తెలంగాణ

telangana

ETV Bharat / business

ఫెడ్ నిర్ణయాలతో భారత మార్కెట్​లో ఒడుదొడుకులు ఎందుకు?

Fed Decision Indian Market: అమెరికాలో వడ్డీరేట్లు పెరిగితే మన షేర్లు ఎందుకు పడిపోతాయి? అక్కడి నిర్ణయాలు ఇక్కడి మార్కెట్లను ఎందుకు ప్రభావితం చేస్తాయి? విదేశీయులు భారత్‌లో ఎందుకు మదుపు చేస్తారు?.. ఈ ప్రశ్నలకు సమాధానం మీకోసం..

fed decision
అమెరికాలో వడ్డీరేట్లు

By

Published : Dec 18, 2021, 7:01 PM IST

Fed Decision Indian Market: స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం భారీ నష్టాల్ని చవిచూశాయి. దీనికి అనేక కారణాలున్నప్పటికీ.. అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వు 2022లో వడ్డీ రేట్లు పెంచనున్నామని ప్రకటించడం కూడా సూచీలపై తీవ్ర ప్రభావం చూపింది. అంతకుముందు రెండు రోజులు కూడా ఫెడ్‌ నిర్ణయాలపై అంచనాలతో మార్కెట్లు ఒడుదొడుకులకు లోనయ్యాయి. అమెరికా ఫెడ్‌ సమావేశమైన ప్రతిసారీ ఇదే తంతు కొనసాగుతుంది. అక్కడి నిర్ణయాలు ఇక్కడి మార్కెట్లను ఎందుకు ప్రభావితం చేస్తాయి?

2021 ఆర్థిక సంవత్సరంలో విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు రూ.2.74 లక్షల కోట్లు భారత స్టాక్ మార్కెట్లలో పెట్టుబడిగా పెట్టారు. దీంతో భారత ఈక్విటీల్లో విదేశీ మదుపర్ల వాటా దాదాపు 28 శాతానికి చేరుకుంది. ఈ ఏడాది మార్కెట్‌ సూచీలు భారీగా ఎగబాకడానికి గల ప్రధాన కారణాల్లో ఇదొకటి.

విదేశీయులు భారత్‌లో ఎందుకు మదుపు చేస్తారు?

అసలు విదేశీయులు భారత్‌లో ఎందుకు మదుపు చేస్తారు? అమెరికాలో ఎందుకు చేయరు? అమెరికా ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశం. భారత్‌ అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ముందుంది. అంటే ఇక్కడ ఆర్థిక వృద్ధికి ఇంకా అనేక అవకాశాలు ఉన్నాయి.

ఇక అమెరికాతో పోలిస్తే భారత్‌లో వడ్డీరేట్లు ఎక్కువ. దీంతో విదేశీ మదుపర్లు అక్కడ తక్కువ వడ్డీకి రుణాలు తీసుకొని అధిక రాబడికి అవకాశం ఉన్న భారత మార్కెట్లలో మదుపు చేస్తారు. దీంతో వారికి భారీ ఎత్తున ఆదాయం లభిస్తుంది.

ఉదాహరణకు.. థామస్‌ అనే మదుపరి అమెరికాలో 3 శాతం వడ్డీరేటుతో రూ.1లక్ష రుణం తీసుకున్నారు. ఈ మొత్తాన్ని ఆయన భారత స్టాక్‌ మార్కెట్లలో మదుపు చేశారు. ఇక్కడ సగటున 12 శాతం రాబడి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ థామస్‌ రూ.1లక్ష భారత్‌లో రుణంగా తీసుకుంటే 7-8శాతం వడ్డీ చెల్లించాల్సి వచ్చేది. ఇలా తక్కువ వడ్డీరేటు ఉన్న మార్కెట్ల నుంచి రుణం తీసుకొని వాటిని ఎక్కువ రాబడికి అవకాశం ఉన్న మార్కెట్లలో మదుపు చేసి లబ్ధి పొందుతుంటారు.

ఫెడ్‌ వడ్డీరేట్లు పెంచితే..

