తెలంగాణ

telangana

ETV Bharat / business

నేటి నుంచి ఫాస్టాగ్ తప్పని సరి.. లేదంటే ఛార్జీల మోతే - FASTAG NEWS

రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల ప్రకారం జాతీయ రహదార్లపై తిరిగే వాహనాలకు నేటి నుంచి ఫాస్టాగ్​ తప్పనిసరి కానుంది. ఈ నేపథ్యంలో చాలా మందికి ఫాస్టాగ్​పై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. వాటన్నింటినీ తీర్చేందుకు ఓ ప్రత్యేక కథనం మీ కోసం.

FASTAG IS MUST IN NATIONA LHIGWAYS FROM TODAY
నేటి నుంచి ఫాస్టాగ్ తప్పని సరి.. లేదంటే ఛార్జీల మోతే

By

Published : Dec 15, 2019, 5:30 AM IST

Updated : Dec 15, 2019, 5:38 AM IST

డిసెంబర్​ 15 నుంచి వాహనాలకు ఫాస్టాగ్​ తప్పని సరి చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ఇకపై జాతీయ రహదార్లపై ప్రయాణించే వాహనాలకు ఫాస్టాగ్​ తప్పని సరికానుంది. ఈ నేపథ్యంలో చాలా మంది మదిలో మెదులుతున్న ప్రశ్న ఒకటే. ఫాస్టాగ్​ ఎక్కడ.. ఎలా పొందాలి. డిసెంబర్​ 15 నుంచి ఫాస్టాగ్​ లేకపోతే ఏమవుతుంది అని.. వీటితో పాటు ఫాస్టాగ్​ పై ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.

ఫాస్టాగ్​ అంటే ఏమిటి?

జాతీయ రహదార్లపై ప్రయాణించే వాహనాలు టోల్​ గేట్ల వద్ద రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ.. నగదు రూపంలో చెల్లిపులు జరపడం ద్వారా భారీగా ట్రాఫిక్​ స్తంభించడం, ఎక్కువ సమయం వృథా అవుతోంది. వాహనదారులు అలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ టోల్‌ కలెక్షన్‌ (ఎన్‌ఈటీసీ) కార్యక్రమానికి నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 2014లో పైలట్‌ ప్రాజెక్టుగా ఫాస్టాగ్‌ను ప్రారంభించారు. ఇప్పుడు డిసెంబర్​ 15 నుంచి తప్పనిసరి చేసింది కేంద్రం.

ఇకపై ఫాస్టాగ్​ లేకపోతే..

డిసెంబర్​ 15 నుంచి ఫాస్టాగ్ లేని వాహనాలు ఫాస్టాగ్​ లైన్లోకి వస్తే.. సాధారణ ధరల కన్నా రెండింతలు ఎక్కువ ఛార్జీలు వసూలు చేయనున్నారు. రేపటి నుంచి జాతీయ రహదార్లపై ఉన్న టోల్​ప్లాజాల్లో.. కేవలం ఒక లైన్​ మాత్రమే హైబ్రిడ్​ లైన్​ ఉండనుంది. ఇందులో సాధారణ టోల్​ ఛార్జీలనే వసూలు చేయనున్నారు.

ఫాస్టాగ్‌ ఎందుకు..?

టోల్‌ప్లాజాల వద్ద వాహనం ఆగకుండా వెళ్లిపోయేందుకు వీలుగా ఉపయోగపడే చిన్న సాంకేతిక సాధనమే ఈ ఫాస్టాగ్‌. నగదు రహిత, డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం దీన్ని అమలు చేస్తోంది. చిన్న ఎలక్ట్రానిక్‌ చిప్‌ రూపంలో ఉండే దీన్నీ... వాహనం ముందుండే అద్దం లోపలివైపు అతికిస్తారు. వాహనం టోల్‌ప్లాజా లైన్‌లోకి రావడంతోనే అక్కడ అమర్చిన ఎలక్ట్రానిక్‌ పరికరం వాహన ఫాస్టాగ్‌ ఐడీ, రిజిస్ట్రేషన్‌ నంబరు, మన పేరును గుర్తించి, ఖాతా నుంచి టోల్‌ రుసుంను ఆన్‌లైన్‌లోనే తీసుకుంటుంది. ఇదంతా 10 సెకండ్లలోనే జరుగుతుంది.

