ఆన్‌లైన్ తరగతులు నడుస్తున్నాయ్... మరి పరీక్షలూ.. అవికూడా ఆన్‌లైన్‌లో పెట్టేస్తే సరి అనుకుంటున్నారా..ఇన్విజిలేటర్ లేకుండా, ఇబ్బంది పడకుండా విద్యార్థులతో పరీక్షలు ఎలా రాయించాలి అంటే.. హైర్‌మీ సంస్థ కృత్రిమ మేధ-యంత్ర అభ్యాసం(ఏఐ-ఎమ్‌ఎల్) ఆధారంగా ప్రొఎక్స్ మొబైల్ యాప్‌తో ముందుకు వచ్చింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 25 సంస్థలు, 100కు పైగా కార్పొరేట్ క్లయింట్లతో కలిసి పనిచేస్తున్నట్లు ఈ సంస్థ వ్యవస్థాపకుడు చాకో వల్లియప్ప 'ఈనాడు'తో చెప్పారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ..
హైర్‌మీ ప్రొఎక్స్ మొబైల్ యాప్ ప్రత్యేకతలేమిటి ?
కొవిడ్ నేపథ్యంలో ఆన్‌లైన్ తరగతులు నడుస్తున్నాయి. ఇక పరీక్షలూ ఇలానే జరిగేందుకు వీలుంది. చాలా చోట్ల ఇంటర్నెట్ వేగం తక్కువగా ఉంటుంది. అత్యాధునిక స్మార్ట్‌ఫోన్లూ అందరి దగ్గరా ఉండవు. అందుకే 2జీ ఇంటర్నెట్ వేగంతో పనిచేసేలా మా యాప్‌ను తీర్చిదిద్దాం. బేసిక్ స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్ అయినా ఈ యాప్‌నకు సరిపోతుంది. ఒక్కో పరీక్షకు 50 ఎమ్‌బీలోపు డేటా ఖర్చవుతుంది. పాఠశాల విద్యార్థులు కూడా సులువుగా ఆపరేట్ చేసేలా రూపొందించాం. అభ్యర్థి ఈ యాప్‌ను మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని లేదా ఏదైనా బ్రౌజర్‌లో ఓపెన్ చేసుకుని పరీక్ష రాయొచ్చు.
విద్యార్థులు కాపీ కొట్టకుండా చూడొచ్చా ?
ఈ యాప్ ఉన్న పరికరంలోని వెబ్‌కామ్ ద్వారా అభ్యర్థులను పరిశీలించవచ్చు. ఫేస్ డిటెక్షన్, ఫేస్ రికగ్నిషన్, ఆబ్జెక్ట్ డిటెక్షన్ ద్వారా అభ్యర్థులు కాపీ కొట్టేందుకు ప్రయత్నిస్తే సులువుగా కనిపెట్టేయవచ్చు. ఎవరి ముఖం కనిపించకపోయినా.. పరీక్ష సమయంలో ముఖం మారినా కూడా అప్పటికప్పుడు నిర్వాహకులను అలర్ట్ ఇస్తుంది. పరీక్ష సమయం ముగియగానే, నివేదికను టైమ్ లాప్స్ వీడియోతో పాటు కళాశాలలకు పంపుతుంది. ఇలా మాల్‌ప్రాక్టీస్ నివారించవచ్చు.
ఇప్పటిదాకా ఎన్ని పరీక్షలు నిర్వహించారు. ఎన్ని సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు ?
హైర్‌మీ స్థాపించి మూడేళ్లయింది. ఇప్పటిదాకా 10 లక్షల మందికి పరీక్షలను నిర్వహించాం. దేశవ్యాప్తంగా 25 విద్యాసంస్థలతో, 100కు పైగా కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాం. తరగతుల్లో విద్యార్థులకు, కంపెనీల్లో చేరేందుకు ఎంపికలకు హాజరయ్యే వారికీ పరీక్షలు చేపడుతున్నాం. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎన్‌ఎస్‌డీసీ) హైర్‌మీని 'గుర్తింపు పొందిన అసెస్‌మెంట్ ఏజెన్సీ'గా గుర్తించింది.