తెలంగాణ

telangana

ETV Bharat / business

'ఆంధ్రాబ్యాంకుపై ఉన్న నమ్మకాన్ని నిలబెడతాం'

ఆంధ్రాబ్యాంక్‌తో తెలుగు రాష్ట్రాల ప్రజల అనుబంధం విడదీయలేనిదని.. ఇప్పుడు యూనియన్‌ బ్యాంక్‌లో ఆంధ్రా బ్యాంక్‌ విలీనమైనప్పటికీ ఆ బంధాన్ని కొనసాగిస్తూ.. వాళ్ల నమ్మకాన్ని నిలబెడతామన్నారు యూనియన్‌ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టరు, సీఈఓ జి.రాజ్‌ కిరణ్‌రాయ్‌. కరోనా వైరస్‌ పరిణామాల ప్రభావం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లోనే ఉంటుందని, పరిస్థితి అదుపులోకి వచ్చాక రుణాల వృద్ధి పుంజుకుంటుందని చెబుతున్న కిరణ్‌రాయ్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి...

face to face with union bank md, ceo raju kiranrai
'ఆంధ్రాబ్యాంకుపై ఉన్న నమ్మకాన్ని నిలబెడతాం'

By

Published : Apr 29, 2020, 10:05 AM IST

యూనియన్‌ బ్యాంక్‌లో ఆంధ్రా బ్యాంక్‌ విలీనమైనప్పటికీ ఆ బంధాన్ని కొనసాగిస్తూ.. వాళ్ల నమ్మకాన్ని నిలబెడతామని యూనియన్‌ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టరు, సీఈఓ జి.రాజ్‌ కిరణ్‌రాయ్‌ అన్నారు. తమ వ్యాపారానికి తెలుగు రాష్ట్రాలు ఎంతో కీలకమని చెప్పారు.

భారతీయ బ్యాంకింగ్‌ రంగంపై కొవిడ్‌-19 ప్రభావం ఏ మేరకు ఉండబోతోంది

కరోనా మహమ్మారి విజృంభించకుండా దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ వల్ల వ్యక్తులతోపాటు, వ్యాపారాలపైనా ప్రతికూల ప్రభావం పడింది. స్వల్పకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థను ఇది బలహీనపర్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లో ఇది కనిపించే అవకాశం ఉంది. వినియోగదారుల నుంచి గిరాకీ లేకపోవడంతో చాలా వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తిని తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి.

దీనివల్ల తొలి త్రైమాసికంలో బ్యాంకుల రుణ ఖాతాల వృద్ధిలో సవాళ్లు ఎదురవుతాయని అనుకోవచ్చు. దీంతో పాటు రుణ వాయిదాల వసూలులోనూ ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉండేది. అదృష్టవశాత్తూ.. ఆర్‌బీఐ అన్ని వర్గాల రుణ గ్రహీతలకూ కొన్ని మినహాయింపులు కల్పించింది. ఫలితంగా స్వల్పకాలంలో ఎదురయ్యే ఇబ్బందులను తప్పించుకునేందుకు వీలయ్యింది. ముఖ్యంగా ఎన్‌పీఏలు పెరగకుండా కాపాడిందని చెప్పొచ్చు. ఈ సంక్షోభం ముగిసిన వెంటనే.. వృద్ధి బాటలో ఎలాంటి ఇబ్బందులూ ఉండవని భావిస్తున్నాం.

లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత రుణాలకు గిరాకీ పెరుగుతుందా?

ఏయే రంగాల నుంచి ఇది ఉంటుందని భావిస్తున్నారు

ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఉపద్రవం నెమ్మదించి.. వ్యక్తులు, వ్యాపార సంస్థలు పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభించిన తర్వాత రుణాలకు గిరాకీ పూర్వ స్థాయిలోనే ఉంటుందని ఆశిస్తున్నాం. కరోనాతో రిటైల్‌, ఎంఎస్‌ఎంఈ రంగాలు చాలా వరకూ దెబ్బతిన్నాయి. ఎంఎస్‌ఎంఈ రంగంలో నగదు లభ్యత తగ్గడంతో పాటు సరఫరాలో ఇబ్బందులు, ఉద్యోగులు లేకపోవడం లాంటివి మరింత కష్టాలు సృష్టించాయి. కొవిడ్‌-19 తర్వాత వ్యవసాయం, గ్రామీణ రుణాలు, ఎంఎస్‌ఎంఈలు, వ్యక్తిగత రుణాల విభాగంలోని రుణాలకు అధిక గిరాకీ ఉంటుందని అనుకుంటున్నాం.

ఆంధ్రా, కార్పొరేషన్‌ బ్యాంకులను విలీనం చేసుకున్న తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మీ స్థానం ఎలా ఉంది? ఇక్కడ మరింత వృద్ధి చెందేందుకు ఎలాంటి ప్రణాళికలను అమలు చేస్తున్నారు?

