కరోనా కారణంగా అందరి ఆదాయాలపై తీవ్రంగా ప్రభావం పడింది. ఇలాంటి పరిస్థితుల్లో వేతన జీవులు.. ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించుకునేందుకు ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్) నుంచి భారీగా నగదు ఉపసంహరించుకుంటున్నారు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్-జులై మధ్య 80 లక్షల మంది ఉద్యోగులు రూ.30 వేల కోట్ల నగదు విత్‌డ్రా చేసుకున్నారు.
కరోనా విత్‌డ్రాలు తక్కువే..
కరోనా నేపథ్యంలో తీసుకొచ్చిన కొవిడ్ విండో ద్వారా 30 లక్షల మంది ఈపీఎఫ్ చందాదారులు రూ.8,000 కోట్లు విత్‌డ్రా చేసుకున్నారు. అంతకంటే ఎక్కువగా మెడికల్ అడ్వాన్స్ కింద 50 లక్షల మంది ఈపీఎఫ్ చందాదారులు రూ.22,000 కోట్లు తమ భవిష్యనిధి నుంచి విత్‌డ్రా చేసుకున్నట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది.
కరోనా నేపథ్యంలో ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈపీఎఫ్ నుంచి నగదు తీసుకునేందుకు ఏప్రిల్‌లో ప్రత్యేక విండోను ఏర్పాటు చేశారు.