మాంద్యం, నిరుద్యోగ సమస్య నుంచి అమెరికా ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకు ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 2022 వరకు కీలక వడ్డీరేట్ల పెంపు ఉండదని స్పష్టం చేసింది. తక్కువ రుణ రేట్లు కొనసాగించేందుకు బాండ్లు కొనుగోలు చేస్తూనే ఉంటామని పేర్కొంది.
ఫెడ్ తన బెంచ్మార్క్ స్వల్పకాలిక వడ్డీ రేటును సున్నాకు పరిమితం చేసింది. రెండేళ్ల పాటు ఇలా వడ్డీ రేట్లను తక్కువగా ఉంచడం వల్ల... వ్యాపారులకు, వినియోగదారులకు తక్కువ రేటుకే రుణాలు లభించనున్నాయి. ఫలితంగా వ్యాపారాలు తిరిగి ప్రారంభమై ఆర్థిక వ్యవస్థ పుంజుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
"కరోనా సంక్షోభం కారణంగా ఆర్థిక కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలిగింది. నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. కనుక ఈ ఏడాది అమెరికా వృద్ధిరేటు 6.5 శాతం మేర క్షీణించవచ్చు. అలాగే ప్రస్తుతానికి 13.0 శాతం ఉన్న నిరుద్యోగ రేటు ఈ సంవత్సరం చివరినాటికి 9.3 శాతానికి తగ్గొచ్చని అంచనా వేస్తున్నాం."