తెలంగాణ

telangana

ETV Bharat / business

అపరిచిత వైరస్‌తో అపూర్వ పోరు!

ప్రపంచం అంతా ఇప్పుడు కనిపించని శత్రువు(కరోనా వైరస్​)తో యుద్ధం చేస్తోంది. ఇలా వైరస్​లతో యుద్ధం కొత్తేమి కాకపోయినా.. ఈ సారి పోరాటం మాత్రం క్లిష్టంగా మారింది. ఇందుకు కారణాలేంటి? కరోనాపై మానవాళి విజయం ఎప్పుడు అనే ప్రశ్నలన్నింటికి ప్రముఖ 'భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌’ వ్యాపారాభివృద్ధి విభాగం అధిపతి డా. రేచస్‌ ఎల్లా 'ఈనాడు'తో పంచుకున్నారు. ఆ విశేషాలు మీ కోసం.

By

Published : Apr 4, 2020, 6:51 AM IST

experts view on corona vaccine
అపరిచిత వైరస్‌తో అపూర్వ పోరు!

కంటికి కనిపించని సూక్ష్మాతి సూక్ష్మమైన వైరస్‌లతో పోరాటం మనకు కొత్తేం కాదు. జలుబు నుంచి పోలియో వరకూ అనునిత్యం ఎన్నో వైరస్‌లతో పోరాడుతూనే ఉన్నాం. చాలా యుద్ధాల్లో అద్భుత విజయాలూ సాధించాం! కానీ తాజా కరోనా వైరస్‌తో పోరాటం ఎందుకింత కష్టంగా, క్లిష్టంగా తయారైంది? దాన్ని చూసి ప్రపంచం ఎందుకింతగా గడగడలాడిపోతోంది? వైరస్‌లు తెచ్చిపెట్టే ఎన్నో వ్యాధులను టీకాను అస్త్రంగా చేసుకుని సంపూర్ణంగా నిర్మూలించగలిగిన మనం ఈ సరికొత్త కల్లోల కరోనాపై ఎప్పటికి పైచెయ్యి సాధించగలం?

ఈ ప్రశ్నలనే కరోనా టీకా తయారీ కార్యక్రమానికి నడుంకట్టిన ప్రఖ్యాత సంస్థ 'భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌’ వ్యాపారాభివృద్ధి విభాగం అధిపతి డా।। రేచస్‌ ఎల్లా ముందుంచింది 'ఈనాడు'. సాధారణంగా వైరస్‌కు టీకాను, మందులను ఆవిష్కరించటంలో ఎదురయ్యే అడ్డంకులేమిటో, వాటిని అధిగమించే మార్గాలేమిటో వివరిస్తున్న ఆయనతో ప్రత్యేక ముఖాముఖి...

తాజా కరోనా వైరస్‌ ప్రపంచాన్ని ఎందుకింతగా భయపెడుతోంది?

ఒకటి- ఇదింత వరకూ మనుషులకు సోకని కొత్త వైరస్‌. కరోనా కుటుంబానికి చెందిన ఈ సార్స్‌-కోవ్‌-2 వైరస్‌.. గబ్బిలాల్లోనూ, అలుగుల్లోనూ ఉండే రకం. అది వాటి నుంచి మొట్టమొదటిసారి మనుషుల్లోకి వచ్చింది. చైనాలో మాంసం వండకుండా తినే అలవాటుండటం వల్ల పక్షులు, జంతువుల నుంచి ఇలాంటి వైరస్‌లు మనుషుల్లోకి రావటం గతంలోనూ గమనించిందే. ఇలా ఇప్పటి వరకూ మనకే మాత్రం పరిచయం లేని వైరస్‌ కాబట్టి మనలోని రోగనిరోధక వ్యవస్థ దీన్ని సమర్థంగా ఎదుర్కోలేకపోతోంది. ఇప్పటికే మధుమేహం, శ్వాస సమస్యలు, గుండె సమస్యల వంటివి ఉన్నవాళ్లకు, క్యాన్సర్‌ చికిత్సలు తీసుకుంటున్న వాళ్లకు రోగనిరోధక వ్యవస్థ కొంత బలహీనంగా ఉంటుంది. అలాంటి వారికి ఈ కొత్త వైరస్‌తో యుద్ధం మరింత కష్టంగా ఉంటోంది. రెండోది- దీని వేగం, వ్యాప్తి కూడా మనల్ని భయపెడుతున్నాయి. ఒకళ్ల నుంచి ఇది కనీసం ముగ్గురికి అంటుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. పైగా సాధారణంగా యుక్తవయస్కులకో, మధ్యవయసు వారికో వస్తే ఎలాంటి లక్షణాలూ కనబడకపోవచ్చుగానీ వాళ్ల ద్వారా ఇంట్లో ఉన్న వృద్ధులకు సోకుతోంది. గతంలో ఏ వైరస్‌ విషయంలోనూ ఈ వ్యాప్తి ఇంత తీవ్రంగా లేదు. అందుకే ప్రపంచవ్యాప్తంగా కరోనా ఇంత భయాందోళనలను సృష్టిస్తోంది.

