డిసెంబరులో ఈపీఎఫ్‌ఓ పేరోల్‌లో కొత్తగా 12.54 లక్షల మంది నికర చందాదారులు చేరారు. వీరిలో 8.04 లక్షల మంది కొత్తవారు కాగా.. 4.5 లక్షల మంది ఈపీఎఫ్‌ఓ నుంచి వైదొలిగి తిరిగి చేరినవారు. 2019 డిసెంబరుతో పోలిస్తే సంఘటిత రంగంలో 24 శాతం వృద్ధి నమోదైంది. ఇక నవంబరుతో పోలిస్తే 44 శాతం చేరికలు పెరిగాయి. కొవిడ్-19 మహమ్మారి ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2020 ఏప్రిల్ నుంచి డిసెంబరు) 53.70 లక్షల మంది నికర చందాదారులు ఈపీఎఫ్‌ఓలో చేరారు. రెండో త్రైమాసికంతో పోలిస్తే మూడో త్రైమాసికం చేరికల్లో 22 శాతం వృద్ధి నమోదైనట్లు కేంద్ర కార్మిక శాఖ శనివారం సాయంత్రం వెల్లడించింది.
వయస్సుల వారీ విశ్లేషణ ప్రకారం.. డిసెంబరు 2020లో 22-25 మధ్య వయస్సు గల కొత్త చందాదారుల సంఖ్య నికరంగా 3.36 లక్షలుగా, 18-21 వయస్సు కేటగిరీలో 2.81 లక్షలుగా నమోదైంది. మొత్తం కొత్త చందాదారుల్లో 18-25 వయస్సు గల వారే 49.19 శాతం ఉండడం గమనార్హం. ఈ వర్గాన్ని కొత్తగా ఉద్యోగ జీవితంలోకి అడుగుపెడుతున్న వారిగా పరిగణించవచ్చు.