ప్రముఖ విద్యుత్ కార్ల తయారీ సంస్థ 'టెస్లా' అధినేత ఎలాన్ మస్క్ ఇప్పుడు ఏం చేసినా అది సంచలనంగానే మారుతోంది. ఆయన వేసే ప్రతి అడుగుని యావత్ ప్రపంచం నిశితంగా గమనిస్తోంది. తాజాగా ఆయన ట్విట్టర్లో డాజ్ కాయిన్ గురించి పలు పోస్టులు పెట్టారు. "డాజ్‌కాయిన్ ప్రజల క్రిప్టో" అని మస్క్ అందులో పేర్కొన్నారు. దీనితో.. డాజ్‌కాయిన్ విలువ.. కొన్ని గంటల్లోనే 50 శాతం పెరిగింది.
కుక్కకు గిఫ్ట్..
మస్క్ ట్వీట్లకు ఆయన ఫాలోవర్స్ ఎప్పుడూ బ్రహ్మరథం పడుతూనే ఉంటారు. గతంలో తనకు 'ఎట్సీ' అనే ఓ ఈ-కామర్స్ కంపెనీ ఇష్టమని మస్క్ ఓ ట్వీట్ చేశారు. ఆ కంపెనీ నుంచి తన కుక్కపిల్లకు ఓ గిఫ్ట్ కూడా కొన్నానని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌తో అమెరికా మార్కెట్లలో 'ఎట్సీ' షేర్లు ఇంట్రాడేలో(జనవరి 26న) రికార్డు స్థాయిలో 8శాతానికిపైగా పెరిగాయి.