పోలియో నుంచి చిన్నమ్మవారు వరకూ ఎన్నో వైరల్‌ వ్యాధులకు టీకాలు తయారు చేసిన చరిత్ర మనకుంది. మరి ఈ కరోనా వైరస్‌కు టీకా తయారు చెయ్యటం ఎందుకు కష్టమవుతోంది?

కష్టమని కాదుగానీ టీకా తయారీ అనేది క్లిష్టమైన, కొంత సమయం పట్టే ప్రక్రియ. సాధారణంగా జబ్బు చేసిన వాళ్లకు ఇచ్చే ఒక మంచి యాంటీ బయాటిక్‌ను గానీ, యాంటీ వైరల్‌ మందునుగానీ తయారు చెయ్యాలంటేనే 5-7 ఏళ్లు పడుతుంది, భారీ వ్యయమూ అవుతుంది. అలాంటిది టీకాలనేవి వ్యాధి రాకుండా పూర్తి ఆరోగ్యవంతులకు ఇచ్చేవి. కాబట్టి సమర్థత కంటే కూడా ముందివి పూర్తి సురక్షితమని నిర్ధారించుకోవటం ముఖ్యం. అందుకే సాధారణంగా ఏదైనా టీకా తయారు చెయ్యాలంటే కనీసం 7-20 ఏళ్లు పడుతుంది. అది ఎన్నో దశలను దాటుకుని రావాలి. మన దేశంలో ఎక్కువగా జెనెరిక్‌ మందుల తయారీని చూస్తుంటాం. అంటే ఇప్పటికే అమెరికా వంటి దేశాల్లో తయారవుతున్న ఔషధాల తయారీ హక్కులు తీసుకుని వాటినే ఇక్కడ తయారు చేస్తారు. కానీ టీకాల విషయంలో ఇలా కుదరదు. ముందుగా మనమే వైరస్‌ను నిలువరించే సరికొత్త ఔషధాన్ని కనిబెట్టాలి. దాని తయారీ ప్రక్రియ మొత్తాన్ని ఆవిష్కరించుకోవాలి. తర్వాత దాన్ని జంతువుల మీద, మనుషుల మీద ప్రయోగించి చూడాలి. దీనంతటికీ 7-20 ఏళ్లు పడుతుంది. ఇటీవలే ఎబోలాకు టీకా తయారు చేశారు. దాన్నా దశకు తేవటానికి ఆ కంపెనీకి 3-5 ఏళ్లు పట్టింది. ఇక తాజా కరోనాకు టీకా రావాలంటే తక్కువలో తక్కువగా 18 నెలల నుంచి 2 ఏళ్ల వరకూ పట్టొచ్చు. ఈ సమయాన్ని సాధ్యమైనంత తగ్గించి త్వరగా టీకాను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాం.

'కొమ్ము'ల నుంచే మట్టుబెట్టాలి!

ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడిన వారి నుంచి సీరంను సేకరిస్తే దాంట్లో ఈ వైరస్‌కు యాంటీబోడీలు ఉంటాయి. వాటిని గ్రహించి సాధారణ ఆరోగ్యవంతులకు ఇవ్వటం ద్వారా వ్యాధి బారినపడకుండా నివారించొచ్చు. దీన్నే ‘కాన్వలసెంట్‌ ప్లాస్మా థెరపీ’ అంటారు. దీనిపై మొట్టమొదట్లో న్యూయార్క్‌లో అధ్యయనం మొదలైంది. కానీ ఇది తాత్కాలిక పరిష్కారమే అవుతుంది. దీనికి శాశ్వతమైన పరిష్కారం.. అందుబాటులో ఉన్న జన్యుసమాచారం ఆధారంగా మనం కచ్చితమైన టీకాను ఆవిష్కరించటమే! అందుకు ముందుగా ఆ వైరస్‌లోని ఏ భాగం మన కణాలను పట్టుకుని, మనలోకి ప్రవేశిస్తోందో అర్థం చేసుకోవాలి. దానికి వ్యతిరేకంగా సర్వసమర్థమైన యాంటీబోడీని సృష్టించాలి. ఈ కరోనా వైరస్‌ మీద ఉన్న కొమ్ముల్లాంటి ‘స్పైక్‌ ప్రోటీనే’ మనలోని కణాలను పట్టుకుని, మన శరీరంలోకి ప్రవేశించి, వ్యాధిని కలగజేస్తోంది. జనవరిలో చైనా ప్రభుత్వం ఈ వైరస్‌కు సంబంధించిన జన్యు సమాచారాన్ని విడుదల చేసింది. అప్పట్నించీ అందరం ఆ స్పైక్‌ ప్రోటీను ఆధారంగా కరోనాను ఎలా అడ్డుకోవాలా? అన్నదే పరిశోధిస్తున్నాం.

కరోనా చికిత్సకు వాడుతున్న మందుల పరిస్థితి ఏమిటి?

