భారత ప్రభుత్వం 59 చైనా యాప్‌లపై నిషేధం విధించాక.. కీలక ప్రకటన చేసింది టిక్‌టాక్ యాజమాన్యం. భారత్‌లో పనిచేస్తున్న తమ సంస్థ ఉద్యోగులకు అండగా ఉంటామని భరోసా నిచ్చింది. ఉద్యోగాల తొలగింపు, జీతాల్లో కోతలు ఉండవని స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం సంస్థ ఉన్నతాధికారులు, టిక్‌టాక్ భారత హెడ్ నిఖిల్ గాంధీ, హలో హెడ్ రోషన్ మిశ్రాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు యాప్ సీఈఓ కెవిన్ మేయర్. అనంతరం 2వేల మంది ఉద్యోగులకు సందేశాలు పెట్టినట్లు తెలుస్తోంది.
భవిష్యత్తులో మరింతగా...
టిక్‌టాక్ పేరెంట్ సంస్థ బైట్‌డ్యాన్స్ భవిష్యత్తులో భారత్‌లో మరింతగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు కెవిన్ పేర్కొన్నారు. డిజిటల్ ఇండియాలో తమ వంతు పాత్ర పోషిస్తామని తెలిపారు. ఇప్పటికే నిషేధం విషయంలో కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు స్పష్టం చేశారు. గతంలోనూ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొని సమర్థవంతంగా, మరింత బలంగా అభివృద్ధి చెందామని కెవిన్ ఉద్యోగులకు తెలిపారు. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.