కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులకు ప్రయోజనం కలిగే విధంగా ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్ఐసీ) నిర్ణయం తీసుకుంది. మార్చి 24 నుంచి డిసెంబర్ 31 వరకు ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులకు మూడు నెలల సగటు వేతనాలలో 50 శాతం చెల్లించేందుకు నిబంధనలు సడలించింది. ఈ నిర్ణయం వల్ల 40 లక్షల మంది కార్మికులకు ప్రయోజనం కలగనుంది.
మరోవైపు, 'అటల్ బిమిత్ వ్యక్తి కల్యాణ్ యోజన' పథకం కింద ప్రయోజనాలు పొందేందుకు కావాల్సిన అర్హతలను సడలించింది. నిరుద్యోగ భృతిని పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జూన్ 31వరకు పథకం అందుబాటులో ఉంటుందని ఈఎస్ఐసీ స్పష్టం చేసింది. 2021 జనవరి 1నుంచి ఇదివరకటి నిబంధనలతో కొనసాగుతుందని వెల్లడించింది. నిబంధనల సడలింపుపై పరిస్థితులను బట్టి డిసెంబర్ 31 తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది.
30 రోజులకే..
భృతి పొందేందుకు కావాల్సిన అర్హత ప్రమాణాలను సడలించింది ఈఎస్ఐసీ. ఉద్యోగం కోల్పోయిన కార్మికులకు ఇదివరకు మూడు నెలల సగటు వేతనంలో 25 శాతం చెల్లిస్తుండగా... ప్రస్తుతం ఈ పరిమితిని 50 శాతానికి పెంచింది. ఇదివరకు.. ఉద్యోగం కోల్పోయిన 90 రోజుల తర్వాత భృతి అందజేస్తుండగా.. దాన్ని 30 రోజులకు తగ్గించింది.