Elon musk giving to charity: టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. చిన్నారుల ఆకలి తీర్చేందుకు ప్రపంచ కుబేరులు ముందుకు రావాలని ఐక్యరాజ్యసమితి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డేవిడ్ బేస్లే ఇచ్చిన పిలుపు మేరకు.. సుమారు ఐదు మిలియన్ టెస్లా షేర్లను విరాళంగా ఇచ్చారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్లో దాఖలు చేసిన వివరాల ప్రకారం నవంబర్ 19 నుంచి నవంబర్ 29 వరకు తన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ నుంచి 5 మిలియన్లకు పైగా షేర్లను విరాళంగా ఇచ్చినట్లు చూపించారు.
మస్క్ ఇచ్చిన ఈ విరాళం విలువ ఆ రోజుల్లో షేర్ల సగటు ధర ప్రకారం సుమారు 5.7 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. ఇది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద విరాళాల్లో ఒకటిగా నిలవనుంది. అయితే విరాళంగా ఇచ్చిన ఈ మొత్తాన్ని ఏ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తుంది అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. నియంత్రణా సంస్థలకు ఇచ్చిన సమాచారంలో కూడా ట్రస్ట్ వివరాలు పొందుపరచలేదు.
శ్రీమంతులు తలచుకుంటే ప్రపంచ దేశాల్లోని కోట్ల మంది నిరుపేదల ఆకలి బాధలు తీర్చేయొచ్చని ఐక్యరాజ్యసమితి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డేవిడ్ బేస్లే గతంలో అన్నారు. ప్రపంచంలో సుమారు 4.2 కోట్ల మంది ఆకలి తీర్చేందుకు 6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.45,000 కోట్లు) అవసరమని ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన మస్క్ మీ ప్రణాళికేంటో చెబితే, నిధులు ఎలా సద్వినియోగం చేస్తారో వెల్లడిస్తే.. 6 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను ఇప్పటికిప్పుడు విక్రయించి, ఐక్యరాజ్యసమితి ఫుడ్ ఏజెన్సీకి ఇచ్చేందుకు నేను సిద్ధమేనని అన్నారు. ఈ మేరకు తన కంపెనీ షేర్లను విరాళంగా ఇచ్చారు మస్క్.