తెలంగాణ

telangana

ETV Bharat / business

ఈవీల ధరలు తగ్గించే ఘనమైన బ్యాటరీలొస్తున్నాయ్‌! - విద్యుత్​ కార్ల ధరలు తగ్గించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు

భవిష్యత్​ అంతా విద్యుత్​ కార్లదే అనడంలో సందేహం లేదు. అయితే ప్రస్తుతానికి మాత్రం విద్యుత్ కార్ల ధరలు ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది వాటిని కొనేందుకు వెనకడుకు వేస్తున్నారు. ఇందుకోసం ఎలక్ట్రిక్ కార్ల ధరలు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాయి ఆటో మొబైల్ కంపెనీలు. కార్ల ధర ఎక్కుగా ఉండేందుకు ప్రధాన కారణాల్లో ఒకటైన బ్యాటరీ వ్యయాలు తగ్గించుకోవాలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగా సాలిడ్‌ స్టేట్‌ బ్యాటరీలను ఉపయోగించేందుకు కసరత్తు చేస్తున్నాయి.

New type batteries for EVs
విద్యుత్​ కార్లకు కొత్త రకం బ్యాటరీలు

By

Published : May 16, 2021, 1:06 PM IST

విద్యుత్‌ వాహనాల ధర ఎక్కువగా ఉండడానికి బ్యాటరీ కూడా కారణం. అయితే కంపెనీలు బ్యాటరీ వ్యయాలు తగ్గించుకోవడం ద్వారా ధరలను కిందకు తీసుకురావాలని సూచిస్తున్నాయి. అందులో ఒకటి సాలిడ్‌ స్టేట్‌ బ్యాటరీలను వినియోగించడం. అయితే వాటి నుంచి విద్యుత్‌ను రాబట్టుకునే క్లిష్ట ప్రక్రియకు సాంకేతికత ఎంత వరకు సహాయం చేస్తుంది; అవి ఎపుడు అందుబాటులోకి వస్తాయన్నది అసలు ప్రశ్నలు.

సాలిడ్‌ స్టేట్‌ బ్యాటరీలంటే..

ఇప్పటిదాకా వినియోగిస్తున్న లిథియం అయాన్‌ బ్యాటరీల్లో ద్రవరూప ఎలక్ట్రోలైట్‌ను వినియోగిస్తున్నాయి. వాటి స్థానంలో ఘనరూపంలో అయాన్‌-కండక్టింగ్‌ మెటీరియల్‌ను వాడి తయారు చేసేవే సాలిడ్‌ స్టేట్‌ బ్యాటరీలు.

ఏమిటి ఉపయోగం..

ద్రవరూప బ్యాటరీలతో పోలిస్తే వీటిలో ఎక్కువ విద్యుత్‌ను నిల్వ ఉంచవచ్చు. అపుడు బ్యాటరీ పరిమాణాన్ని తగ్గించుకోవచ్చు. దాంతో కారు బరువు తగ్గి మైలేజీ ఎక్కువ ఇస్తుంది. కారులో స్థలం కూడా పెరుగుతుంది. లేదంటే అదే పరిమాణంతో ఎక్కువ దూరం వెళ్లే మోడళ్లను సిద్ధం చేసుకోవచ్చు. అన్నిటికీ మించి కిలోవాట్‌ అవర్‌కు అయ్యే ఖర్చు తగ్గుతుంది. తాజాగా ఫోర్డ్, బీఎమ్‌డబ్ల్యూ వంటి కంపెనీలు ‘సాలిడ్‌ పవర్‌’ కంపెనీలో పెట్టుబడులు పెట్టింది ఈ బ్యాటరీలను పొందడానికే.

సాలిడ్‌ పవర్‌ కంపెనీయే ఎందుకు?

మల్టీ లేయర్‌ సెల్‌ వరకు (20 యాంప్‌-అవర్‌) తమ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి సాలిడ్‌ పవర్‌ సిద్ధంగా ఉంది. వాహనాల్లో వినియోగించడానికి ఇది ఉపయోగపడుతుంది. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ఫోర్డ్‌తో పాటు బీఎమ్‌డబ్ల్యూకు సైతం 100 యాంప్‌-అవర్‌ బ్యాటరీలను ఇవ్వడానికి యత్నాలు చేస్తోంది. అదీకాక సరికొత్త సాంకేతికతపై కొత్తగా పెట్టుబడులు పెట్టనవసరం లేకుండా సాలిడ్‌ పవర్‌ కంపెనీలో పెట్టుబడులు పెడుతున్నాయి.

