కరోనా వైరస్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎన్నడూలేని విధంగా తిరోగమనం బాటపట్టింది. ఈ మహమ్మారితో మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలైంది. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా 21 రోజులు లాక్డౌన్ విధించింది. తాజా ఆంక్షల మూలంగా అన్ని వర్గాల ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పేద, బడుగు, బలహీన వర్గాల వారిని ఆదుకునేందుకు 'ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ పథకం' పేరుతో కేంద్రం భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. పేద ప్రజల ఆహార, రోజువారీ అవసరాలకుగానూ రూ. లక్షా 70 వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీతో భరోసా ఇచ్చారు కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్. దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో, ఖాళీ జేబులతో ఉండరాదన్నదే ప్రభుత్వ అభిమతమని ఉద్ఘాటించారు నిర్మల.
'ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్' పథకంలో ఏఏ వర్గాలవారికి ఏమి అందుతాయో పరిశీలిస్తే..
పేదవారికి
- రేషన్ కార్డు ఉన్న 80 కోట్ల మంది ప్రజలకు ఒక్కొక్కరికి నెలకు 5 కిలోల చొప్పున బియ్యం లేదా, గోధుమలు ఉచితంగా అందుతాయి. వీటితో పాటు కిలో పప్పు ధాన్యాలు అందిస్తారు. ఇలా మూడు నెలల పాటు సరఫరా చేస్తారు.
- ప్రస్తుతం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందిస్తున్న 5 కిలోల ఆహార ధాన్యాలకు ఇవి అదనం.
రైతులకు అందే ఫలాలు
- ప్రస్తుతం అమల్లో ఉన్న పీఎం కిసాన్ యోజనలో భాగంగా ఏప్రిల్ మొదటి వారంలో రైతుల ఖాతాల్లోకి 2 వేల రూపాయలు జమచేస్తారు. దీని ద్వారా దేశంలో 8 కోట్ల 69 లక్షల మంది కర్షకులకు ప్రయోజనం చేకూరనుంది.
మహిళలు, వృద్ధులకు ఇవి..
- మహిళా స్వయం సహాయక బృందాలు ఇక ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.20 లక్షలు రుణం పొందొచ్చు. ఇప్పటివరకు అది రూ.10 లక్షలుగా ఉంది.
- దేశంలోని 20 కోట్ల 50 లక్షల మంది మహిళల జన్‌ధన్ యోజన ఖాతాల్లో 3 నెలల పాటు 500 రూపాయల చొప్పున జమచేస్తారు.
- ఉజ్వల పథకం లబ్ధిదారులకు మూడు నెలల పాటు ఉచితంగా గ్యాస్ సిలిండర్ల అందజేస్తారు.
- 3 కోట్ల మంది నిరుపేద వృద్ధులు(60 ఏళ్లు పైబడినవారు), వితంతువులు, దివ్యాంగులకు రూ.1000 ఎక్స్‌గ్రేషియా ఇస్తారు.