో ప్రకటించిన సంస్కరణలు, పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియపై ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను ఇదివరకు చెప్పినట్లుగానే ముందుకు తీసుకెళ్తామని ప్రకటించారు. ప్రస్తుతం అక్కడక్కడా లాక్‌డౌన్‌లు ఉన్నా ఆర్థిక వ్యవస్థ తెరిచే ఉందని, అందువల్ల మళ్లీ మారటోరియంలు ప్రకటించే ఆలోచన లేదని పేర్కొన్నారు. శుక్రవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాత్రికేయులతో మాట్లాడారు. వివిధ అంశాలపై ఆమె స్పందన ఆమె మాటల్లోనే..
"బడ్జెట్‌లో చెప్పినట్లుగానే పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను ఇదివరకటిలాగానే ముందుకు తీసుకెళ్తున్నాం. ఇందుకు సంబంధించిన కార్యక్రమాలన్నీ సున్నితంగానే సాగుతున్నట్లు కార్యదర్శులు చెప్పారు. ఈ ప్రక్రియకు ఎలాంటి అడ్డంకులూ ఉండవని భావిస్తున్నాం. మరో రెండుచోట్ల లాక్‌డౌన్‌లు విధించినప్పటికీ అవేమీ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియపై, వ్యవస్థాగత సంస్కరణల ప్రక్రియపై ప్రభావం చూపలేవు."
-నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి
మహమ్మారి సమయంలో తలెత్తిన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాయని నిర్మల సీతారామన్ తెలిపారు. పరస్పర సహకారంతో.. ప్రాణాలు కాపాడటం, వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచడమే ఉమ్మడి లక్ష్యమని వివరించారు.