తెలంగాణ

telangana

ETV Bharat / business

ఫాస్టాగ్​తో టోల్​ చెల్లింపులే కాదు.. నేరగాళ్లనూ పట్టుకోవచ్చు! - ఫాస్టాగ్​ లేటెస్ట్​ న్యూస్​

జాతీయ రహదార్లపై ప్రయాణించే వాహనాలకు టోల్​ రుసుము ఎలక్ట్రానిక్​ పద్ధతిలో వసూలు చేసేందుకు నిర్ధేశించిన ఫాస్టాగ్​ నేటి నుంచి తప్పనిసరి చేసింది కేంద్రం. ప్రస్తుతానికి టోల్​ ఫీజుకు మాత్రమే పరిమితమైనా.. భవిష్యత్​లో ఫాస్టాగ్​ చాలా అవసరాలకు కీలకంగా మారనుంది. అంతే కాకుండా నేరగాళ్లను పట్టుకునేందుకు ఉపయోగపడనుంది. మునుముందు ఫాస్టాగ్​తో ఎలాంటి ఉపయోగాలున్నాయనే విషయాలు మీ కోసం.

FASTAG-CRIME
ఫాస్టాగ్​

By

Published : Dec 15, 2019, 8:58 AM IST

దోపిడీలు, హత్యలు చేసి ఏ లారీలోనో లేక కార్లోనో పారిపోదామనుకుంటే ఇక కుదరదు. ఒక రాష్ట్రంలో నేరం చేసి మరో రాష్ట్రానికి తప్పించుకొని వెళ్లే అంతర్రాష్ట్ర ముఠాల ఆటలు కూడా సాగకపోవచ్చు. నేరస్థులు తప్పించుకుని పారిపోయే క్రమంలో వాహనాన్ని వినియోగించారా.. సులువుగా పట్టుబడిపోతారు. దీనికి కారణం వాహనాలకు ముందుభాగాన అద్దంపై ఉండే 'ఫాస్టాగ్‌'...! జాతీయ రహదార్లపై టోల్‌గేట్ల వద్ద ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో రుసుము చెల్లించేందుకు రూపొందించిన 'ఫాస్టాగ్‌' భవిష్యత్తులో నేరపరిశోధనలో క్రియాశీలకం కానుంది. నేటినుంచి వాహనాలకు తప్పనిసరి 'ఫాస్టాగ్‌' అమల్లోకి వస్తోంది.

కేంద్ర జాతీయ రహదార్ల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) నిర్దేశించిన దానికి అనుగుణంగా ఎన్‌పీˆసీˆఐ (నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) కొంతకాలం క్రితం ఈ ఎలక్ట్రానిక్‌ ట్యాగ్‌ను రూపొందించింది. దీని కోసం 24 బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది. గత రెండేళ్లుగా కొత్త వాహనాలకు 'ఫాస్టాగ్‌' వేస్తున్నారు. ఇన్నాళ్లూ పాత వాహనాల యజమానులు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ద్విచక్ర వాహనాలు మినహా అన్ని రకాల వాహన యజమానులు 'ఫాస్టాగ్‌' కొనుగోలు చేయాల్సిందే.

ఫాస్టాగ్​

ఫాస్టాగ్​తో ఇతర చెల్లింపులు..

వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి సరకు రవాణాకు సంబంధించి ఈ-వే బిల్లుల జారీకి 'ఫాస్టాగ్‌' తప్పనిసరి కాబోతోంది. పైగా ఒక వాహనానికి సంబంధించిన చెల్లింపులు, ఉదాహరణకు: టోల్‌ ఫీజు, పెట్రోలు-డీజిల్‌ కొనుగోలు, వాహన బీమా ప్రీˆమియం, పార్కింగ్‌ ఫీజు, ట్రాఫిక్‌ చలాన్లు వంటి అవసరాలన్నింటికీ దీని ద్వారా చెల్లింపులు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది. అందువల్ల సమీప భవిష్యత్తులో వాహనం ఏదైనా దానికి ఈ ట్యాగ్‌ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇదే పోలీసు యంత్రాంగానికి, ఇతర దర్యాప్తు సంస్థలకు కలిసివచ్చే విషయంగా మారింది. నేరం చేసి కార్లోనో మరో వాహనంలోనో పారిపోతే దొరికిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

తప్పించుకోవడం అంత సులువు కాదు..