ఎప్పటికి రావొచ్చు

ఈ దశాబ్దం చివరకు సాలిడ్‌ స్టేట్‌ బ్యాటరీలతో ఈవీలు సిద్ధం కావొచ్చని ఫోర్డ్‌ అంటోంది. ప్రస్తుత ఈవీలతో పోలిస్తే ఈ సాలిడ్‌ బ్యాటరీల్లో 25-30 శాతం వరకు ఇంధన సాంద్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరింత దూరం వెళ్లడానికి వినియోగపడుతుంది. ఉదాహరణకు ఇపుడున్న ముస్తాంగ్‌ మాక్‌-ఇ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ ప్రస్తుత ప్యాకేజీతో 300 మైళ్లు ప్రయాణిస్తుందనుకుంటే.. సాలిడ్‌ స్టేట్‌ బ్యాటరీతో 400 మైళ్లు ప్రయాణించవచ్చు. లేదంటే బ్యాటరీల సంఖ్యను తగ్గించుకుని ధరను తగ్గించుకోవచ్చు.

రూ.3,500 నుంచీ ఛార్జింగ్‌ యూనిట్‌!విద్యుత్తు వాహనాల ఛార్జింగ్‌కు భారత ప్రమాణాలు త్వరలో

విద్యుత్‌ వాహనాలకు ఏసీ ఛార్జింగ్‌ పాయింట్లను చౌకగా రూపొందించేందుకు సంబంధించి భారత ప్రమాణాలను (ఇండియన్‌ స్టాండర్డ్స్‌) రెండు నెలల్లోగా విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కనిష్ఠంగా రూ.3,500 ధర నుంచి ఛార్జింగ్‌ యూనిట్‌లను అందుబాటులోకి తేవాలన్నది లక్ష్యమని పేర్కొంది. బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) వీటిని అధికారికంగా విడుదల చేస్తుందని తెలిపింది. ఇప్పటికే భారత ప్రమాణాల ముసాయిదాను విద్యుత్‌ వాహనాల ప్రమాణాలపై ఏర్పాటైన బీఐఎస్‌ కమిటీ పరిశీలిస్తోందని వెల్లడించింది. ప్రయోగాత్మక ఉత్పత్తులపై క్షేత్ర స్థాయిలో, మన్నిక సామర్థ్యం పరీక్షలు పూర్తయ్యాక రెండు నెలల్లో ప్రమాణాలు విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటన వెల్లడించింది.

విద్యుత్‌ వాహనాల కోసం తక్కువ వ్యయంతో కూడిన ఛార్జింగ్‌ మౌలిక వసతులు కల్పించే కొత్త పరిశ్రమ రంగం అవతరించనుందని తెలిపింది. చౌక ఛార్జింగ్‌ యూనిట్లను అందుబాటులోకి తేవడాన్ని నీతి ఆయోగ్‌ సహకారంతో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీస్, ఆఫీస్‌ ఆఫ్‌ ద ప్రిన్సిపల్‌ సైంటిఫిక్‌ అడ్వయిజర్‌లు ఓ సవాలుగా తీసుకున్నాయని వివరించింది. స్మార్ట్‌ఫోన్‌తో పనిచేసే స్మార్ట్‌ ఏసీ ఛార్జింగ్‌ పాయింట్‌ను రూ.3500 (50 డాలర్లు) ధర లోపే తేవాలని ఈ బృందం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపింది. ఇప్పటికే ఇంత తక్కువ ధరతో భారత ప్రమాణాలకు అనుగుణంగా ఛార్జింగ్‌ పాయింట్ల తయారీకి పలు దేశీయ సంస్థలు సిద్ధమయ్యాయని వివరించింది.

ద్వి, తిచక్ర విద్యుత్‌ వాహనాలకు ప్రస్తుతం ఛార్జింగ్‌ స్టేషన్లు రూ.10,000 ధర నుంచి అందుబాటులో ఉన్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ-స్కూటర్లు, ఈ-ఆటో రిక్షాలను ఛార్జ్‌ చేసేందుకు ఈ చౌక ఛార్జింగ్‌ పాయింట్లు 3కేవీ విద్యుత్‌ను ఉపయోగించుకుంటాయి. 220వీ 15ఏ సింగిల్‌ ఫేజ్‌ విద్యుత్‌ లైన్‌ ఉన్న ఏ ప్రాంతంలోనైనా ఈ పాయింట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. మెట్రో, రైల్వే స్టేషన్ల పార్కింగ్‌ ప్రదేశాల్లోను, షాపింగ్‌ మాల్స్, ఆసుపత్రుల్లో, ఆఫీస్‌ కాంప్లెక్స్, అపార్ట్‌మెంట్లతో పాటు కిరాణా, ఇతరత్రా దుకాణాల వద్ద కూడా వీటిని సులభంగా ఏర్పాటు చేసుకోవచ్చని అధికారిక ప్రకటన వెల్లడించింది. స్మార్ట్‌ఫోన్‌లోని బ్లూటూత్‌ ద్వారా ఈ చౌక స్మార్ట్‌ ఏసీ ఛార్జింగ్‌ పాయింట్లను నిర్వహించవచ్చని తెలిపింది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details