  • అమెరికా వడ్డీరేట్లు పెంచితే ఒక్క భారత్‌లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు ప్రభావితమవుతాయి. అక్కడ రేట్లు పెరగ్గానే విదేశీ మదుపర్లు ఇక్కడి నుంచి తమ పెట్టుబడుల్ని ఉపసంహరించుకుంటారు.
  • వడ్డీరేట్లు పెరిగితే బాండు ఈల్డులు కూడా పెరుగుతాయి. స్టాక్‌ మార్కెట్లతో పోలిస్తే ఇవి సురక్షితమైన పెట్టుబడులు. అందుకే భారత మార్కెట్ల నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకొని చాలా మంది మదుపర్లు తమ సొంత దేశ బాండ్లలో ఇన్వెస్ట్‌ చేస్తారు.
  • ఇక వడ్డీరేట్లు పెరిగే కొద్దీ డాలర్‌ బలపడుతుంది. ఫలితంగా రూపాయి విలువ పతనమవుతుంది. దీంతో ఇక్కడ విదేశీయులు చేసిన మదుపు వల్ల వచ్చే రాబడిలో కోత పడుతుంది.
  • దీర్ఘకాల మదుపర్లు వడ్డీరేట్ల పెంపు వల్ల పెద్దగా ఆందోళన చెందబోరు. కానీ, స్వల్పకాలం కోసం మదుపు చేసేవారు తమ పెట్టుబడులను వెంటనే ఉపసంహరించుకుంటారు. ఇది మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలడానికి దారి తీస్తుంది.
  • మదుపర్లతో పాటు ఆర్‌బీఐ కూడా ఫెడ్‌ నిర్ణయాలను నిశితంగా పరిశీలిస్తుంది. ఒకవేళ విదేశీ మదుపర్లు వేగంగా పెట్టుబడులను ఉపసంహరించుకుంటే విదేశీ మారక నిల్వలు పడిపోయే అవకాశం ఉంది. అయితే, ఆర్‌బీఐ ఎప్పుడూ రిస్క్‌ను దృష్టిలో పెట్టుకొని సరిపడా నిల్వలు నిర్వహిస్తుంది. ఇక మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని పరిమితం చేయడం అనివార్యమైతే వడ్డీరేట్లు తగ్గిస్తుంది. తద్వారా దేశీయ రిటైల్‌ మదుపర్లు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తారు.

ఫెడ్‌ వడ్డీరేట్లు తగ్గిస్తే..

Fed Interest Rate: 2019లో ఆర్థిక వృద్ధి మందగించడంతో ప్రజల్లో వినియోగం పెంచడానికి అమెరికా వడ్డీరేట్లను తగ్గించింది. అలా ఆ సంవత్సరంలో మొత్తం మూడు సార్లు వడ్డీరేట్లలో కోత విధించింది. దీంతో భారత స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. అక్కడ మూడోసారి రేట్ల కోత ప్రకటించిన తర్వాతి రోజు ఇక్కడ సెన్సెక్స్ రికార్డు స్థాయికి చేరుకుంది.

అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలు వడ్డీరేట్లను తగ్గించిన ప్రతిసారీ భారత స్టాక్‌ మార్కెట్లు భారీగా లాభపడతాయి. ఇక్కడ లభించే అధిక రాబడిపై విదేశీయులు కన్నేస్తారు. పైగా భారత్‌లో ద్రవ్యోల్బణం కూడా మరీ కలవరపెట్టే స్థాయికి చేరుకునే అవకాశాలు చాలా తక్కువ.

అయితే, వడ్డీరేట్ల పెంపు ఒక్కరోజులో తీసుకునే నిర్ణయం కాదు. దేశ ఆర్థిక పరిస్థితిని అనుసరించి సుదీర్ఘ చర్చల అనంతరం తుది నిర్ణయానికి వస్తారు. ఈలోపే మార్కెట్‌లోకి సంకేతాలు వెళతాయి. వాటిని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకునే మదుపర్లు ముందే తగు జాగ్రత్తలు తీసుకుంటారు. భారీ నష్టాల నుంచి తప్పించుకుంటారు.

ఇదీ చూడండి:Mutual Fund Investment: ఆ పెట్టుబడి వెనక్కి తీసుకుంటున్నారా?

ABOUT THE AUTHOR

...view details