తెలంగాణ

telangana

By

Published : Dec 15, 2020, 2:24 PM IST

ETV Bharat / business

'రైతుల ఆందోళనతో రోజుకు రూ.3,500 కోట్లు నష్టం'

సాగు చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు చేస్తోన్న ఆందోళనల వల్ల సరఫరా దెబ్బతిని ఇప్పటికే రోజుకు దాదాపు రూ. 3,500 కోట్ల నష్టం వాటిల్లుతోందని అసోచామ్ తెలిపింది. ఇకనైనా సమస్యను త్వరగా పరిష్కరించుకోవాలని అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు రైతులను అభ్యర్థించింది. ఈ మేరకు అసోచామ్‌ ఓ ప్రకటన విడుదల చేసింది.

Farmers' protests resulting in daily loss of Rs 3,500 cr: ASSOCHAM
'రైతుల ఆందోళనతో రోజుకు రూ.3,500కోట్ల నష్టం'

కరోనా పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దేశ ఆర్థిక వ్యవస్థపై రైతుల ఆందోళన తీవ్ర ప్రభావం చూపే ప్రమాదముందని వాణిజ్య సంఘాలు హెచ్చరిస్తున్నాయి. అన్నదాతల ఆందోళనల వల్ల సరఫరా దెబ్బతిని ఇప్పటికే రోజుకు దాదాపు రూ. 3,500 కోట్ల నష్టం వాటిల్లుతోందని అసోచామ్ తెలిపింది. ఇకనైనా సమస్యను త్వరగా పరిష్కరించుకోవాలని అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు రైతులను అభ్యర్థించింది. ఈ మేరకు అసోచామ్‌ ఓ ప్రకటన విడుదల చేసింది.

"తాజాగా జరుగుతున్న ఆందోళనలు పంజాబ్‌, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్ముకశ్మీర్‌ ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ మొత్తం దాదాపు రూ. 18లక్షల కోట్లుగా ఉంటుంది. ప్రధానంగా వ్యవసాయం, ఉద్యానవనం, ఫుడ్‌ప్రాసెసింగ్‌, జౌళి, ఆటోమొబైల్‌పైనే వీటి ఆదాయం ఆధారపడి ఉంది. అయితే రైతుల ఆందోళన, రహదారుల నిర్బంధంతో ఈ రాష్ట్రాల్లో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఆటో విభాగాలు, సైకిళ్లు, క్రీడా ఉత్పత్తులు, టెక్స్‌టైల్‌ ముడిసరుకుల పరిశ్రమలు తమ ఉత్పత్తులను ఎగుమతి చేయలేకపోతున్నాయి. ఫలితంగా రోజుకు రూ. 3000-3,500 కోట్ల నష్టం వాటిల్లుతోంది" అని అసోచామ్‌ తన ప్రకటనలో పేర్కొంది.

ఇక పంజాబ్‌, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌ల నుంచి పండ్లు, కూరగాయల సరఫరా నిలిచిపోవడం వల్ల దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వీటి ధరలు ఆకాశన్నంటుతున్నాయని అసోచామ్‌ తెలిపింది. కొవిడ్‌ బారి నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో రైతులు ఆందోళన చేపట్టడం ప్రతికూల పరిణామమని అభిప్రాయపడింది. ఇప్పటికైనా రైతులు, కేంద్ర ప్రభుత్వం చర్చించుకుని సమస్యను పరిష్కరించుకోవాలని అసోచామ్‌ కోరింది.

అటు కాన్ఫడరేషన్ ఆప్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ(సీఐఐ) కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆందోళన ఇలాగే కొనసాగితే ఆయా రాష్ట్రాల ఆదాయం భారీగా దెబ్బతింటుందని, దేశ ఆర్థికవ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని సీఐఐ హెచ్చరించింది. త్వరితగతిన సమస్య పరిష్కారమయ్యేలా చూడాలని కోరింది.

ఇదీ చూడండి: కర్ణాటక శాసనమండలిలో బాహాబాహీ

ABOUT THE AUTHOR

...view details