Elon Musk: భారతీయుల ప్రతిభకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు లభిస్తోంది. టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగంలో మనదేశ ప్రభ వెలిగిపోతోంది. ఐటీలో మేటిగా ఎదిగిన భారత్.. మేలిమి నిపుణులకు అడ్డాగా మారుతోంది. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్, ఐబీఎం, పాలో ఆల్టో నెట్‌వర్క్స్ వంటి ప్రపంచస్థాయి టాప్ కంపెనీల సీఈఓలుగా భారత సంతతి వ్యక్తులు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో పరాగ్ అగర్వాల్ చేరారు. ట్విటర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే సోమవారం ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడం వల్ల.. భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ ఆ స్థానంలో నియమితులయ్యారు. ఇప్పటిదాకా ఆయన ఆ కంపెనీకి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీఓ)గా ఉన్నారు.
భారతీయుల ప్రతిభను ప్రశంసిస్తూ ఆర్థిక సేవల సంస్థలకు సాఫ్ట్‌వేర్ అందించే ప్రముఖ కంపెనీ స్ట్రైప్ సీఈఓ పాట్రిక్ కొలిసన్ ట్వీట్ చేశారు. భారత్ నుంచి వచ్చిన వ్యక్తులు టెక్ ప్రపంచంలో రాణించడం ఆనందంగా ఉందన్నారు. అలాగే వలసదారులకు అమెరికా కల్పిస్తున్న అవకాశాలకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు.
పాట్రిక్ కొలిసన్ ట్వీట్‌కు బిలియనీర్, టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ స్పందించారు. 'భారతీయుల ప్రతిభ నుంచి అమెరికా భారీగా లబ్ధి పొందుతోంది' అని వ్యాఖ్యానించారు. టెస్లా, స్పేస్‌ఎక్స్ సహా ఇతర కంపెనీలతో వినూత్న ఆవిష్కరణలకు మస్క్ శ్రీకారం చుడుతున్నారు. అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ.. ప్రస్తుతం ప్రపంచంలోనే మేటి ఆవిష్కర్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతర్జాతీయంగా, ముఖ్యంగా యువతలో విశేష ఆదరణ సంపాదించుకున్నారు. అలాంటి వ్యక్తి భారతీయుల ప్రతిభకు గుర్తించి.. దాన్ని బహిరంగంగా వ్యక్తపరచడం విశేషం. భారతీయుల టాలెంట్‌పై గతంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సైతం పలు సందర్భాల్లో ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.