విలీనం తరువాత తెలుగు రాష్ట్రాల్లో మేము పెద్ద బ్యాంకుల్లో ఒకటిగా మారాం. ప్రస్తుతం యూనియన్‌ బ్యాంక్‌కు ఏపీలో 1220, తెలంగాణలో 737 శాఖలు ఉన్నాయి. తెలంగాణ వరకూ అతిపెద్ద బ్యాంకుగానే మారాం. రెండు తెలుగు రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి సాధిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ రాష్ట్రాలు మా వ్యాపారానికి ఎంతో కీలకంగా మారతాయి. వ్యవసాయ, వ్యవసాయేతర రంగాలతోపాటు, నిర్మాణం, నీటిపారుదల ప్రాజెక్టులు, పరిశ్రమలకు ఇక్కడ ప్రాముఖ్యం పెరుగుతుంది. దీన్ని మేము అవకాశంగా మలుచుకుంటాం. ఎంఎస్‌ఎంఈ రుణాలు, వ్యవసాయ రుణాలు, బంగారంపై అప్పు తదితరాలకు గిరాకీ ఉంటుందని అనుకుంటున్నాం. రిటైల్‌, కార్పొరేట్‌ రుణాలపైనా దృష్టి సారిస్తున్నాం. దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆంధ్రాబ్యాంకుతో విడదీయలేని అనుబంధం ఉంది. తెలుగు ప్రజలు ఆంధ్రాబ్యాంకుపై పెట్టుకున్న నమ్మకాన్ని మేము నిలబెడతాం.

ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్‌ బ్యాంకుల విలీనం అంతా సవ్యంగా జరిగిందా? ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా?

వందేళ్ల చరిత్ర ఉన్న మూడు బ్యాంకులు, 9600కు పైగా శాఖలు, 75,000కు పైగా ఉద్యోగులు విలీనం అయ్యేప్పుడు కొన్ని సవాళ్లు ఉంటాయి. విలీనం తేదీకి కొన్ని రోజుల ముందే లాక్‌డౌన్‌ను ప్రకటించడం పెద్ద ఇబ్బందిగా మారింది. కొన్ని చిక్కులు ఎదుర్కొన్నప్పటికీ.. ఈ మూడు బ్యాంకుల విలీనం భారతీయ బ్యాంకింగ్‌ చరిత్రలో ఒక గొప్ప పరిణామంగా నిలిచింది. డిజిటల్‌ సాంకేతికతతోపాటు, సమర్థమైన ప్రణాళిక ఇందుకు తోడ్పడింది. ముఖ్యమైన సమావేశాలన్నీ వీడియో కాన్ఫరెన్సుల ద్వారానే నిర్వహించాం. ఉద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు కొన్ని డిజిటల్‌ వేదికలను వినియోగించుకున్నాం. క్షేత్ర స్థాయి సిబ్బంది కోసం వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేశాం. ఫలితంగా లాక్‌డౌన్‌ ఇబ్బందులను అధిగమించి, ఏప్రిల్‌ 1 నుంచి పూర్తి స్థాయిలో కార్యకలాపాలను యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించగలిగింది.

విలీనం నేపథ్యంలో బ్యాంకు శాఖలు, ఏటీఎంలను తగ్గించే యోచన ఉందా?

ఇప్పటికిప్పుడు బ్యాంకు శాఖలను తగ్గించే ఆలోచనేమీ లేదు. దేశవ్యాప్తంగా ఇప్పుడు మాకు మొత్తం 9,500కు పైగా శాఖలు, 13,500కు పైగా ఏటీఎం కేంద్రాలున్నాయి. ఇవన్నీ మా ఖాతాదారులకు అందుబాటులోనే ఉంటాయి. భవిష్యత్తులో శాఖలను తగ్గించాలనుకున్నా.. అన్ని అంశాలను పరిశీలించాకే దశలవారీగా నిర్ణయం తీసుకుంటాం. ఆయా శాఖలు ఉన్న ప్రాంతం, నిర్వహిస్తున్న వ్యాపారంలాంటి అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుంటాం. ఉదాహరణకు విలీనం తర్వాత యూనియన్‌ బ్యాంక్‌ ఒక్కో శాఖ మధ్య కిలోమీటరు కన్నా తక్కువ దూరంలో 700 శాఖలు ఉన్నట్లు గుర్తించాం. ఒకే భవనం, రోడ్డులో యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో పాటు పూర్వ ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్‌ బ్యాంకుల శాఖలూ ఉన్నాయి. ఇలాంటివాటిని కలిపి, ఒకే శాఖగా ఏర్పాటు చేయడం లేదంటే బ్యాంకు సేవలు అందుబాటులో లేని చోట కొత్త శాఖను ప్రారంభించడంలాంటి వాటిని పరిశీలిస్తున్నాం. ఏటీఎంలకూ ఇదే విధానాన్ని పాటిస్తాం. దశల వారీగా ఇదంతా పూర్తయ్యేసరికి 2-3 ఏళ్లు పట్టే అవకాశం ఉంది.

మీ బ్యాంకు పరిస్థితి ఏమిటి? ఎన్‌పీఏలు ఎలా ఉన్నాయి? ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మీ లక్ష్యాలేమిటి?

విలీనం తర్వాత యూనియన్‌ బ్యాంక్‌ దేశంలో ఐదో పెద్ద బ్యాంకుగా అవతరించింది. రూ.15లక్షల కోట్ల వ్యాపారాన్ని బ్యాంకు నిర్వహిస్తోంది. ఇందులో రూ.6.5లక్షల కోట్ల రుణాలున్నాయి. ప్రస్తుత ఆర్థికంలో రుణ వితరణలో 9శాతం వృద్ధిని ఆశిస్తున్నాం. ప్రస్తుతం బ్యాంకు ఎన్‌పీఏలు 6.5 శాతం ఉన్నాయి. రుణాల వసూలు, కేటాయింపులు పెంచడం ద్వారా వీటిని 6శాతానికి చేర్చేందుకు ప్రయత్నిస్తున్నాం. తొలి త్రైమాసికంలో రూ.3,000 కోట్ల మొండి బాకీలను వసూలు చేయాలని లక్ష్యంగా విధించుకున్నాం.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details