మీరు ఉద్యోగులా? మీకు మీ సంస్థ ఉద్యోగుల భవిష్య నిధి(పీఎఫ్) ప్రయోజనాలు కల్పిస్తోందా? అయితే, మీకు ఓ ముఖ్య గమనిక! ఈ నెలాఖరు కల్లా మీరు మీ ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ సార్వత్రిక ఖాతా సంఖ్య(యూఏఎన్)ను ఆధార్‌తో అనుసంధానించాల్సి (link aadhaar to pf number) ఉంటుంది. లేదంటే.. 'ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్ (ఈసీఆర్)' భర్తీ కాదు. అంటే మీ పీఎఫ్ ఖాతాల్లో వచ్చే నెల నుంచి కంపెనీ వాటా జమ కాదు. వెంటనే ఉద్యోగుల యూఏఎన్‌ను ఆధార్‌తో అనుసంధానించాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ) యాజమాన్యాలకు సైతం తెలియజేసింది. ఇంతకు ముందు యూఏఎన్-ఆధార్ అనుసంధానానికి 31 ఆగస్టు 2021 తుది గడువుగా విధించారు. అనంతరం దాన్ని 2021 నవంబరు 30 వరకు పొడిగించారు.
ఆధార్ అనుసంధానం జరగకపోతే.. పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవడంలోనూ ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే కొవిడ్-19 నేపథ్యంలో ప్రభుత్వం అందించే ప్రయోజనాలకు కూడా దూరమవుతారు. బీమా ప్రయోజనాలు సైతం అందవు.