భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉండడంతో పాటు.. మంచి వృద్ధిని నమోదు చేయగల సత్తా ఉండడంతో విదేశీ మదుపర్లు మన స్టాక్ మార్కెట్లలోకి వస్తున్నారు. డబ్బులు కుమ్మరిస్తున్నారు. అయితే 2024 కల్లా ఈ అదనపు ద్రవ్యలభ్యత మళ్లీ వెనక్కి వెళ్లిపోవచ్చని ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ అంచనా వేస్తున్నారు. ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
2024 దరిదాపుల్లో క్రమంగా విదేశీ పెట్టుబడిదారులు.. తమ పెట్టుబడులను వెనక్కి తీసుకెళ్లవచ్చని, ఈ నేపథ్యంలో మదుపర్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
''వచ్చే దశాబ్ద కాలంలో భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మారొచ్చు. ఈ అంచనాలే విదేశీ మదుపర్లను మన మార్కెట్ల వైపు మళ్లేలా చేస్తున్నాయి. అయితే 2024లో ఈ ధోరణిలో మార్పు రావొచ్చు. స్టాక్ మార్కెట్లు ఎపుడూ భవిష్యత్ వృద్ధినే చూపిస్తాయి. విదేశీ మదుపర్లు ఇతర దేశాల్లో ప్రతిఫలాలు పొందలేక మనదగ్గరకు వస్తున్నారు. అంతర్జాతీయ వృద్ధితో పోలిస్తే మన దగ్గర కనీసం 6-7 శాతం వృద్ధి రేటు పదేళ్ల పాటు కొనసాగొచ్చు. అందుకే మదుపర్లు అవకాశాల కోసం ఇక్కడకొస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న సంస్కరణలు వారికి ఆ నమ్మకాన్ని ఇస్తున్నాయి. కరోనాను అదుపులో ఉంచే విషయంలోనూ వారు భారత్‌ను గట్టిగా నమ్ముతున్నారు. ఇవన్నీ కలిసి మన మార్కెట్లను ఆల్‌టైం గరిష్ఠాలకు చేర్చాయి. అయితే ఈ ధోరణి దీర్ఘకాలం పాటు కొనసాగకపోవచ్చు. 2024 దరిదాపుల్లో క్రమంగా వాళ్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకెళ్లవచ్చు. ఈ నేపథ్యంలో మదుపర్లు జాగ్రత్తగా ఉండాలి.''
- కృష్ణమూర్తి సుబ్రమణియన్, ముఖ్య ఆర్థిక సలహాదారు
ఇదీ చూడండి:ఆర్థిక సర్వే 2020-21 హైలైట్స్