నేరగాళ్లు తాము తప్పించుకునే క్రమంలో నెంబరు ప్లేట్లు మార్చటం లేదా పూర్తిగా తీసివేయటం చేస్తుంటారు. అంతేగాక వాహనానికి సంబంధించిన పత్రాల (ఆర్‌సీ, ఇన్సూరెన్స్‌ వంటివి...)ను ఫోర్జరీ ద్వారా కొత్తవి సృష్టిస్తారు. పత్రాలను, నెంబర్‌ ప్లేట్లను తరచూ మారుస్తూ ఒకదాని వెంట మరొకటిగా.. ఎన్నో నేరాలు చేసి తప్పించుకుని తిరుగుతుంటారు. ఇటువంటి నేరస్థులను పట్టుకోవటం పోలీసు యంత్రాంగానికి సవాలే. కానీ ఇకపై ఇలా తప్పించుకుని తిరగటం సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే.. వాహనంపై ఉండే ఫాస్టాగ్‌ వల్ల అది ఏయే రోడ్ల మీద ఏయే రోజుల్లో ఏ సమయంలో ప్రయాణించిందీ స్పష్టంగా నమోదవుతుంది. ఆ సమాచారాన్ని ఎంత కాలమైనా కంప్యూటర్లలో భద్రపరచవచ్చు. నేరం చేసిన వారు కార్లోనో లేక మరొక వాహనంలోనో పారిపోతే ఆ కదలికలను గుర్తించే అవకాశం ఉంటుంది. అంటే నేరస్థులు వాహనం ఉపయోగిస్తే పట్టుబడిపోతారన్నమాట.

ఆ వాహనాల వివరాలు కావాలి

తమిళనాడులోని శివగంగ ప్రాంతంలో గత కొంతకాలంగా అక్రమ రవాణా పెరిగిపోయింది. అక్కడి పోలీసు యంత్రాంగానికి ఇదొక పెద్ద సమస్యగా మారింది. దీంతో అక్రమ రవాణాలో పాలుపంచుకుంటున్న వాహనాల నిగ్గు తేల్చాలని నిర్ణయించుకుంది. వెంటనే ఆ ప్రాంతంలోని రహదార్లపై ఉన్న టోల్‌బూత్‌ల నుంచి వాహనాల రాకపోకల సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా ఎన్‌హెచ్‌ఏఐ అధికార వర్గాలను కోరారు. శివగంగ జిల్లా ఎస్పీ స్వయంగా ఎన్‌హెచ్‌ఏఐ అధికారులను సంప్రదించి తాము అనుమానిస్తున్న వాహనాల వివరాలను తెలియజేయటమే కాకుండా ఆయా రహదార్లలో ఈ వాహనాల రాకపోకల సమాచారాన్ని ఇవ్వాలని అడిగారు. తత్ఫలితంగా అక్కడి అనుమానితులపై దర్యాప్తును పోలీసులు వేగవంతం చేసే వీలుకలిగింది. కిడ్నాప్‌, పరారీ కేసుల్లో నిందితుల ఆరా తీయటానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఇప్పటికే పోలీసులు టోల్‌ బూత్‌ల వద్ద ఉన సీˆసీˆ కెమేరాల్లో ఫుటేజీని పరిశీలిస్తున్నారు. తద్వారా నిందితులను గుర్తించే అవకాశం కలుగుతోంది. కానీ వాహనాలను పసిగట్టటం కష్టం అవుతోంది. 'ఫాస్టాగ్‌' ఉంటే వాహనాన్ని గుర్తించటం సులువు. నెంబర్‌ ప్లేట్లు మార్చినా, దొంగ పత్రాలతో వెళ్లినా పట్టుకోవచ్చు. ఎలా చూసినా నేరపరిశోధన వేగవంతం కావటానికి ఈ మార్పు దోహదపడనుందని తెలుస్తోంది.

బీమా మోసాలు కుదరవు

రోడ్లపై తిరిగే ప్రతి వాహనానికీ బీమా తప్పనిసరి. వాహనాన్ని కొనే సమయంలో ఒక ఏడాది నుంచి మూడేళ్ల దాకా బీమా తీసుకుంటారు. కానీ ఆ తర్వాత ఎంతోమంది దాన్ని పునరుద్ధరించుకోరు. ఈ మధ్యకాలంలో ప్రీమియం మొత్తాలు పెరిగాయి. పాలసీ లేకపోతే ఎంతో అధిక పెనాల్టీ చెల్లించాల్సి వస్తోంది. దీంతో కొన్ని వాహనాల యజమానులు గడువు తీరిన పాలసీˆ పత్రాల్లో కంప్యూటర్‌ ద్వారా తేదీని మార్చి, దాన్ని ప్రింట్ తీసుకొని పోలీసు/ రవాణా శాఖ తనిఖీల్లో అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు. తద్వారా పెనాల్టీ పడకుండా తప్పించుకుంటున్నారు. ఇటువంటి మోసాలు కూడా ఇకపై కుదరవు. వాహన పాలసీ పునరుద్ధరణ జరిగిందీ లేనిదీ ‘ఫాస్టాగ్‌’ ద్వారా తెలిసిపోతుంది. వాహనాల పాలసీల తాజా సమాచారాన్ని బీమా కంపెనీలు ఎప్పటికప్పుడు ఎన్‌పీసీఐకి ఇచ్చేవిధంగా నిబంధనలు తీసుకురావాలనే అభ్యర్ధన ఐఆర్‌డీఏ ముందు ఉన్నట్లు సమాచారం. బీమా పాలసీ సమాచారంతో పాటు వాహనానికి సంబంధించి పూర్తి వివరాలు ఫాస్టాగ్‌లో ఉంటాయి. అందువల్ల బీమా విషయంలో అధికార్లను తప్పుదోవ పట్టించటం సాధ్యం కాదు.

ABOUT THE AUTHOR

...view details