EPFO New Pension Sceme: నెలకు రూ.15,000 కంటే ఎక్కువ మూల వేతనం(బేసిక్ శాలరీ) కలిగిన సంఘటిత కార్మికుల కోసం ఓ కొత్త పథకాన్ని తీసుకురానుంది ఈపీఎఫ్‌ఓ (రిటైర్‌మెంట్ ఫండ్ విభాగం). పెన్షన్ స్కీం-1995 పరిధిలోకి తప్పనిసరిగా చేరని ఉద్యోగులను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి 11,12 తేదీల్లో గువాహటిలో జరిగే ఈపీఎఫ్ఓ ఉన్నతస్థాయి కమిటీ 'సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్' నిర్వహించే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఈపీఎఫ్ఓలో అధికంగా జమ చేసే ఉద్యోగులకు ఎక్కువ పెన్షన్ రావాలనే డిమాండ్లు గత కొంతకాలం నుంచి ఉన్నాయి. 15 వేలకన్నా ఎక్కువ జీతం ఉన్నప్పటికీ దానిపై 8.33 శాతం మాత్రమే ఈపీఎఫ్ఓ కింద జమచేసే అవకాశం ఉంది. దీనివల్ల తక్కువ పెన్షన్ వస్తుంది. ఈ వ్యవస్థనే ప్రస్తుతం మార్చనున్నారని సమాచారం. ప్రస్తుతం 15 వేల వరకు ప్రాథమిక వేతనం కలిగిన ఉద్యోగులందరూ తప్పనిసరిగా ఈపీఎఫ్ఓలో జమ చేయాల్సి ఉంది.