తెలంగాణ

telangana

ETV Bharat / business

చిన్న పట్టణాల నుంచే 59శాతం ఆర్డర్లు

కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తున్నా, ఈ ఏడాది పండుగ సీజన్‌లో ఈ కామర్స్​ ఆర్డర్లు భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఆర్డర్లు పరిమాణంలో 56 శాతం, స్థూల వ్యాపార విలువలో (జీఎమ్‌వీ) 50 శాతం వృద్ధిని నమోదు చేశాయని యూనికామర్స్‌ నివేదిక వెల్లడించింది.

Small-towns
చిన్న పట్టణాల నుంచే 59% ఆర్డర్లు

By

Published : Dec 5, 2020, 12:12 PM IST

గత ఏడాదితో పోలిస్తే ఇటీవలి పండుగ సీజన్‌లో ఇ-కామర్స్‌ సంస్థలకు వచ్చిన ఆర్డర్లు పరిమాణంలో 56 శాతం, స్థూల వ్యాపార విలువలో (జీఎమ్‌వీ) 50 శాతం వృద్ధి నమోదు చేశాయని యూనికామర్స్‌ నివేదిక వెల్లడించింది. 2019 దీపావళికి నెల రోజుల ముందు, 2020లో దీపావళికి నెల ముందు ఆర్డర్లను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదికను సంస్థ రూపొందించింది.

సాస్‌ (సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఎ సర్వీస్‌) ప్లాట్‌ఫామ్‌ ఆధారంగా కొనుగోలు ధోరణులను అంచనా వేసింది. వినియోగదార్లు మునుపటి కంటే విలువకు ప్రాధాన్యం ఇస్తున్నారని, కొత్త విభాగాల్లో కొనుగోళ్లకు ఆన్‌లైన్‌లోనూ ముందుకొస్తున్నారని తెలిపింది. ప్రధానంగా వ్యక్తిగత సంరక్షణ, సౌందర్య ఉత్పత్తులు అధికంగా ఉన్నాయని పేర్కొంది. తక్కువ ధరల ఉత్పత్తుల్లో ఎక్కువ విక్రయాలు జరగడం వల్ల సరాసరి ఆర్డర్ల విలువలో 4 శాతం క్షీణత నమోదైందని వివరించింది.

  1. వ్యక్తిగత సంరక్షణ విభాగంలో ఎక్కువగా వృద్ధి కనిపించింది. ఆర్డర్ల పరిమాణం 176 శాతం పెరిగింది. సౌందర్య, సంరక్షణ విభాగంలో ఆర్డర్ల పరిమాణంలో 52 శాతం వృద్ధి నమోదైంది.
  2. ఫ్యాషన్, ఉపకరణాల విభాగంలో ఆర్డర్ల పరిమాణం 71 శాతం వృద్ధి చెందింది.
  3. ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల విభాగంలో 65 శాతం వృద్ధి నమోదైంది.
  4. కొనుగోలు చేసిన ఉత్పత్తుల్ని వెనక్కి పంపించే (రిటర్న్‌) ఆర్డర్లు 35 శాతానికి తగ్గాయి. ఫ్యాషన్, ఉపకరణాల విభాగంలోనే అత్యధికంగా రిటర్న్‌ ఆర్డర్‌లు నమోదవుతున్నాయి.
  5. పెద్ద బ్రాండ్‌లు తమ సొంత వెబ్‌సైట్ల ద్వారా విక్రయాలు జరిపేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ వెబ్‌సైట్ల ఆర్డర్ల పరిమాణంలో వృద్ధి 77 శాతం నమోదైంది. మార్కెట్‌ ఆర్డర్ల పరిమాణంలో వృద్ధి 60 శాతంతో పోలిస్తే ఇది ఎక్కువ.
  6. బ్రాండ్‌ వెబ్‌సైట్ల జీఎమ్‌వీ 48 శాతం మేర పెరిగింది. మార్కెట్‌లో జీఎమ్‌వీ 50 శాతం పెరిగింది. అంటే మార్కెట్‌లో కంటే వెబ్‌సైట్లలోనే బ్రాండ్‌లు అధికంగా రాయితీలు అందిస్తూ ఖాతాదారుల్ని ఆకర్షిస్తున్నాయి.
  7. దేశంలోని రెండో శ్రేణి నగరాలు, పట్టణాల నుంచే ఆన్‌లైన్‌ వినియోగదారు గిరాకీ 59 శాతంగా ఉంది.

"కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తున్నా, ఈ ఏడాది పండుగ సీజన్‌లో ఆర్డర్లు పెరగడం చెప్పుకోదగ్గ అంశం. సాధారణంగా ఇ-కామర్స్‌ సంస్థలు పండుగ విక్రయాలపై ఎక్కువగా అంచనాలు పెట్టుకుంటుంటాయి.

ఈసారి ప్రత్యేక పరిస్థితులు ఉండటం వల్ల పరిశ్రమ కొంచెం సందిగ్ధంలో పడింది. కానీ ఆర్డర్లు అనూహ్యంగా పెరగడంతో వచ్చే కొన్నేళ్లలో ఈ పరిశ్రమ మరింత వృద్ధి దిశగా అడుగులు వేసే అవకాశం ఉంద"ని యూనికామర్స్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి కపిల్‌ మఖిజా అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details