తాత్కాలికంగా ఎదురయ్యే నగదు సమస్యల పరిష్కారానికి బంగారు రుణాలు సహాయపడతాయి. ఈ రుణాలు త్వరగా పొందొచ్చు. బంగారంపై రుణాలను జారీచేసేందుకు బ్యాంకులు కూడా క్రెడిట్ స్కోర్లను పరిగణనలోకి తీసుకోవు. బంగారంపై రుణం ఇచ్చేటప్పుడు రుణగ్రహీత తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని అంచనా వేయవు. ఇటువంటి రుణాలు చిన్న వ్యాపార యజమానులకు తాత్కాలిక నగదు సమస్యలకు లేదా అత్యవసర డబ్బు అవసరమైనప్పుడు సహాయపడతాయి. బ్యాంకింగ్, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీలు) బంగారు రుణాలు అందజేస్తుంటాయి. ఎన్‌బీఎఫ్‌సీలైన మణప్పురం, ముత్తూట్ ఫైనాన్స్ వంటివి బంగారు రుణ వ్యాపారంపైనే దృష్టి సారించాయి కాబట్టి అవి త్వరగా రుణాన్ని పంపిణీ చేస్తుంటాయి.
ఎన్బీఎఫ్సీ vs బ్యాంకులు
బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల మధ్య ఒక ముఖ్యమైన వ్యత్యాసం ఉంది. బ్యాంకుల తక్కువ వడ్డీ రేట్లకే రుణం మంజూరు చేస్తాయి. ఎన్‌బీఎస్‌సీలు ఎక్కువ మొత్తంలో రుణాలు ఇస్తాయి. మీ బంగారానికి బ్యాంకుల కంటే ఎన్‌బీఎస్‌సీలు ఎక్కువ విలువ కట్టడమే కారణం. ఉదాహరణకు రుణ గ్రహీత దగ్గర 20 గ్రాముల బంగారు హారం ఉందనకుందాం. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ రెండూ రుణ గ్రహీతకు బంగారం విలువలో 75 శాతం అందిస్తుంటాయి. ఒక బ్యాంక్ మీ బంగారాన్ని 10 గ్రాములకు రూ.46,500 చొప్పున విలువ కడితే, ఎన్‌బీఎఫ్‌ఎసీ దాన్ని ఎక్కువ విలువైనదిగా పరిగణించొచ్చు. బంగారానికి రుణాలు ఇచ్చే ఎన్బీఎఫ్సీ లోహానికి విలువ ఇచ్చేటప్పుడు వేగంగా రుణాలు ఇవ్వగలదు. బ్యాంకుల విషయానికొస్తే నిబంధనలను అనుసరించి రుణాలను జారీ చేస్తాయి కాబట్టి జాప్యం జరిగే అవకాశం ఉంది.
ఎలాంటి బంగారంపై ఇస్తారు..?
బంగారం కనీస స్వచ్ఛత 18 క్యారెట్లు ఉండాలి. చాలామంది రుణదాతలు ఈ స్వచ్ఛత కంటే తక్కువ బంగారాన్ని తాకట్టు పెట్టుకోరు. చాలా బ్యాంకులు గోల్డ్ బార్స్‌పై రుణాలు ఇవ్వవు. ఆభరణాలు, బంగారు నాణేలను తాకట్టు పెట్టవచ్చు. అయితే తనఖా పెట్టినప్పుడు ఆభరణాల్లో భాగమైన వజ్రాలు, రాళ్లకు విలువ ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కేవలం బంగారం విలువ మాత్రమే లెక్కిస్తారు. నాణేల విషయంలో అధిక స్వచ్ఛత అడగొచ్చు. బరువుపై పరిమితులూ ఉండొచ్చు. చాలామంది 50 గ్రాముల కంటే ఎక్కువ బరువున్న నాణేలను అంగీకరించరు.