తెలంగాణ

telangana

ETV Bharat / business

డిమాండ్ దృష్ట్యా కొవాగ్జిన్‌ తయారీ పెంపు! - భారత్​ బయోటెక్​

దేశంలో కొవిడ్​ కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో టీకాలకు గిరాకీ బాగా పెరిగింది. దుష్ప్రభావాలు తక్కువగా ఉన్నాయని చెబుతున్న కొవాగ్జిన్​ అడుగుతున్న వారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొవాగ్జిన్​ టీకా తయారీని సాధ్యమైనంత పెంచడానికి భారత్​ బయోటెక్​ కసరత్తు చేస్తోంది. త్వరలో భారత్‌ బయోటెక్‌ బెంగళూరు యూనిట్‌ ప్రారంభించనుంది.

Bharat biotech
భారత్​ బయోటెక్​

By

Published : Apr 9, 2021, 6:27 AM IST

కొవిడ్‌ కేసులు మళ్లీ పెరుగుతుండటంతో, టీకాలకు గిరాకీ బాగా పెరిగింది. కొవిడ్‌ యోధులు మినహా మిగిలిన వారిలో 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సున్న వారికి మాత్రమే ఈ టీకాలు వేస్తున్నారు. సైడ్‌ ఎఫెక్టులు తక్కువగా ఉన్నాయని చెబుతున్న కొవాగ్జిన్‌ టీకాను అడుగుతున్న వారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతోందని ఆసుపత్రుల నుంచి వస్తున్న సమాచారం. ఈ నేపథ్యంలోనే 'కొవాగ్జిన్‌' టీకా తయారీని సాధ్యమైనంత త్వరగా పెంచడానికి భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ కసరత్తు చేస్తోంది. సొంతంగా తన ప్లాంట్లలో ఉత్పత్తి పెంచడంతో పాటు, ఇతర కంపెనీల ప్లాంట్లలోనూ ఈ టీకా తయారు చేయించే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. రష్యాకు చెందిన ఆర్‌డీఐఎఫ్‌ ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు 'స్పుత్నిక్‌ వి' టీకా సరఫరా చేయడానికి మనదేశంలోని ఫార్మా/ బయోటెక్‌ కంపెనీలతో తయారీ ఒప్పందాలు కుదుర్చుకుంటున్న విషయం తెలిసిందే. ఇదేవిధంగా భారత్‌ బయోటెక్‌ కూడా 'కొవాగ్జిన్‌' టీకా ఉత్పత్తి పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా దిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న పానేషియా బయోటెక్‌ అనే దేశీయ కంపెనీతో చర్చిస్తున్నట్లు తెలిసింది. ఈ రెండు సంస్థల మధ్య అవగాహన కుదిరిన పక్షంలో 'కొవాగ్జిన్‌' టీకాను భారత్‌ బయోటెక్‌తో పాటు, పానేషియా బయోటెక్‌ కూడా తయారు చేస్తుంది. తద్వారా 'కొవాగ్జిన్‌' టీకా లభ్యత పెరిగే అవకాశం ఏర్పడుతుంది.

ఏడాదికి 70 కోట్ల డోసుల సామర్థ్యం..

ప్రస్తుతం కొవాగ్జిన్‌ టీకాను భారత్‌ బయోటెక్‌ హైదరాబాద్‌ జీనోమ్‌ వ్యాలీలోని తన ప్లాంట్లో తయారు చేస్తోంది. టీకా తయారీకి ఇక్కడ బీఎస్‌ఎల్‌-3 ప్రమాణాలు కల 2 యూనిట్లు భారత్‌ బయోటెక్‌కు ఉన్నాయి. దీంతో పాటు బెంగుళూరులో మరొక యూనిట్‌ను కూడా కంపెనీ సిద్ధం చేస్తోంది. అక్కడా కొవాగ్జిన్‌ తయారీ ప్రారంభమైతే, సొంతంగా ఏడాదికి 70 కోట్ల డోసుల టీకాను సంస్థ సరఫరా చేయగలుగుతుందని తెలుస్తోంది. అయితే దేశీయ విపణితో పాటు ఇతర దేశాల నుంచీ టీకా కోసం ఉన్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని, తయారీని ఇంకా పెంచాలని భారత్‌ బయోటెక్‌ భావిస్తోంది. ఇందులో భాగంగా ఇతర కంపెనీలతో తయారీ ఒప్పందాలు కుదుర్చుకునే ఆలోచన చేస్తున్నట్లు భావిస్తున్నారు. పానేషియా బయోటెక్‌తో ఇటువంటి ఒప్పందమే కుదిరే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. పానేషియా బయోటెక్‌కు బీఎస్‌ఎల్‌-3 ప్రమాణాలు గల తయారీ ప్లాంటు ఉంది. అందువల్ల 'కొవాగ్జిన్‌' తయారీకి ఇబ్బందులు ఉండవని, తగిన భద్రతా చర్యలతో టీకా తయారీ చేపట్టే అవకాశం ఉందని అంటున్నారు.

'కొవాగ్జిన్‌' కు మెక్సికో అనుమతి

కొవాగ్జిన్‌కు మెక్సికో అత్యవసర అనుమతి ఇచ్చింది. మెక్సికోలోని ఔషధ నియంత్రణ సంస్థ అయిన 'కోఫెరిస్‌' ఈ మేరకు నిర్ణయాన్ని ప్రకటించినట్లు మెక్సికో విదేశాంగ శాఖ మంత్రి మార్సెలో ఎబ్రార్డ్‌ 'ట్వీట్‌' చేశారు. ఇప్పటికే 'కొవాగ్జిన్‌' టీకాకు జింబాబ్వే, నేపాల్‌ దేశాలు అత్యవసర అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మెక్సికో ఈ జాబితాలో చేరింది. దీనివల్ల మెక్సికోకు టీకా సరఫరా చేసే అవకాశం ఏర్పడింది.

ఇదీ చూడండి:'కరోనాపై పోరు ఉద్ధృతం.. టెస్టింగే కీలకం'

ABOUT THE AUTHOR

...view details