తెలంగాణ

telangana

ETV Bharat / business

బంపర్ ఆఫర్​: పాత బంగారానికి... కొత్త ఆభరణాలు

దీపాల పండుగ దీపావళి ముందుగా వచ్చే ధన త్రయోదశి నాడు బంగారం, వెండి వంటి విలువైన లోహాలు కొనుగోలు చేసి, లక్ష్మీదేవిని పూజించే ఉత్తరాది సంప్రదాయం తెలుగు రాష్ట్రాల్లోనూ పెరిగింది. ఈసారి బంగారం ధర బాగా పెరగడంతో, లక్ష్మీదేవి పూజకు ఎక్కువమంది పరిమితం అవుతారని, పసిడి కొనుగోలుకు ముందుకు రాకపోవచ్చని విక్రేతలు భావిస్తున్నారు. అందుకే కొనుగోలుదార్లను ఆకర్షించి, అమ్మకాలు పెంచుకునేందుకు తరుగు, మజూరీ ఛార్జీలలో రాయితీలు, పాత ఆభరణాల మార్పిడికి ప్రోత్సాహకాలతో పాటు ఉచిత బహుమతులను కూడా ఆఫర్‌ చేస్తున్నారు.

By

Published : Oct 25, 2019, 7:46 AM IST

బంపర్ ఆఫర్​: పాత బంగారానికి... కొత్త ఆభరణాలు

దీపావళి పండుగకు ఉత్తరాది వారి కంపెనీలు, వాణిజ్య సంస్థల్లో బోనస్‌లు ఇస్తుంటారు కనుక, పసిడి కొనుగోళ్లకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. గతేడాది దీపావళి సమయానికి గ్రాము మేలిమి (999 స్వచ్ఛత) బంగారం ధర రూ.3,200-3,300 ఉండగా, ఇప్పుడు రూ.3900 పైన ఉంది. గతేడాది ఈ పండుగకు కొనుగోలు చేసిన వారి ఆభరణాల విలువ పెరగడంతో, వారంతా సంతోషిస్తుంటారు. ఈసారీ కొనుగోలు చేస్తే మరింత లాభపడతామా అనే భావనలోనూ ఉంటారు. అయితే ధర మరీ ఎక్కువగా ఉండటం, ఆర్థిక మందగమన ప్రభావంతో పసిడి కళకళ లాడకపోవచ్చని విక్రేతలు భావిస్తున్నారు. సాధారణంగా ఏవైనా గృహోపకరణాలు కొనుగోలు చేసినపుడు బంగారు నాణెం ఇస్తుంటారు. ఈసారి పసిడి ఆభరణాలు కొనుగోలు చేసిన వారికి ఎలక్ట్రానిక్‌ ఉపకకరణాలు పొందే వీలు కల్పిస్తున్నాయి.

పాత ఆభరణాల మార్పిడిలో..

పాత బంగారం తెచ్చి, అదే బరువుకు సమానమైన కొత్త ఆభరణాలు తీసుకెళ్లండి అంటూ విక్రయసంస్థలు ఊరిస్తున్నాయి. ఎందుకూ అంటే, నగదుకు బదులుగానే పాత బంగారం తీసుకుంటున్నారు కదా. అందువల్ల వారికి ఆ విషయంలో వచ్చే తేడా ఉండదు. కొత్త బంగారం కొనాల్సిన అవసరమూ వారికి రాదు. మరి పాత ఆభరణం తీసుకుని, కొత్తవి ఇస్తే.. వ్యాపారులకు ఒరిగేది ఏముంటుంది అనే సందేహం వస్తుంది. తరుగు, మజూరి ఛార్జీల రూపంలో వారికి ఆదాయం వస్తుంది. ఇది ఎలా అంటే..ఇంట్లో ఉన్న ఆభరణాన్ని విక్రయశాలకు తీసుకెళ్తే, నాణ్యత నిర్థారణ పరీక్ష చేస్తారు. ఆ బంగారం కచ్చితంగా 916 స్వచ్ఛత (22క్యారెట్లు)తో ఉండే, గ్రాముల బరువుకు అనుగుణంగా విలువ నమోదు చేస్తారు. అంతే బరువుకు సమానమైన కొత్త ఆభరణం తీసుకెళ్లొచ్చు అని సంబర పడిపోవద్దు. కొత్త ఆభరణానికి తరుగు (వేస్టేజీ), మజూరీ ఛార్జీలు లేదా ఈ రెండూ కలిపి జతచేరిన విలువ (వీఏ) కింద అదనంగా చూపుతారు. తరుగు కింద ఆభరణం డిజైన్‌కు అనుగుణంగా 4-30 శాతం వరకు కూడా ఉంటోంది. కంటికి ఇంపుగా కనిపించే అత్యధిక ఆభరణాలకు 18-28 శాతం తరుగు కింద వేస్తున్నారు. ఉదాహరణకు 40 గ్రాముల ఆభరణం కొత్తది తీసుకోవాలంటే 18-28 శాతం తరుగు కింద అయితే 7.2-11.2 గ్రాముల విలువకు సమానమైన మొత్తాన్ని అదనంగా చెల్లించాల్సి వస్తుంది. కనీసం 10-12 శాతం తరుగు తీసుకున్నా 4-4.8 గ్రాముల బంగారం విలువకు సమాన మొత్తాన్ని చెల్లించాలి. ఆభరణాల (22 క్యారెట్లు) బంగారం గ్రాము రూ.3600పైన ఉంది. అంటే 40 గ్రాముల ఆభరణానికి 10-12 శాతం తరుగు అనుకుంటే అదనంగా రూ.14,400-17,280 చెల్లించాలి. 18-28 శాతం తరుగు అయితే ఇది రూ.26,000-40,000 దాకా చెల్లించాల్సి రావచ్చు.

పేటీఎం వంటి యాప్‌లతో చెల్లిస్తే, నగదు వెనక్కి సదుపాయాలుంటే, ఉపయోగించుకోవచ్చు.

  • మనం కొనుగోలు చేసే ఆభరణంలో బంగారం, ఇతర విలువైన రాళ్ల వంటి బరువు వేర్వేరుగా లెక్కించారో, లేదో తెలుసుకోవాలి.
  • ఆభరణం స్వచ్ఛతను క్యారెట్‌ మీటర్‌తో పరీక్షించుకునేందుకు మొహమాట పడొద్దు.
  • తరుగు, మజూరీలో ఇస్తున్న ఆఫర్లను పరిశీలించి కొనుగోలు చేయండి.
  • పసిడి బాండ్లతో పాటు డిజిటల్‌ రూపంలో పెట్టుబడులపై పేటీఎం, మొబిక్విక్‌ వంటి సంస్థలు గ్రాముకు కొంతమొత్తం ఆఫర్‌ చేస్తున్నాయి.

ఇదీ చూడండి:పడిలేచిన 'మహా' కెరటం పవార్‌!

ABOUT THE AUTHOR

...view details