వ్యక్తిగత సమాచారాన్ని ట్రాక్ చేయకుండా నిరోధించేందుకు ఆఫ్-ఫేస్బుక్ యాక్టివిటీ అనే కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది సామాజిక మాధ్యమ దిగ్గజం. ఇందులో బయటి వెబ్‌సైట్‌లు, యాప్‌లలో మీ గురించి సేకరించగల సమాచారాన్ని పరిమితం చేయడానికి అవకాశం కల్పిస్తోంది.
'లైక్ బటన్', ఇతర మార్గాల ద్వారా మీ డేటాను ఫేస్బుక్ ట్రాక్ చేసే అంశంలో కొత్త సెక్షన్‌ను తీసుకురానుంది. ఇందులో మీరు ట్రాకింగ్‌ను ఆపివేయడానికి వీలుంటుంది. ఒక వేళ మీరు ట్రాకింగ్‌ను ఆపివేయని సమయంలో.. పాత పద్ధతే కొనసాగుతుందని ఫేస్బుక్ తెలిపింది. గతంలో 'క్లియర్ హిస్టరీ'గా పిలిచిన ఈ టూల్ ప్రస్తుతం 'ఆఫ్-ఫేస్బుక్ యాక్టివిటీ'గా మారనుంది.
చిన్న మార్కెట్లలో అందుబాటులోకి...
మొదట చిన్న మార్కెట్లలో కొత్త ఫీచర్ ప్రారంభించే ధోరణిని ఫేస్బుక్ కొనసాగించింది. ఇప్పటికే ఈ ఫీచర్ దక్షిణ కొరియా, ఐర్లాండ్, స్పెయిన్ దేశాల్లో గత మంగళవారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది సంస్థ. కానీ అమెరికా, ఇతర దేశాల్లో ఎప్పటి నుంచి తీసుకొస్తారనేది స్పష్టత ఇవ్వలేదు. కొన్ని నెలల్లోనే తీసుకురానున్నట్లు తెలుస్తోంది.