ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా డిజిటల్ మోసాలే. ఆన్‌లైన్‌లో నగదు తస్కరించారని, క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే డబ్బు పోయిందని, డెబిట్/ క్రెడిట్ కార్డును క్లోనింగ్ చేసి ఖాతా ఖాళీ చేశారని.. ఇలా పలు రకాలైన మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక పక్క ఆర్‌బీఐ మరోపక్క బ్యాంకులు తమ ఖాతాదార్లను ఎంతగా అప్రమత్తం చేస్తున్నా.. ఏదో ఒక మార్గంలో వినియోగదార్లను సైబర్ నేరస్తులు మోసం చేస్తున్నారు. కొవిడ్-19 మహమ్మారి వల్ల డిజిటల్ లావాదేవీలు బాగా పెరగడం కూడా మోసగాళ్లకు కలిసివస్తోంది. డిజిటల్ మోసాలు జరుగుతున్న తీరు, బదులుగా ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి.. తమ వైపు నుంచి తీసుకుంటున్న చర్యలు ఏమిటి? అనే అంశాలను ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఎండీ, సీఈఓ అనుబ్రత బిశ్వాస్ 'ఈనాడు'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. ఆ విశేషాలు..
డిజిటల్ మోసాలు ఇటీవల కాలంలో బాగా పెరిగిపోతున్నాయి. వీటికి కళ్లెం వేసేదెట్లా
దేశంలో 'డిజిటల్ ఎకానమీ' ని ఆవిష్కరించటంలో భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) ఎంతో క్రియాశీలకమైన పాత్ర పోషిస్తోంది. అందులోనూ మోసాలను అరికట్టటానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఎప్పటికప్పుడు వినియోగదార్లను అప్రమత్తం చేయటంతో పాటు టెక్నాలజీ పరంగా చేయగలిగిందంతా చేస్తోంది. కొవిడ్-19 మహమ్మారి వల్ల డిజిటల్ లావాదేవీలు అనూహ్యంగా పెరిగాయి. ఇటీవల కాలంలో మోసాలు పెరగటానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం. కొత్త కొత్త పద్ధతుల్లో ప్రజలను మభ్యపెట్టి మోసం చేయటానికి ఎంతోమంది ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల ప్రజల్లో భయం ఏర్పడింది. ఈ మధ్య ఒక సర్వే వచ్చింది. దేశంలోని ప్రధాన నగరాల్లోని ప్రజల్లో 47% మంది డిజిటల్ మోసాలపై హడలిపోతున్నారని ఈ సర్వేలో స్పష్టమైంది. ఈ పరిస్థితుల్లో వినియోగదార్లు జాగ్రత్తగా ఉండాలి. భద్రమైన రీతిలో లావాదేవీలు నిర్వహించాలి. తద్వారా మోసాల నుంచి తప్పించుకోవచ్చు.
ఖాతాదార్లు ఏవిధంగా డిజిటల్ మోసాలకు గురవుతున్నారు..
ఫిషింగ్, లాగిన్ క్రెడెన్షియల్స్- పాస్‌వర్డ్‌లు దొంగిలించటం, ఫోన్ క్లోనింగ్... వంటి మార్గాల్లో డిజిటల్ మోసాలు జరుగుతున్నాయి. వినియోగదార్లను మాటల్లో పెట్టి, ఏదో జరిగిపోతోందని భయపెట్టి లేదా ఏదో ఒక ఆశ చూపి కీలకమైన సమాచారాన్ని మోసగాళ్లు తస్కరిస్తారు. ఓటీపీ వంటి ముఖ్యమైన వివరాలు లాగేసుకుంటారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయటం ద్వారా మోసగించే పద్ధతులను మోసగాళ్లు ఇటీవల అనుసరిస్తున్నారు.
ఇటువంటి మోసాలను నివారించటం ఎలా