కొవిడ్ ప్రభావం ప్రారంభమైనప్పటి నుంచి ఒడుదొడుకుల్లో సాగుతున్న ఎనిమిది కీలక రంగాల్లో ఉత్పత్తి వరుసగా ఆరోనెల క్షీణించింది. ప్రధానంగా స్టీల్, సిమెంట్, రిఫైనరీ రంగాల్లో క్షీణతతో ఎనిమిది రంగాల్లో ఉత్పత్తి ఆగస్టు నెలలో 8.5శాతం క్షీణించినట్టు కేంద్ర వాణిజ్యశాఖ వెల్లడించింది. బొగ్గు, ఎరువుల ఉత్పత్తి మినహా ఎనిమిది రంగాల్లోని స్టీల్, సిమెంట్, రిఫైనరీ ఉత్పత్తులు, ముడి చమురు, సహజ వాయువు, విద్యుత్ రంగాల్లో ఉత్పత్తి క్షీణించినట్టు వాణిజ్య శాఖ వివరించింది.
వరుసగా ఆరో నెలా క్షీణించిన 8 కీలక రంగాల ఉత్పత్తి
కరోనా సంక్షోభంతో.. ఆగస్టు నెలలో 8 కీలక రంగాల్లో వృద్ధిరేటు 8.5 శాతం క్షీణతను నమోదుచేసింది. వరుసగా ఆరో నెలా వీటి ఉత్పత్తి క్షీణించింది. స్టీల్, సిమెంట్, రిఫైనరీ రంగాలపైనే ప్రభావం అధికంగా ఉంది.
2019 ఆగస్టు నెలలో ఈ రంగాలు 0.2శాతం క్షీణిస్తే ఈసారి ఉత్పత్తి మరింత దిగజారి 8.5శాతం క్షీణించినట్టు వాణిజ్యశాఖ స్పష్టంచేసింది. ఈ ఆగస్టులో స్టీల్ ఉత్పత్తి 6.3శాతం తగ్గితే రిఫైనరీ ఉత్పత్తులు 19.1, సిమెంట్ 14.6, సహజవాయువు 9.5, ముడిచమురు 6.3, విద్యుత్‌ఉత్పత్తి 2.7శాతం తగ్గుదల నమోదుచేసినట్టు తెలిపింది. బొగ్గు ఉత్పత్తి 3.6శాతం పెరిగితే ఎరువుల ఉత్పత్తి 7.3శాతం వృద్ధి నమోదుచేసినట్టు వివరించింది.
2020-21 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఆగస్టు మధ్య 8 రంగాల్లో 17.8శాతం క్షీణత నమోదైనట్టు వివరించింది వాణిజ్య శాఖ.