ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత, స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్.. ఐక్యరాజ్యసమితికి ఓ సవాల్ విసిరారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆకలి సమస్యను తీర్చేందుకు తాను 6 బిలియన్ డాలర్లు(రూ.44వేల కోట్లు) విరాళంగా ఇస్తానని, అవసరమైతే తక్షణమే టెస్లా షేర్లు విక్రయిస్తానని తెలిపారు. కానీ డబ్బుతో ఆకలి కేకలను ఐరాస ఎలా నిర్మూలిస్తుందో వివరించాలని ట్వీట్ చేశారు.
ఐరాస ఆహార కార్యక్రమం(WFP) డైరెక్టర్ డేవిడ్ బీస్లీ ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రపంచ సంపన్నులైన ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ వంటి వారు తమ సంపదలో 2శాతాన్ని విరాళంగా ఉస్తే ప్రపంచం ఎదుర్కొంటున్న ఆకలి సమస్యను తీర్చవచ్చన్నారు. 6 బిలియన్ డాలర్లు చెల్లిస్తే ఆకలితో అలమటించి చనిపోబోతున్న 42లక్షల మంది ప్రాణాలను కాపాడవచ్చన్నారు.
ఈ వ్యాఖ్యల అనంతరమే మస్క్ ఆదివారం ట్వీట్ చేశారు. తాను 6 బిలియన్ డాలర్లు ఇస్తానని, కానీ ఆకలి సమస్యను ఎలా తీర్చుతారో, నిధులను ఎలా ఖర్చు చేస్తారో వివరించాలన్నారు. అప్పుడే ప్రజలకు నిధులు ఎలా ఖర్చవుతున్నాయో తెలుస్తుందన్నారు.
మస్క్ ట్వీట్‌కు డేవిడ్ బీస్లీ స్పందించారు. '6 బిలియన్ డాలర్లతో ప్రపంచంలో ఆకలి సమస్య తీరకపోవచ్చు, కానీ భౌగోళిక రాజకీయ అస్థిరత్వాన్ని, సామూహిక వలసలను నియంత్రించవచ్చు. ఆకలితో అలమటిస్తున్న 42లక్షల ప్రాణాలను కాపాడవచ్చు. కరోనా, వాతావరణ మార్పు కారణంగా తలెత్తిన సంక్షోభాన్ని తీర్చవచ్చు. అవసరమైతే ఈ విషయంపై క్లుప్తంగా వివరించేందుకు మీతో(మస్క్‌తో) ప్రత్యేకంగా సమావేశమయ్యేందుకు సిద్ధం. భూమిపై లేదా అంతరిక్షంలో ఎక్కడైనా భేటీ అవుతా' అని అన్నారు.