కుటుంబ వ్యాపార సంస్థలు కొవిడ్-19 సవాళ్లను సమర్థంగా ఎదుర్కొని నిలిచాయని స్టెప్ ప్రాజెక్ట్ గ్లోబల్ కన్సార్షియమ్, కేపీఎంజీ ప్రైవేట్ ఎంటర్‌ప్రైజెస్ సంయుక్తంగా రూపొందించిన నివేదిక స్పష్టం చేసింది. కుటుంబ వ్యాపార సంస్థల్లోని వినూత్న యాజమాన్య విధానాలు, ప్రత్యేకతలు ఇందుకు వీలుకల్పించినట్లు పేర్కొంది. కుటుంబ సభ్యులు తమ వ్యాపార సంస్థల కార్యకలాపాల్లో క్రియాశీలకంగా పాల్గొనడం, దీర్ఘకాలిక దృష్టితో వ్యవహరించడం వల్ల ఆయా సంస్థలు కొవిడ్-19 వల్ల ఎదురైన సమస్యలను తట్టుకుని నిలబడగలిగినట్లు విశ్లేషించింది. 'ఎదిరించి నిలిచాయి: కొవిడ్-19 పై కుటుంబ వ్యాపారాలు ఎలా విజయవంతం అవుతున్నాయి'పేరుతో ఈ నివేదిక రూపొందించారు. ప్రపంచ వ్యాప్తంగా 75 దేశాల్లోని 2,500 కి పైగా కుటుంబ వ్యాపార సంస్థలు, 500 ఇతర వ్యాపార సంస్థలను సర్వే చేసి దీన్ని సిద్ధం చేశారు. మనదేశంలో సర్వే బాధ్యతలను హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) కి చెందిన థామస్ ష్మిధేని సెంటర్ ఫర్ ఫ్యామిలీ ఎంటర్‌ప్రైజ్ నిర్వహించింది.
సమాజ హితం కోసమూ..
ఇతర దేశాల్లోని కుటుంబ వ్యాపార సంస్థలతో పోల్చి చూస్తే మనదేశంలోని కుటుంబ వ్యాపార సంస్థలు కొవిడ్ మహమ్మారికి కొంత భిన్నంగా స్పందించినట్లు స్పష్టమవుతోందని థామస్ ష్మిధేని సెంటర్ ఫర్ ఫ్యామిలీ ఎంటర్‌ప్రైజ్ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ నుపుర్ పవన్ బంగ్ పేర్కొన్నారు. నిర్వహణ వ్యయాలు తగ్గించడం, పెట్టుబడులు పరిమితం చేయడం, పునర్‌వ్యవస్థీకరణ, చెల్లింపులు- వ్యయాలు వాయిదా వేయడం, ఉన్నత స్థానాల్లో ఉద్యోగుల జీతభత్యాలను తగ్గించడం.. వంటి అంశాలపై మనదేశంలోని కుటుంబ వ్యాపార సంస్థలు దృష్టి సారించినట్లు వివరించారు. కార్మిక వ్యయాల తగ్గింపు మనదేశంలోని సంస్థల విషయంలో సగటున 29 శాతం ఉంటే, ప్రపంచ వ్యాప్త సంస్థల్లో అధికంగా 36 శాతం ఉన్నట్లు తెలిపారు. తమ కుటుంబాలు, తమ వ్యాపారాలపై కొవిడ్-19 ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయత్నించడమే కాకుండా, సమాజ హితం కోసం కూడా కుటుంబ వ్యాపార సంస్థలు పనిచేశాయని అన్నారు.