దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్ 'కొవిడ్-19 అనౌన్స్‌మెంట్' ఫీచర్‌ను భారత్‌లో ప్రవేశపెట్టనుంది. ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల భాగస్వామ్యంతో దీనిని రూపొందించనున్నట్లు వెల్లడించింది. ఈ తరహా సేవలు అందుబాటులోకి వచ్చిన రెండో దేశం భారతదేశమేనని 'ఎఫ్బీ' తెలిపింది.
కొవిడ్-19 అనౌన్స్‌మెంట్' ఫీచర్స్..
- రాష్ట్ర ఆరోగ్య శాఖ పేజీల్లోని పోస్ట్‌లను ప్రజలు ఎక్కువ సంఖ్యలో వీక్షించే అవకాశం ఉందని ఫేస్‌బుక్ తెలిపింది. ఈ సేవలను మరింత విస్తరించి, కరోనా తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లోని వ్యక్తులకు అలెర్ట్ నోటిఫికేషన్లను పంపనున్నట్లు ఫేస్‌బుక్ పేర్కొంది.
- కరోనా టీకాల సమాచారాన్ని ప్రజలకు సకాలంలో చేరవేసేందుకు రాష్ట్రాల ఆరోగ్య విభాగాలకు ఈ ఫీచర్ తోడ్పడనుంది. అంతేగాక.. టీకాల గురించి విశ్వసనీయమైన సమాచారాన్ని ప్రజలకు అందించనుంది.
- కరోనా చికిత్స వనరులపై సమాచారాన్ని పంచుకునేందుకు ఈ పేజీలను హెల్ప్‌లైన్‌లుగా ఉపయోగించవచ్చని ఫేస్‌బుక్ తెలిపింది. ఐసీయూ, ఆక్సిజన్ పడకలకు సంబంధించిన సమాచారంతో పాటు.. జిల్లా ఆసుపత్రుల్లో కరోనా పడకల లభ్యత, లాక్డౌన్, రాత్రి కర్ఫ్యూలు, కరోనా చికిత్స నిబంధనలను ఈ పేజీల ద్వారా పంచుకోనుంది ఫేస్‌బుక్.