విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో భారత్ మరో మైలురాయిని అందుకుంది. 2020, సెప్టెంబర్ నాటికి 500 బిలియన్ డాలర్ల మార్కును దాటినట్లు ప్రకటించింది కేంద్రం. మారిషస్ నుంచి అత్యధికంగా పెట్టుబడులు అందగా.. ఆ తర్వాతి స్థానంలో సింగపూర్, అమెరికా, నెదర్లాండ్స్, జపాన్‌లు ఉన్నాయి.
'ఎఫ్‌డీఐ'ల్లో 500 బి. డాలర్ల మార్కు దాటిన భారత్
By
Published : Dec 6, 2020, 2:46 PM IST
|
Updated : Dec 6, 2020, 3:03 PM IST
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షించటంలో భారత్ దూసుకుపోతోంది .పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన ప్రపంచ గమ్యస్థానంగా మారుతోంది. ఈ క్రమంలోనే ఎఫ్‌డీఐల్లో.. 2000 ఏప్రిల్ నుంచి 2020 సెప్టెంబర్ నాటికి 500 బిలియన్ డాలర్ల మైలురాయిని దాటింది భారత్.
డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్(డీపీఐఐటీ) తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో ఈ మేరకు వెల్లడైంది. రెండు దశాబ్దాల కాలంలో భారత్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మొత్తం 500.12 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు తెలిపింది.
తొలిస్థానంలో మారిషస్..
మొత్తం ఎఫ్‌డీఐల్లో 29 శాతం మారిషస్ నుంచే వచ్చాయి. ఆ తర్వాత సింగపూర్ (21 శాతం), అమెరికా, నెదర్లాండ్స్, జపాన్ (7 శాతం), బ్రిటన్ (6 శాతం)ల నుంచి ఎఫ్‌డీఐలు భారత్‌కు వచ్చాయి. మారిషస్ నుంచి మొత్తం 144.71 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు రాగా.. సింగపూర్ నుంచి 106 బిలియన్ డాలర్ల పెట్టుబడులు అందాయి.
ఆయా దేశాలతో పాటు జర్మనీ, సిప్రస్, ఫ్రాన్స్, సైమన్ ఐలాండ్స్ నుంచి కూడా భారత్‌లోకి భారీగా ఎఫ్‌డీఐలు వచ్చాయి.
2015-16 ఆర్థిక ఏడాది నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో గణనీయమైన వృద్ధి కనిపిస్తోంది. ఆయా ఆర్థిక సంవత్సరాల్లో భారత్‌కు వచ్చిన ఎఫ్‌డీఐల వివరాలు ఇలా ఉన్నాయి.
ఆర్థిక ఏడాది
ఎఫ్‌డీఐలు
(బిలియన్ డాలర్లలో)
2015-16
40
2016-17
43.5
2017-18
44.85
2018-19
44.37
2019-20
50
1999లో ఎఫ్ఈఆర్ఏ ఏర్పాటుతో భారత ఎఫ్‌డీఐల ప్రయాణం మొదలైందని గుర్తు చేసుకున్నారు నంగియా అండర్సన్ ఇండియా సభ్యులు నిశ్చల్ అరోరా. 'హాఫ్ ట్రిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు రావటం.. 2007-08 ప్రపంచ మాంద్యం సమయంలోనూ లాభాలను ఇచ్చిన భారత బలమైన ఆర్థిక గణాంకాలు, స్థిరమైన రాజకీయ దృక్పథం, నిరంతర ఆర్థిక వృద్ధిపై విదేశీ పెట్టుబడిదారులకు ఉన్న బలమైన నమ్మకాన్ని సూచిస్తోంది' అని పేర్కొన్నారు. ప్రస్తుత కరోనా మహమ్మారితో వచ్చే దశాబ్దం కోసం భారత్ జాగ్రత్తగా అడుగులు వేస్తోందని, తయారీ, సాంకేతిక రంగాల్లో ఎఫ్‌డీఐలను ఆకర్షించటానికి ప్రభుత్వం తగిన చర్యలను కొనసాగించటం అవసరమని అభిప్రాయపడ్డారు.