తెలంగాణ

telangana

ETV Bharat / business

'జీడీపీ పతనం ఆందోళనకరం- అప్రమత్తత అత్యవసరం' - రఘురాం రాజన్​ న్యూస్​

దేశ జీడీపీ... జూన్​ త్రైమాసికంలో 23.9 శాతం పతనమవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు మాజీ రిజర్వ్​ బ్యాంక్ గవర్నర్​ రఘురాం రాజన్. ఇప్పటికైనా పాలనాధికారులు అర్థవంతమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం మరింత క్రియాశీలకంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు ఆయన లింక్​డ్​ ఇన్​ పేజీలో అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు​. ​

Fall in GDP alarming; time for bureaucracy to take meaningful action: Rajan
'సమయం ఆసన్నమైంది- అందరూ అప్రమత్తం కావాలి'

By

Published : Sep 7, 2020, 5:13 PM IST

జూన్‌ త్రైమాసికంలో దేశ జీడీపీ 23.9శాతం మేర క్షీణించడంపై ప్రముఖ ఆర్థికవేత్త, రిజర్వ్​ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఆత్మసంతృప్తి నుంచి బయటకు వచ్చి అర్థవంతమైన చర్యలకు శ్రీకారం చుట్టాలని హితవుపలికారు. ప్రతిఒక్కరూ అప్రమత్తం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రస్తుత సంక్షోభాన్ని బట్టి చూస్తే ప్రభుత్వం మరింత క్రియాశీలకంగా, వివేకంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కొవిడ్‌తో అత్యధికంగా ప్రభావితమైన అమెరికాలో జీడీపీ 12.4 శాతం, ఇటలీలో 9.5 శాతం కుంగిపోయిందని గుర్తుచేశారు. వీటితో పోలిస్తే భారత్‌ స్థితి మరింత దయనీయంగా ఉందన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన తన లింక్‌డ్‌ ఇన్‌ పేజీలో అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు.

స్వీయ ఓటమికి కారణాలు...

కొవిడ్‌ మహమ్మారి భారత్‌లో ఇంకా విజృంభిస్తూనే ఉందని రాజన్‌ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో వివేచనతో ఖర్చు పెట్టాల్సినటువంటి రెస్టారెంట్ వంటి సేవలు మందకొడిగానే సాగుతాయని అభిప్రాయపడ్డారు. మరిన్ని పునరుద్ధరణ చర్యలు చేపట్టడానికి ప్రభుత్వం వెనకాడుతోందన్నారు. బహుశా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం పొదుపు చర్యల్ని అవలంబిస్తున్నట్లు అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. కానీ, ఇలాంటి వ్యూహాలు స్వీయ ఓటమికి కారణమవుతాయని హెచ్చరించారు.

మరింత క్షీణిస్తుంది!

ఆర్థిక వ్యవస్థను రోగితో పోల్చిన రాజన్‌.. ఆస్పత్రిలో ఉన్నప్పుడే వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి పౌష్టికాహారం అందించాల్సిన ఉంటుందన్నారు. లేదంటే రోగం ముదిరి రోగి మరింత క్షీణిస్తారన్నారు. అదే విధంగా ఆర్థికపరమైన సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలోనే ఉద్దీపన చర్యలు చేపట్టాలని సూచించారు. లేనిపక్షంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలే ప్రమాదం ఉంటుందన్నారు. ఉద్దీపనను టానిక్‌తో పోల్చిన ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిన తర్వాత టానిక్‌ పెద్దగా ప్రభావం చూపదని వ్యాఖ్యానించారు. అలాగే పూర్తిగా కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థపై ఉద్దీపన ప్రకటనలు ఎలాంటి ప్రభావం చూపవన్నారు. వాహన రంగం వంటి రంగాల్లో కనిపిస్తున్న పునరుత్తేజం వాస్తవ వృద్ధిరేటును సూచించదని తెలిపారు. వృద్ధి రేటు పూర్తిగా పడిపోయి, ఆర్థిక వ్యవస్థ కుంటుపడితే అన్ని రంగాల్లో గిరాకీ పూర్తిగా దిగజారుతుందన్నారు.

క్రియాశీలక ప్రభుత్వ యంత్రాంగం కావాలి!

అదనపు వ్యయం లేకుండానే ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపే మార్గాలపై దృష్టి సారించాలని ప్రభుత్వానికి రాజన్‌ సూచించారు. దీనికి అత్యంత వివేకంతో పనిచేసే క్రియాశీలక ప్రభుత్వ యంత్రాంగం కావాలని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు చేపట్టిన సంస్కరణలు అసంపూర్తిగానే ఉన్నాయన్నారు. తక్షణమే అమలు చేసే అవకాశం లేకపోయినప్పటికీ.. సంస్కరణల అమలుకు ఓ ప్రత్యేక కార్యాచరణ ప్రకటించడం వల్ల మదుపర్లలో భరోసా కలిగే అవకాశం ఉందన్నారు. భారత్‌ కంటే ప్రపంచ దేశాలు అత్యంత వేగంగా కోలుకుంటాయని రాజన్‌ అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఎగుమతుల ద్వారా భారత వృద్ధి రేటుకు ఊతం కల్పించొచ్చున్నారు.

ఇదీ చూడండి:పెరిగిన బంగారం, వెండి ధరలు

ABOUT THE AUTHOR

...view details