ప్రస్తుతానికి దీని చికిత్సకు ఎలాంటి మందులూ లేవు. మలేరియాకు వాడే ‘హైడ్రాక్సి క్లోరోక్విన్‌’ మందు దీనికీ పని చేస్తోందని గుర్తించారు. దీంతో పాటు అమెరికాలో ‘అజిత్రోమైసిన్‌’ అనే యాంటీబయాటిక్‌ కూడా ఇస్తున్నారు. వీటితో రోగనిరోధక వ్యవస్థ బాగా స్పందిస్తోందని గ్రహించారు. ఇదంతా కూడా అనుభవంలో చెప్పుకోవటమేగానీ శాస్త్రీయంగా నిర్ధారణ కాలేదు. పైగా వీటితో గుండె లయలో తేడాలు రావటం వంటి దుష్ప్రభావాలూ ఉంటాయి. కాబట్టి సోషల్‌ మీడియాలో వస్తున్న ప్రచారాలన్నీ నమ్మి వీటిని పొరపాటున కూడా తీసుకోకూడదు. మొదట్లో హెచ్‌ఐవీకి వాడే మందులు కూడా దీనికి పని చేస్తున్నాయని భావించారుగానీ అవంత సమర్థంగా లేవని క్రమేపీ గుర్తించారు. అలాగే ఫ్లూ జ్వరానికి వాడే టామిఫ్లూ పని చేస్తుందనుకున్నారు, అదీ సరికాదని తేలింది. ఇప్పటి వరకూ ఉన్న సమాచారం ప్రకారం రెడ్‌మెసివియర్‌ అనే మందు బాగా పని చేస్తోందంటున్నారు. మనుషుల మీద తుది దశ ప్రయోగాల్లో వీటి సమర్థత తేలితే మన దేశంలోనూ తయారు చేసే అవకాశం ఉంది.

కరోనాతో దేశవ్యాప్తంగా పెద్ద పోరాటమే చేస్తున్నాం. మనం ఇంకా ఏమన్నా చెయ్యాల్సి ఉంటుందంటారా?

కరోనాను ఎదుర్కొనే విషయంలో మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషి అసాధారణం, అద్భుతం! 130 కోట్ల మంది ప్రజలను 21 రోజుల పాటు లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితం చేయటమనేది సామాన్య విషయం కాదు. అత్యంత జనసమర్ద దేశం మనది, మరోవైపు మన వైద్య ఆరోగ్య వ్యవస్థలూ మరీ అంత పటిష్ఠమైనవేం కాదు. అందుకే ఇంత కఠినమైన చర్యలు తప్పవు. దీన్ని మనందరం గుర్తించాలి. ప్రస్తుతానికి ప్రజలంతా వ్యక్తిగత దూరం పాటించటం చాలా చాలా ముఖ్యం!

ప్రపంచానికే టీకాలు అందిస్తున్న అతిపెద్ద దేశం మనది. ఈ సమయంలో మనం ఎలాంటి పాత్ర పోషించొచ్చు అంటారు?

ప్రపంచవ్యాప్తంగా పుడుతున్న ప్రతి 10 మంది పిల్లల్లో ఆరుగురు మన భారతీయ టీకాలు తీసుకుంటున్న వాళ్లే! మన భారతీయ కంపెనీలు చౌకగా టీకాలు తయారు చేయటంలో దిట్ట. బహుళజాతి కంపెనీలు 2-3 డాలర్లకు ఇచ్చే పోలియో టీకాను మనం అందులో పదో వంతుకే.. 10 సెంట్లకే తయారు చేస్తున్నాం. టీకాల తయారీలో మనకంత సామర్థ్యం ఉంది. కాబట్టి ఈ కల్లోల సమయంలో కరోనాకు టీకా తయారీ అన్నది ఒక రకంగా నైతిక బాధ్యత కూడా! దీనికోసం మనం సొంతంగా టీకాను తయారు చెయ్యాలి లేదా దీనిపై కృషి చేస్తున్న సంస్థలతో కలిసి అయినా దీన్ని సాకారం చెయ్యాలి. అందుకే మేం భారత్‌ బయోటెక్‌లో అంతర్జాతీయ కన్సార్షియంతో కలిసి కృషి చేస్తున్నాం. దీనివల్ల కచ్చితంగా సత్వర ఫలితాలుంటాయి. దీనిపై ప్రభుత్వం, భారత ఔషధ నియంత్రణ మండలి వేగంగా స్పందిస్తున్నాయి. ఇప్పటికే జంతువుల మీదా, మనుషుల మీదా ఏకకాలంలో ప్రయోగించి చూసేందుకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది. ముందెన్నడూ వినని విషయం ఇది. అదే పెద్ద ఊరట అనుకుంటే ప్రతిపాదనలతో ముందుకొచ్చే ఫార్మా, డయాగ్నస్టిక్‌, టీకా కంపెనీలన్నింటికీ గ్రాంటు మంజూరుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేసింది. కరోనాపై పోరాటానికి ఇవన్నీ కూడా ప్రభుత్వం తీసుకుంటున్న కీలక చర్యలే.

ఇదీ చూడండి:కరోనా మరణాలు, నిరుద్యోగంతో అగ్రరాజ్యాలు గజగజ

ABOUT THE AUTHOR

...view details