ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో, పబ్లిక్ సైట్‌లలో అందరూ తమను లైక్ చేయాలని, తమ గురించి మంచిగా రాయాలని కోరుకుంటారు. అయితే ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారు 'టెస్లా' సీఈఓ ఎలాన్ మస్క్ దారే వేరు. వికీపీడియాలో తన పేజీని 'ట్రాష్' చేయాలంటూ తన ఫాలోవర్లను బతిమాలుతున్నారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో... 'దయచేసి నన్ను వికీపీడియాలో ట్రాష్ చేయండి, నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను..' అని పోస్ట్ చేశారు.
సాధారణంగా వికీపీడియాలో ఉన్న సమాచారాన్ని ఎవరైనా ఎడిట్ చేయటానికి వీలవుతుంది. దీనితో ఆయనకున్న అనేక మంది ఫాలోవర్లు ఎలాన్ మస్క్ అభ్యర్థనను నిజం చేసేందుకు సిద్ధమై.. ఆయన రాపర్ అని, ప్లే బాయ్ అని రకరకాలుగా మార్చేయడం మొదలుపెట్టారు. దీంతో వికీపీడియా యాజమాన్యం ఆయన పేజ్‌ను లాక్ చేసేసింది.