Elon Musk Tax To Government: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ నిలిచిన విషయం తెలిసిందే. అంత ఆదాయం కలిగిన మస్క్.. అసలు ప్రభుత్వానికి ఎంత పన్ను చెల్లిస్తారనే విషయంపై అందరికీ ఆసక్తి ఉంటుంది. ఇదే సమయంలో ప్రపంచ కుబేరుడు సరిగ్గా పన్నులు చెల్లిస్తారా అంటూ విమర్శలూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ తాజాగా ట్విట్టర్‌లో స్పందించారు. ఈ ఏడాది తాను దాదాపు రూ.85 వేల కోట్లకుపైనే (11 బిలియన్ డాలర్లు) పన్నుల రూపంలో చెల్లించనున్నట్లు వెల్లడించారు.
ఇటీవలే ఎలాన్ మస్క్‌ను ఈ ఏటి మేటి వ్యక్తిగా టైమ్ మ్యాగజైన్ ప్రకటించింది. దీంతో సామాజిక మాధ్యమాల్లో ప్రశంసల జల్లు కురిసింది. ఇదే సమయంలో మస్క్‌పై వచ్చిన ఓ వార్తా కథనాన్ని ట్యాగ్ చేసిన అమెరికాకు చెందిన డెమొక్రాటిక్ సెనెటర్ ఎలిజబెత్ వార్రెన్.. పన్నులను ఎగవేసే పద్ధతిని మారుద్దాం. దాంతో ‘ది పర్సన్ ఆఫ్ ది ఇయర్’ వాస్తవ పన్నులు చెల్లిస్తారంటూ (ఎలాన్ మస్క్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ) ట్వీట్ చేశారు. సెనెటర్ చేసిన వ్యాఖ్యలకు ఎలాన్ మస్క్ బదులిచ్చారు.