ఎక్కడ... ఎలా తీసుకోవాలి..?

అన్ని టోల్‌ప్లాజాలు, 22 ప్రభుత్వ, ప్రైవేటు, సహకార బ్యాంకుల్లో దీన్నీ పొందవచ్చు. త్వరలో ఎన్‌హెచ్‌ఏఐ సొంతంగానూ ఇవ్వనుంది. అమెజాన్‌, పేటీఎంల ద్వారా బుక్‌ చేసుకోవచ్చు. ఈ చిప్‌ను టోల్‌ప్లాజాలో ఏర్పాటు చేసిన బ్యాంకు సేల్‌ పాయింట్లలో ఒకసారి రిజిస్టర్‌ చేసుకోవాలి. చిప్‌ పొందడానికి వాహన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ (ఆర్సీ), వాహనదారుడి గుర్తింపు కార్డు జిరాక్స్​ ప్రతులు, రెండు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు తీసుకెళ్లాలి.

కీలక నిర్ణయం...

ఫాస్టాగ్‌ విషయంలో కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది. వాహనదారులు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని 25 శాతం ఫాస్టాగ్‌ లేన్స్‌ను తాత్కాలికంగా హైబ్రిడ్‌ లేన్స్‌గా మారుస్తున్నట్లు ప్రకటించింది. ఈ లేన్లలో అటు ఫాస్టాగ్‌తో పాటు నగదు చెల్లింపులనూ అనుమతిస్తారు. అయితే నెలరోజుల పాటు మాత్రమే ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపింది.

నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) నుంచి వచ్చిన అభ్యర్థనల నేపథ్యంలో వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ వెసులుబాటు కల్పించింది. మిగిలిన 75 శాతం లేన్లు మాత్రం ఫాస్టాగ్‌ లేన్లుగానే ఉంటాయని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఫాస్టాగ్‌కు సంబంధించిన ఎలాంటి సహాయం కోసమైనా 1033కి ఫోన్‌ చేయాలని సూచించింది.

ఫాస్టాగ్​ వ్యాలిడిటీ..

ఫాస్టాగ్​ ఒక సారి కొనుగోలు చేస్తే ఐదేళ్ల వరకు పని చేస్తుంది. అప్పటి వరకు రీఛార్జ్​ చేసుకుంటే సరిపోతుంది. ఫాస్టాగ్‌ను మరో వాహనానికి మార్చి... ఏదైనా టోల్‌ప్లాజా మీదుగా వెళితే... ఆటోమేటిక్‌ వెహికిల్‌ కౌంటింగ్‌ క్లాసిఫికేషన్‌ (ఏవీసీసీ) ద్వారా దాన్ని గుర్తించి... తర్వాత టోల్‌ప్లాజాలోకి వెళ్లేసరికే అది బ్లాక్‌లిస్ట్‌లోకి వెళ్లిపోతుంది.

తొలిసారి ఎంత చెల్లించాలి... ఎంత నగదు నిల్వ ఉండాలి..?

కారుకు తొలుత రూ.500 చెల్లిస్తే చాలు. అందులో రూ.100 ఫాస్టాగ్‌ రుసుం, రూ.200 సెక్యూరిటీ డిపాజిట్‌, మిగిలిన రూ.200 ఫాస్టాగ్‌ ఖాతాలో టాప్‌అప్‌గా ఉంటుంది. ఈ ఖాతాలో కనీసం రూ.200 ఉండాలి. తర్వాత ఆన్‌లైన్‌లో అవసరమైన మేరకు మన బ్యాంకు ఖాతా ద్వారా రీఛార్జ్​ చేసుకోవచ్చు. ఒక్కో వాహనానికి వేర్వేరు ధరలు ఉంటాయి.

