Health Insurance Plans: ఆరోగ్య బీమా ఇప్పుడే మాకెందుకు.. ఇది పెద్దవారికే కదా.. అనే భావన చాలామంది యువత భావించారు. కానీ, కరోనా తర్వాత ఈ ఆలోచనలో మార్పు వచ్చింది. ఎవరికైనా, ఏ సమయంలోనైనా జీవితం, ఆరోగ్యం అనిశ్చితిలో పడవచ్చని తెలుసుకున్నారు. ఇప్పటి యువత తమ ఆర్థిక విషయాలను నిర్వహించుకోవడంలో చురుగ్గా ఉంటున్నారు. వైద్య అత్యవసరాల సమయంలోనూ ఆర్థిక శక్తిపై ప్రభావం పడకుండా ఉండాలంటే.. ఆరోగ్య బీమాను చిన్న వయసులోనే కొనాలి. ఏ ఆరోగ్య అత్యవసరమైనా మీ జీవితాన్ని తలకిందులు చేయొచ్చు. జీవన శైలిని మార్చొచ్చు. మానసిక ఒత్తిడిని పెంచొచ్చు. ప్రతీ వ్యక్తి తన వయసుతో సంబంధం లేకుండా ఆరోగ్య బీమా పథకాలను తీసుకోవాల్సిన అవసరాన్ని కొవిడ్ నొక్కి చెప్పింది. ఒక వ్యక్తీ తనకు 30 ఏళ్లు వచ్చేలోగానే వ్యక్తిగత ఆరోగ్య బీమాను పొందాలి. అంత తక్కువ వయసుకే ఎందుకు అని అనిపిస్తే.. ఇదిగో ఇవే ఆ కారణాలు..
తక్కువ ప్రీమియం వ్యయం..
ఏ ఆరోగ్య బీమాకైనా చిన్న వయసులోనే కొనుగోలు చేస్తే ప్రీమియం ఛార్జీలు తక్కువగానే ఉంటాయి. మీకు 30 ఏళ్లు దాటితే ప్రీమియాలు పెరుగుతాయి. 20ల్లో ఉండి.. ఆరోగ్యంగా ఉన్నాము అని భావిస్తే.. అదే బీమా కొనుగోలు చేయడానికి సరైన సమయం. ఎటువంటి క్రిటికల్ సమస్యలూ లేనపుడు మరింత తక్కువ ప్రీమియంకే బీమా వస్తుంది.
వేచిచూసే సమయాలు..
ఏ ఆరోగ్య బీమా కంపెనీకైనా తమ పథకాలకు కొన్ని వేచి చూసే సమయాలు ఉంటాయి. వేర్వేరు ముందస్తు రోగాల (ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్)కు వేర్వేరు వేచిచూసే సమయాలు ఉంటాయి. ఇవి ఏడాది నుంచి రెండేళ్ల వరకు.. ఒక్కోసారి నాలుగేళ్ల వరకు ఉంటాయి. అత్యవసరంగా బీమా కావాలి అని అడిగినా.. ఈ వేచి చూసే సమయాన్ని తగ్గించలేరు. కాబట్టి జీవితంలో ఎంత ముందుగా బీమా తీసుకుంటే.. అత్యవసరంలో అంత ఉపయోగపడుతుంది.
జీవన శైలి మార్పులు
పెరుగుతున్న కాలుష్య స్థాయిలకు తోడు ఆదుర్దా, ఆందోళన కారణంగా యువత సైతం జీవన శైలి రోగాలతో ఇబ్బంది పడుతున్నారు. గుండె జబ్బులతో పాటు ఇతరత్రా రోగాలు వచ్చేస్తున్నాయి. ఇవి యువ జనాభాపై చాలా ప్రభావం చూపుతున్నాయి. కాబట్టి వీటన్నిటికీ సిద్ధంగా ఉండాలి. భవిష్యత్ వైద్య చికిత్సలు, అత్యవసరాలకు ఇప్పటి నుంచే పెట్టుబడులు పెట్టడం చాలా మంచిది.