కుటుంబ సమేతంగా లండన్ వెళ్లాలని నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం తనపై ఉన్న ఒత్తిడేనని తెలిపారు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా. కరోనా రెండో దశ విజృంభణ కొనసాగుతున్న తరుణంలో.. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ డిమాండ్‌ను తీర్చే భారమంతా తనపైనే పడుతోందని చెప్పారు. ఈ మేరకు 'ది టైమ్స్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.
"నేను ఇక్కడే(లండన్) మరికొంతకాలంపాటు ఉండాలని అనుకుంటున్నాను. భారం అంతా నా ఒక్కడి భుజాలపైనే పడుతోంది. కానీ, ఒంటరిగా నేనేమీ చేయలేను. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ పొందాలని ఉంటుంది. దానికోసం ఎంతో నిరీక్షించాల్సి వస్తుంది. కానీ, తమ కంటే ముుందు వేరేవారు వ్యాక్సిన్ ఎందుకు పొందాలి అనేది వారు అర్థం చేసుకోలేరు."
-అదర్ పూనావాలా, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