బ్యాంకు ఖాతా అనుసంధానం ఎలా?

ఫాస్టాగ్‌ తీసుకున్న తర్వాత, ఆండ్రాయిడ్‌ ఫోనులో ‘మై ఫాస్టాగ్‌ యాప్‌’ను డౌన్​లోడ్ చేసుకోవాలి. అందులో బ్యాంకు ఖాతా, వాహన నంబర్లను నమోదు చేసుకొని లింకు చేసుకోవచ్చు. ప్రతి టోల్‌ప్లాజా దాటిన తర్వాత వాహనదారుడి మొబైల్‌కి మినహాయించుకున్న రుసుం వివరాలతో సందేశం వస్తుంది.

రాయితీలు, నెలవారీ పాసులు కొనసాగుతాయా..?

టోల్‌ప్లాజాకు 20 కిలోమీర్ల పరిధిలో నివాసం ఉండేవారి వాహనాలకు స్థానిక కోటాలో రాయితీ ఇస్తున్నారు. ఫాస్టాగ్‌ పొందిన వాహనదారులు సంబంధిత టోల్‌ప్లాజాలో వివరాలు తెలియజేస్తే.. వారికి గతంలో మాదిరిగా స్థానిక రుసుంనే మినహాయించుకుంటారు. ఒక నెలలో ఎక్కువ ట్రిప్పులు తిరిగే వారికి నెలవారీ పాసులూ ఉంటాయి.

ఉపయోగాలేమిటి..?

టోల్‌ దగ్గర వాహనం ఆగాల్సిన పనిలేదు. ఫలితంగా డీజిల్‌ వినియోగం తగ్గుతుంది. వెంట నగదు తీసుకెళ్లాల్సిన అవసరం, చిల్లర సమస్య ఉండదు. అద్దెకు తిరిగే వాహనాలు, దూర ప్రాంతాలకు వెళ్లే లారీలు, బస్సులు వంటివి ఏయే టోల్‌ప్లాజాల మీదుగా వెళ్లాయి.. ఆన్‌లైన్‌లో ఎంత నగదు చెల్లింపు జరిగిందనేది వాటి యజమానులు చూసుకోవచ్చు. భారీ వాహనాలకు అదనంగా డబ్బులు తీసుకునే అవకాశం ఉండదు. ఇక ప్లాజాల్లో ఎంత వసూళ్లు జరుగుతున్నాయనే విషయం ప్రభుత్వానికి పక్కాగా లెక్క తెలుస్తుంది. టోల్‌వద్ద సిబ్బంది అవసరమూ తగ్గుతుంది. వీటికి మార్చి నెలాఖరు వరకు ప్రతి టోల్‌ చెల్లింపులో 2.5 శాతం క్యాష్‌బ్యాక్‌ లభించడం అదనం.

మినహాయింపు వాహనాల సంగతేంటి?

మినహాయింపు ఉండే వాహనాలకూ ఫాస్టాగ్​ తీసుకోవాల్సిందే. వీరికిచ్చేది జీరో బ్యాలెన్సు ఫాస్టాగ్‌. వీళ్లు తమ వాహన వివరాలతో ఆన్‌లైన్‌లోగానీ, నేరుగా గానీ ఎన్‌హెచ్‌ఏఐ ప్రాంతీయ అధికారి(ఆర్వో)కి దరఖాస్తు చేసుకొని దీన్ని పొందాలి. రీఛార్జి అవసరం లేకుండానే వీళ్లు ఫాస్టాగ్‌ లైన్‌లో ఆగకుండా వెళ్లిపోవచ్చు.

Last Updated : Dec 15, 2019, 5:38 AM IST

ABOUT THE AUTHOR

...view details